రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి...

ABN , First Publish Date - 2022-05-19T22:22:58+05:30 IST

స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది.

రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి...

ముంబై : : స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్ముతున్నారు. అమెరికా, జపాన్‌, చైనా, సింగపూర్‌ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడంతో మదుపర్ల సెంటిమెంటు దారుణంగా దెబ్బతింది. ప్రత్యేకించి ఐటీ షేర్ల పతనం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. NSE Nifty 15,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది. BSE Sensex 100 పాయింట్ల వరకు నష్టాల్లో ఉంది.


ఇన్వెస్టర్లు దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వరకు నష్టపోయారు. క్రితం సెషన్లో 54,208 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు  53,070 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఈ క్రమంలో... 53,053 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే అమ్మకాల వెల్లువతో సూచీ నేల చూపులు చూస్తోంది. ఈ క్రమంలో... 53,356 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఇక... బుధవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,917 వద్ద మొదలైనప్పటినుంచే నష్టాల బాట పట్టింది. ఈ క్రమంలో...  15,903 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 15,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.


మొత్తంగా 300 పాయింట్లు నష్టపోయి 15,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టీ బ్యాంక్‌ ఉదయం 33,461 వద్ద మొదలై, 33,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 33,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం(మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి) 645 పాయింట్ల నష్టంతో 33,515 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 లో కేవలం రెండు కంపెనీలు లాభాల్లో, 48 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, విప్రో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ 4 శాతం వరకు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు తెగనమ్ముతున్నారు. పతనం ఇంకా కొనసాగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-19T22:22:58+05:30 IST