రూ.962 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-06-23T09:22:14+05:30 IST

గత ఏడాది ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, పూనావాలా వంటి కుబేరుల సంపద మరింత పెరిగినప్పటికీ.. భారత మిలియనీర్ల (డాలర్లలో) మొత్తం సంపద మాత్రం..

రూ.962 లక్షల కోట్లు

2020లో భారత శ్రీమంతుల మొత్తం సంపద విలువ ఇది.. 

2019తో పోలిస్తే 4.4%  తగ్గుదల.. రూపాయి పతనమే కారణం

భారీగా తగ్గిన మిలియనీర్ల సంఖ్య .. క్రెడిట్‌ స్వీస్‌ వెల్లడి 


ముంబై: గత ఏడాది ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, పూనావాలా వంటి కుబేరుల సంపద మరింత పెరిగినప్పటికీ.. భారత మిలియనీర్ల (డాలర్లలో) మొత్తం సంపద మాత్రం స్వల్పంగా తగ్గింది. 2019తో పోలిస్తే 59,400 కోట్ల డాలర్లు (4.4 శాతం) తగ్గి 2020లో 12.833 లక్షల కోట్ల డాలర్లకు జారుకుంది. మన కరెన్సీలో ఈ విలువ రూ.962 లక్షల కోట్లు. రూపాయి విలువ పతనమే ఇందుకు కారణమని క్రెడిట్‌ స్వీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది డాలర్‌ మిలియనీర్ల (కనీసం రూ.7.5 కోట్ల సంపద కలిగినవారు) సంఖ్య 6,98,000కు పడిపోయింది. అంతక్రితం సంవత్సరంలో వీరి సంఖ్య 7,64,000గా నమోదైంది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


గత ఏడాది ప్రపంచంలో డాలర్‌ మిలియనీర్లు 52 లక్షల మేర పెరిగి 5.61 కోట్లకు చేరుకున్నారు. అందులో భారత మిలియనీర్ల వాటా కేవలం ఒక శాతమే. 


2025 నాటికి భారత్‌లో డాలర్‌ మిలియనీర్లు 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. 


గత ఏడాదికి గాను ప్రతి భారత వయోజన వ్యక్తి సగటు సంపద 14,252 డాలర్లుగా ఉంది. 2000 నుంచి 2020 మధ్య కాలంలో సంపద 8.8 శాతం వార్షిక సగటు వృద్ధి రేటుతో పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8 శాతంతో పోలిస్తే చాలా అధికం. 


2020 చివరినాటికి దేశంలో కనీసం 5 కోట్ల డాలర్ల (రూ.375 కోట్లు) సంపద కలిగిన అపర కుబేరులు 4,320 మంది ఉన్నారు. 


హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సంపద గత ఏడాది గంటకు రూ.90 కోట్ల చొప్పున పెరిగింది. 2020లో మొత్తం రూ.2,77,700 కోట్లు పెరిగి రూ.6,58,400 కోట్లుగా నమోదైంది. 


బ్లూంబర్గ్‌ డేటా ప్రకారం.. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద 1,620 కోట్ల డాలర్లు పెరిగింది. 


గత ఏడాది ప్రపంచ శ్రీమంతుల మొత్తం సంపద 28.7 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2025 నాటికి 39 శాతం వృద్ధి చెంది 583 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ఈ ఐదేళ్లలో ప్రపంచ మిలియనీర్లు 8.4 కోట్లకు పెరగవచ్చని అంచనా. 

Updated Date - 2021-06-23T09:22:14+05:30 IST