రూ.9 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌!

ABN , First Publish Date - 2022-05-13T07:54:02+05:30 IST

నిధులిస్తేనే ప్రాజెక్టుల పనులు ముందుకు సాగుతాయని నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. కనీసం భూసేకరణకైనా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు...

రూ.9 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌!

నిధులిస్తేనే సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు..

కనీసం 5 వేల కోట్ల బిల్లులైనా చెల్లించండి

భూసేకరణకైనా నిధులివ్వండి..!

ప్రభుత్వానికి చీఫ్‌ ఇంజనీర్ల మొర

మంత్రి హరీశ్‌రావు వద్దకు చేరిన వ్యవహారం

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): నిధులిస్తేనే ప్రాజెక్టుల పనులు ముందుకు సాగుతాయని నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. కనీసం భూసేకరణకైనా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘బిల్లులు క్లియర్‌ చేయకుండా పనులు చేయలేం. అత్యవసర ప్రాతిపదికన రూ.5 వేల కోట్ల బిల్లులనైనా చెల్లించాలి. ప్రాజెక్టుల పనులు ముందుకు కదలాలంటే బిల్లుల విడుదలే కీలకం’ అంటూ నీటిపారుదల శాఖ సీఈలు మొరపెట్టుకున్నారు. 19 మంది సీఈలతో నీటిపారుదల శాఖ వర్క్‌షాప్‌ పెట్టగా.. వారంతా బిల్లులు చెల్లించండం మహాప్రభో అని వేడుకున్నారు. ఆర్థిక శాఖలో బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు 2498 ఎకరాల భూమి అవసరమని వర్క్‌షా్‌పలో గుర్తించగా.. ఇందుకు గాను భూసేకరణతో పాటు పరిహారం, పునరావాసం, పునర్నిర్మాణానికి రూ.700 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. వివిధ ప్రాజెక్టుల పనులకు దాదాపు రూ.9 వేల కోట్ల దాకా చెల్లింపులు చేయాల్సి ఉందని గుర్తించారు. సకాలంలో బిల్లులు చెల్లించనందువల్ల ప్రాజెక్టుల పనుల్లో వేగం మందగించిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 2021 అక్టోబరు 31 నాటికి అన్ని ప్రాజెక్టులకు కలిపి 7,583 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఇది 9 వేల కోట్లు దాటింది. ఈ బిల్లుల్లో మూడోవంతు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలవే కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఎల్లంపల్లి, సీతారామ, డిండి ఎత్తిపోతలు ఉన్నాయి. అయితే బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయని చీఫ్‌ ఇంజనీర్లంతా మొరపెట్టుకోవడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు ఆర్థిక మంత్రి హరీశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ప్రాజెక్టుల వారీగా బిల్లులపై సమావేశం పెట్టాలని యోచించగా.. మంత్రి బిజీగా ఉండడంతో పెండింగ్‌లో పెట్టారు. 


ట్రబుల్‌ షూటర్‌ కరుణించేనా..?

హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బిల్లులు క్లియర్‌ చేయించే పని చూడడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి బిల్లులపై పర్యవేక్షణ చేసేవారు. ప్రస్తుతం ఈ శాఖకు మంత్రే లేకపోవడంతో బిల్లులు పేరుకుపోయాయి. చివరికి నాగార్జునసాగర్‌ డ్యామ్‌ ప్రమాదంలో ఉందని నివేదికలు వచ్చినా.. మరమ్మతులకు నిధులు ఇవ్వలేని దుస్థితి ఉంది. మూడేళ్లుగా మరమ్మతులకు అనుమతులివ్వాలని అధికారులు ప్రతిపాదనలను పంపిస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు రావడం, కృష్ణా బోర్డు కూడా దీనిపై అధ్యయనం చేసి, మరమ్మతులు చేయాలని గుర్తుచేయడంతో ఇటీవలే రూ.20 కోట్లను సాగర్‌ మరమ్మతులకు ఇచ్చారు. అయితే బిల్లుల వ్యవహారం మంత్రి వద్దకు చేర డంతో ఆయన దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

Read more