గంటకు రూ. 90 కోట్లు...

ABN , First Publish Date - 2020-09-30T03:58:10+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన... గంటకు రూ. 90 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ఆయన వరుసగా తొమ్మిదవ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58 లక్షల కోట్లకు పెరిగిన నేపధ్యంలో ఆయనకు ఈ ప్రత్యేకత దక్కింది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.

గంటకు రూ. 90 కోట్లు...

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన... గంటకు రూ. 90 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ఆయన వరుసగా తొమ్మిదవ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58 లక్షల కోట్లకు పెరిగిన నేపధ్యంలో ఆయనకు ఈ ప్రత్యేకత దక్కింది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో... రిలయన్స్ విలువ భారీగా పెరిగింది. ఆగస్ట్ 31 తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ. 6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో రూ. వెయ్యి కోట్లకు మించి సంపద ఉన్న 828 మందిని పరిశీలించారు. వీరిలో 627 మంది సంపద పెరగగా, మరో 229 మంది సంపద మాత్రం తగ్గింది. కాగా... గతంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 75 మంది ఈసారి చోటు దక్కించుకోలేకపోయారు.


ఈ జాబితాలో కొత్తగా 162 మంది చోటు దక్కించుకున్నారు. ఇక... ఆదాయంలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిస్తే, మహిళల్లో స్మితా వి క్రిష్ణ రూ. 32,400 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక టాప్ 10 కుబేరులకు సంబంధించి హురున్ జాబితాలో రెండో స్థానంలోని హిందూజా సోదరుల సంపద(రూ.1,43,700 కోట్లు) 23 శాతం క్షీణించింది. మూడో స్థానంలోని శివనాడర్, ఫ్యామిలీ(రూ.1,41,700 కోట్లు) సంపద 34 శాతం పెరిగింది.


ఇక... నాలుగో స్థానంలోని గౌతమ్ అదానీ, ప్యామిలీ(రూ.1,40,200 కోట్లు) సంపద 48 శాతం పెరిగింది. అయిదవ స్థానంలోని అజీమ్ ప్రేమ్‌జీ, కుటుంబం సంపద(రూ.1.14 లక్షల కోట్లు) రెండు శాతం క్షీణించింది. ఆరవ స్థానంలోని సైరస్ పూనావాలా సంపద(రూ.94,300 కోట్లు) ఆరు శాతం పెరిగింది. ఏడవ స్థానంలోని రాధాకిషన్ ధమానీ, కుటుంబం సంపద(రూ.87,200 కోట్లు) 56 శాతం పెరిగింది.


ఎనిమిదవ స్థానంలోని ఉదయ్ కోటక్ సంపద(రూ.87,000 కోట్లు) 8 శాతం క్షీణించింది. - 9వ స్థానంలోని దిలీప్ శాంఘ్వీ సంపద (రూ.84 వేల కోట్లు) 17 శాతం పెరిగింది. ఇక పదవ స్థానంలోని సైరస్ పల్లోంజీ మిస్త్రీ, షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీల సంపద(రూ.70 వేల కోట్ల చొప్పున) తొమ్మిది శాతం క్షీణించింది. కాగా... ముఖేష్ అంబానీ సంపద ఓ సమయంలో 28 శాతం క్షీణించడం విశేషం. ఆ తర్వాత దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో 85 శాతం పెరిగింది. మొత్తంగా 73 శాతం సంపద పెరిగింది. 


Updated Date - 2020-09-30T03:58:10+05:30 IST