Abn logo
Mar 2 2021 @ 00:09AM

అడుగులకు మడుగులెత్తి..!

  

ఈ ఫొటో గమనించారా..!? ఇవి సముద్రపు చివరి అంచులు. కోట మండలం కొత్తపట్నంలోని సర్వే నెం. 760లో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పునీటి మడుగులు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి అది కూడా సముద్రంలో పోటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాంతంలో అక్కడక్కడ భూ భాగం కనిపిస్తుంది.రూ. కోట్ల పరిహారం కొల్లగొట్టే యత్నం

చెన్నై-బెంగళూరు ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ భూ సేకరణలో మాయాజాలం

కోట, కొత్తపట్నం కేంద్రంగా తెరలేచిన దోపిడీ

ఇప్పటికి 130 ఎకరాలు... త్వరలో మరో 300 ఎకరాలకు పరిహారం

రూ.కోట్లలో ప్రజాధనం స్వాహా యత్నం

తెరవెనుక ఽఅధికార పార్టీ నాయకుల మంత్రాంగం


అవి ఉప్పు తయారీకి కూడా పనికిరాని భూములు. 30 నుంచి 40 అడుగుల సముద్రపు బ్యాక్‌ వాటర్‌ ఉన్న మడుగులు. అక్కడ నీరు తప్ప భూమి కనబడదు. ఒకవేళ భూమి కనిపించినా అక్కడ గడ్డి కూడా మొలకెత్తదు. అలాంటి భూమి తరతరాలుగా తమ అనుభవంలో ఉందని, అక్కడ సేద్యం చేసుకొని పొట్టపోసుకొంటున్నామని కొందరు తహసీల్దారుకు అర్జీలు పెట్టుకున్నారు. దీంతో నీటిపైనే భూమి కొలతలు తీసి ఎవరి ఆధీనంలో ఎంత విస్తీర్ణం ఉందో లెక్కకట్టి, వాటికి సబ్‌డివిజన్లు చేసి ఆ భూములను ఆ రైతులకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలు చేతబట్టుకొని ఎకరాకు రూ.13 లక్షల పరిహారం పొందడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదంతా గూడూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఒకరిద్దరు  అధికార పార్టీ నాయకులు ఆడుతున్న డ్రామా. 


నెల్లూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : చెన్నై-బెంగళూరు పారిశ్రామికవాడకు 1400 ఎకరాల భూమిని సేకరిస్తారని తెలిసిన వెంటనే ప్రభుత్వం ఆధీనంలోని, వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాని భూమిని  బినామీ పేర్లతో పట్టాలు పొందారు. వాటిని అసైన్‌మెంట్‌ భూముల కింద తిరిగి ప్రభుత్వానికి అప్పగించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం కోసం రచించిన వ్యూహాత్మక పథకం. ఉప్పునీటి మడుగులేంది? వాటిని వ్యవసాయ భూమిగా పట్టాలు ఇవ్వడం ఏమిటీ? ఆ పట్టా కాగితాలను అడ్డుపెట్టుకొని కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయాత్నాలేమిటి? ఈ వ్యవహారం అర్థం కావాలంటే  ఈ కథనం చదవాల్సిందే.


కాసులు చేసుకునే ప్రయత్నం

ఈ ప్రాంతంలో చెన్నై-బెంగళూరు పారిశ్రామికవాడ రానున్న విషయం, ఇందుకోసం భూసేకరణ మొదలైన విషయం తెలిసిందే. 14వేల ఎకరాల భూమిని సేకరించే క్రమంలో ప్రభుత్వ భూమిని, అసైన్‌డ్‌ భూమిని, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అసైన్స్‌డ్‌ భూమికి ఎకరానికి 13 లక్షల పరిహారంగా నిర్ణయించారు. ఈ విషయాలన్నీ ముందే గ్రహించిన ఆ ప్రాంత అధికార పార్టీ నాయకుడు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామికవాడ ప్రతిపాదన 2018లోనే తెరపైకి రావడంతో 2019లో ఈయన పావులు కదిపినట్లు చెబుతున్నారు. పారిశ్రామికవాడ పరిధిలోకి కొత్తపట్నం కూడా ఉంది. ఈ కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో చాలా వరకు ప్రభుత్వానికి చెందిన నిరుపయో గ భూములు ఉన్నాయి. వీటికి పట్టాలు సాధించి వాటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చి పరిహారంగా కోట్ల రూపాయలు దండుకోవాలన్నది అధికార పార్టీ నాయకుని ప్లాన్‌. అలాంటి నిరుపయోగ భూముల్లో కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని 760 సర్వే నంబరు ఒకటి. 


మడుగులకు వ్యవసాయ పట్టాలు

జిల్లాలో పనిచేసే తహసీల్దార్లు ఎవరూ ఈ భూములకు పట్టాలు ఇచ్చే సాహసం చేయలేరు. ఎందుకుంటే ఇవి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాని ఉప్పు భూములు. సముద్రం బ్యాక్‌ వాటర్‌తో ఈ సర్వే నంబరు పరిధిలోని 150 ఎకరాల భూమి నీటి మడుగుగా మారింది.  ఇలాంటి భూమికి పట్టాలు ఇస్తే ఉద్యోగాలకు ప్రమాదమే. సాధారణ పరిస్థితుల్లో అయితే బలవంతంగా ఇచ్చినా వీటిని తీసుకోవడానికి ఏ రైతు ముందుకురారు. అధికార పార్టీ నాయకులు ఇలాంటి భూములను ఎంపిక చేసుకున్నారు. వీటికి బినామీ పేర్లతో పట్టాలు పుట్టించి ఆ భూమిని పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి పరిహారం కింద కోట్లు కొట్టేయాలనుకున్నారు. వీరి ఆలోచన అమలుకు 2019 ఎన్నికల సమయాన్ని ఎంచుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ సమయంలో పక్క జిల్లాలకు చెందిన తహసీల్దార్లు బదిలీపై ఇక్కడికి వచ్చారు. వీరిని వలలో వేసుకున్నారు. ఈ భూములు ఎక్కడున్నాయో కూడా తెలియని తహసీల్దార్‌కు వేల రూపాయల ముడుపులుగా అందడంతో ఉప్పునీటి మడుగులకు అడ్డదిడ్డంగా వ్యవసాయ పట్టాలు ఇచ్చేశారు. కొత్తపట్నం గ్రామ సర్వేనంబరు 760-పి, 760-8, 760-9, 760పి4లలో సుమారు సుమారు 130 ఎకరాల భూమిని పలువురి పేర్లతో పట్టాలు ఇచ్చేశారు. 10-1, 1బి రిజిస్టర్లలో పేర్లు ఎంటర్‌ చేసేవారు. వాస్తవానికి ఇవన్నీ ఉప్పునీటి మడుగులు. సర్వే చేయాలన్నా సాధ్యపడదు. కానీ భూ భాగం కనిపించని ఈ మడుగుల్లో తలో రెండు, మూడు ఎకరాల భూములు వారి ఆధీనంలో ఉన్నట్లు, వారి దరఖాస్తు మేరకు ఆ భూములను సర్వే చేసి సబ్‌ డివిజన్‌ చేసి వారికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. ఇదంతా 2019 ఎన్నికలకు కాస్త ముందు, వెనుక జరిగిన తతంగం. 


రూ. కోట్లు కొల్లగొట్టడానికి రంగం సిద్ధం

కారిడార్‌ భూ సేకరణలో ఇంత కాలం కొంత ప్రతిష్ఠంభన ఏర్పడింది. పట్టా భూములకు పరిహారం విషయంలో రైతులకు అభ్యంతరాలు ఉన్నాయి. పది రోజుల క్రితమే పట్టా భూమికి ఎకరాకు రూ. 21,75,000లకు పరిహారం ఇవ్వడానికి రైతులకు, అధికారులకు మధ్య అంగీకారం కుదిరింది. దీంతో పాటు అసైన్‌మెంట్‌ భూమికి ఎకరానికి రూ. 13 లక్షలు ఇవ్వడానికి ఒప్పదం కుదిరింది. దీంతో ఎవరైతే ఉప్పునీటి మడుగులకు వ్యవసాయ పట్టాలు ఇప్పించుకున్నారో వారి పంట పండినట్లు అయింది. పరిహారం కోసం పథకం ప్రకారం ఉప్పునీటి మడుగులకు పట్టాలు పుట్టించుకున్న అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయల ప్రజాధానాన్ని కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.  ఉప్పునీటి మడుగులు కలిగిన 130 ఎకరాలకు పట్టాలు పొందినవారికి కూడా పరిహారం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే సుమారు రూ. 17 కోట్ల  పరిహారాన్ని బొక్కేయడానికి రంగం సిద్దమయ్యింది. 


మోసాన్ని రుజువు చేస్తోంది..

కొత్తపట్నం సర్వే నంబరు 760లో భూములు ఏ మాత్రం వ్యవసాయానికి పనికిరావనే విషయం గూడూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అందరికీ తెలుసు. 20 నుంచి 30 అడుగుల లోతు సముద్రపు ఉప్పునీటితో నిండిన ఈ భూములను వ్యవసాయం చేసుకోండి పట్టా ఇస్తాం అని దండోరా వేసినా పట్టాలు తీసుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకురారు.  పైగా ఎప్పుడు ఉప్పునీటితో నిండి ఉండే ఈ భూముల్లో వ్యవసాయం ఎలా చేసేది, ఊరికే ఇచ్చినా ఈ భూమి తమకెందుకు అని రైతులు తిరస్కరి స్తారు. అలాంటి భూములను పట్టాలు చేసుకోవడానికి అప్పటి తహసీల్దార్‌కు లక్షల్లో ముడుపులు ఇచ్చి పట్టాలు తీసుకున్నారంటే ఈ పట్టాలు తీసుకోవడం వెనుక ఉన్న మోసం ఏమిటో ఇట్టే అర్థం అవుతుంది. ఈ పట్టాదారులకు ఎకరానికి రూ. 2లక్షలు చొప్పున ఇచ్చి మిగిలిన సొమ్ము అధికార పార్టీకి చెందిన నాయకులు పంచుకోవడానికి ఒప్పదం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. 


మరిన్ని ప్రభుత్వ భూములకు...

కొత్తపట్నం రెవెన్యూ గ్రామం పరిధిలో వ్యవసాయానికి పనికి రాని నిరుపయోగ ప్రభుత్వ భూములు మరో 300 ఎకరాల వరకు ఉన్నట్లు సమాచారం. వీటికి కూడా బినామీ పేర్లతో పట్టాలు తీసుకోవడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా  పట్టా భూములకు పరిహారం పెంచినందుకు కూడా ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని కొంత మంది రైతులను మధ్యవర్థులుగా పెట్టి రైతుల నుంచి అధికార పార్టీ నాయకులు ఒప్పందాలు చేసుకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ఎకరానికి  రూ.18 లక్షలుగా ఉన్న పరిహారాన్ని తాజాగా రూ.21.75 లక్షలకు పెంచారు. మేము, మా పెద్ద నాయకుడు కష్టపడి ఎకరానికి 3.75 లక్షలు పెంచాం, కాబట్టి ఎకరానికి లక్ష రూపాయల చొప్పున మాకు ఇవ్వండి అని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ప్రజాధనం పరిరక్షణ బాధ్యత ఉన్నతాధికారులదే

కొత్తపట్నం భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులకు సైతం పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అసైన్డ్‌ భూములకు పరిహారాలు చెల్లించే సమయంలో అవి నిజంగా రైతుల అనుభవంలో ఉన్నవా, లేదా ఎందుకు పనికిరాని ఉప్పునీటి మడుగులా అన్న విషయాన్ని ఉన్నతాధికారులు గమనించాల్సి ఉంది. గతంలో కృష్ణపట్నం పోర్టు భూ సేకరణలో ఇలాంటి అక్రమాలు జరిగితే ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపి రెవెన్యూ రికార్డులను మొత్తం సీజ్‌ చేశారు. ఆ రికార్డులను పరిశీలిస్తే నిజమైన పట్టాదారులు ఎవరో, ఇటీవల  పుట్టుకొచ్చిన బినామీ పట్టాలు ఏవో వెలుగు చూస్తాయని కోట ప్రాంత ప్రజలు అంటున్నారు. ఉన్నతాఽధికారులు ఈ దిశగా ఆలోచించాల్సి ఉంది.

 

Advertisement
Advertisement
Advertisement