బద్వేలులో భూ మేతలు....

ABN , First Publish Date - 2022-05-11T06:52:13+05:30 IST

బద్వేలు మున్సిపాలిటీ గోపవరం, బద్వేలు మండలాల్లో విస్తరించి ఉంది. ఆ నియోజకవర్గానికి ఇదే పెద్ద పట్టణం. ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు లేవు. అందరికీ వ్యవసాయ పనులు, కూలీ పనులే ఆసరా. నియోజకవర్గంలోని చాలా మంది ఉపాధి కోసం బద్వేలు చేరుతుంటారు. బద్వేలు

బద్వేలులో భూ మేతలు....
బద్వేలులో ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో బోర్డులు పాతిన రెవెన్యూ యంత్రాంగం

నకిలీ పత్రాల సృష్టి

రూ.500 కోట్ల నివాస స్థలాలు తారుమారు

నకిలీ కుట్రను ఛేదిస్తున్న ఆర్డీవో

17 మందిపై కేసులు నమోదు

నకిలీగాళ్లలో ప్రకంపనలు


కాలజ్ఞాన తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి బద్వేలు బస్తీ అవుతుందని నాలుగు శతాబ్దాల క్రితమే కాలజ్ఞానంలో చెప్పారు. అయితే అదే బద్వేలులో భూ మే(నే)తలు రాక్షసులు పుట్టుకొస్తారనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో కొందరు రాక్షసులుగా మారి ఖాళీ భూములను, ఇంటి స్థలాలను ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలకు ఇచ్చినా సరే.. ఇది మాదంటూ వాలిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను చంకలో పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. కంచే చేనుమేస్తే అన్న చందంగా పేదలకు రక్షణగా ఉండాల్సిన రెవెన్యూ భూమేతలకు సలాం చేస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదన్న చందంగా రెవెన్యూ అధికారులే వీరికి సహకరిస్తుండడంతో  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.500 కోట్ల మేర అక్రమ పట్టాలు సృష్టించి లావాదేవీలు జరిగినట్లు బద్వేలులో చర్చ నడుస్తోంది. 


(కడప-ఆంధ్రజ్యోతి) : బద్వేలు మున్సిపాలిటీ గోపవరం, బద్వేలు మండలాల్లో విస్తరించి ఉంది. ఆ నియోజకవర్గానికి ఇదే పెద్ద పట్టణం. ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు లేవు. అందరికీ వ్యవసాయ పనులు, కూలీ పనులే ఆసరా. నియోజకవర్గంలోని చాలా మంది ఉపాధి కోసం బద్వేలు చేరుతుంటారు. బద్వేలు పరిఽధిలో రిజిస్టర్‌ భుముల కన్నా డీకేటీ భూములు ఎక్కువ. గూడు లేని పేదలకు గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. అయితే అప్పట్లో ఆ స్థలాలు శివారు ప్రాంతాల్లో ఉండడం, ఆర్థిక స్థోమత లేక చాలా మంది ఇళ్లు నిర్మించుకోలేదు.

నకిలీల దందా

బద్వేలు, గోపవరం మండలాల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 5 వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా కొందరు ఇళ్లు నిర్మించుకోకపోతే పిల్లల పెళ్లికి కట్నంగా ఆ స్థలాలు ఇవ్వచ్చు అనే ఆళతో మరికొందరు ఇళ్లు కట్టుకోలేదు. అలా సుమారు 2వేల పట్టాల్లో ఇంకా స్థిర నివాసం ఏర్పరుచుకోలేదు. మీకు ఇచ్చి స్థలాల్లో ఎందకు ఇళ్లు నిర్మించుకోలేదు? నిబంధనల ప్రకారం ఇళ్లు కట్టుకోకపోతే రద్దు చేసి వేరేవారికి ఇస్తామని ఇంత వరకు రెవెన్యూ అధికారులు వారికి నోటీసులు ఇవ్వలేదని అంటున్నారు.


అధికారం మాటున అక్రమాలు 

గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. బద్వేలుపై దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకున్న ప్రత్యేక ప్రేమను పలు సందర్భాల్లో చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ సర్కార్‌ వచ్చిన తరువాత బద్వేలులో భూ ఆక్రమణలు పెరిగిపోయాయి. ఖాళీ స్థలం ఉంటే చాలు వాలిపోతున్నారు. బద్వేలులో ప్రముఖులుగా పేరొందిన కొందరు నకిలీ పట్టాల తయారీని స్థిరీకరణ చేసి ఖాళీ స్థలాల ఆక్రమణకు పాల్పడుతున్నారు. దీంతో ఖాళీ జాగా ఉంటే చాలు ఈ స్థలం మాదే అంటూ వాలిపోతున్నారు.. ఈ భూ ఆక్రమణలకు రెవెన్యూ అధికారులు కూడా కొందరు సహకరించారు. ఇలా ఖాళీగా ఉన్న ప్లాట్లలో చాలా మటుకు ఇది మాదే అంటూ నకిలీలు సృష్టించారు. బద్వేలులో సెంటు స్థలం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య పలుకుతోంది. కనీసం 500 పట్టాలకు నకిలీలు సృష్టించి అమ్మేసినట్లు సమాచారం. ఈ స్థలం మాది.. ఇస్తావా... చస్తావా అంటూ బెదిరించడంతో పేదలు ఎంతో కొంత తీసుకొని ఇచ్చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఇచ్చిన ఇంటి స్థలాల్లో నకిలీలు సృష్టించి సుమారు సుమారు 500 కోట్ల మేర క్రయ విక్రయాలు జరిపినట్లు బద్వేలులో చర్చ నడుస్తోంది.


చండశాసనుడు

బద్వేలులో భూ ఆక్రమణలపై ఇంతవరకు ఏ అధికారి చేయని పని తొలి ఆర్డీవోగా అడుగుపెట్టిన ఆకుల వెంకటరమణ చేస్తున్నారు. ప్రచారానికి దూరంగా తనదైన శైలిలో  చర్యలు చేపడుతున్నారు. మా స్థలాలు, భూములు ఆక్రమించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు బుల్లెట్‌లా దూసుకెళుతున్నారు. బద్వేలును శాసిస్తున్న ప్రముఖ అధికార పార్టీ నేతలతో పాటు ఫోర్జరీ పట్టాలు సృష్టిస్తున్న వారి పాలిట చండశాసనుడిగా మారారు. బద్వేలులో భూ ఆక్రమణల గుట్టురట్టు చేసేందుకు, నకిలీగాళ్లను బట్టబయలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడ్డం లేదు.


నకిలీ పట్టాల తయారీలో 17 మందిపై కేసు నమోదు

బద్వేలు మున్సిపాలిటీలో ఖాళీ స్థలాలు ఉన్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నకిలీ పట్టాల తయారీ దారులపై యాక్షన్‌ మొదలైంది. రెండువారాల క్రితం  నకిలీ పట్టాలు తమారు చేస్తున్న ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇతడిని విచారించిన అనంతరం ఇటీవల మరో 17మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో ఇద్దరు వీఆర్వోలు ఉండడం గమనార్హం. నకిలీ పట్టాలు సృష్టించే వారిలో  వీఆర్వోలు రవికుమార్‌, కుమార్‌ ఉన్నారు. వీరితో పాటు బత్తిన రవిశంకర్‌, మన్యం బాబురావు, ఓబుల్‌రెడ్డి, టక్కు రవి, కొలవలి వేణుగోపాల్‌, పీవీ రమణ, కంబాల బుజ్జి, పుష్పరాజు, ప్రియాంక, బోవిల్లరాము, సాయి(జిరాక్స్‌సెంటర్‌), పోకల సుబ్బారెడ్డి, బక్క రవి, ఈగ వరదారెడ్డి, పిల్లి భాస్కర్‌ పై కేసు నమోదు చేశారు. దీంతో నకిలీ పట్టాలు తయారు చేసేవారిలో ఆందోళన మొదలైంది.


ప్రత్యేక బృందాల ఏర్పాటు

నకిలీగాళ్ల గుట్టు రట్టు చేసేందుకు కలెక్టర్‌ విజయరామరాజు, ఆర్డీవో వెంకటరమణ సిద్ధమయ్యారు. రెవెన్యూ, పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ దౌర్జన్యంగా భూములు, స్థలాలు ఆక్రమిస్తున్నారు... అసలు పట్టా ఎవరిది... పొజిషన్‌లో ఎవరు ఉన్నారనేది గుర్తించి అక్రమార్కులకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు.


ఽధైర్యంగా ముందుకు రండి.. న్యాయం చేస్తా

- ఆకుల వెంకటరమణ, ఆర్డీవో బద్వేలు 

ప్రభుత్వం ఇచ్చిన భూములు, ఇంటి స్థలాలను ఆక్రమిస్తే ఎవరికీ భయపడకుండా ఽధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయండి. భూకబ్జాలు, నకిలీ పట్టాల తయారీపై కలెక్టర్‌ విజయరామరాజు చాలా సీరియస్‌గా ఉన్నారు. భూకబ్జాల భరతం పట్టాల్సిందిగా ప్రభుత్వం, కలెక్టర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మీకు అన్యాయం జరిగితే ఎవరి రికమండేషన్‌ లేకుండా నేరుగా నన్ను కలవండి. న్యాయం చేస్తా.


బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించం

నలుగురిపై పీడీ యాక్టు నమోదు

చట్టాన్ని అతిక్రమిస్తే జిల్లా బహిష్కరణే..

కలెక్టర్‌ వి.విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), మే 10: చట్టాన్ని అతిక్రమించి బెదింపులు, దురాక్రమణలకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని.. అలాంటివారిని జిల్లా నుంచి బహిష్కరిస్తామని కలెక్టర్‌ వి.విజయరామరాజు హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌తో కలసి కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి కలెక్టర్‌ మాట్లాడారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలో భూ ఆక్రమణల కేసులతో పాటు రెండు రోజుల క్రితం ఒక ప్రైవేట్‌ నిర్మాణ సంస్థకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులు అందాయన్నారు. వెంటనే కేసు ఫైల్‌ చేసి జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది సమన్వయంతో విచారణ జరిగిందన్నారు. కాల్‌ డేటా ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేశామన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా జిల్లాలో చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారన్నారు. ఒకటిన్నర నెల క్రితం చోటు చేసుకున్న సంఘటనలకు  సంబంధించి నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల బద్వేలు నియోజకవర్గంలో నకిలీ పట్టాలతో దౌర్జన్యాలు, దురాక్రమణలు, మట్కా, తప్పుడు రిజిస్ర్టేషన్లు వంటి నేరపూరిత సంఘటనలు పాల్పడ్డారని తమ దృష్టికి రాగానే చర్యలు చేపట్టామన్నారు. అటువంటి సంఘటనలపై ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరు 144000కు గానీ ఏఎస్పీ సెల్‌ నెంబరు 944079 6900కు, లేదా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Read more