అంత్యక్రియలకు రూ.40 వేలు

ABN , First Publish Date - 2021-06-20T05:49:30+05:30 IST

తమ వారు మరణించిన బాధలో కుటుంబసభ్యుల ఉంటే అంత్యక్రియల నిర్వహణకు వారి నుంచి దళారులు దబాయించి మరీ అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారు. తాము అడిగిన ప్రకారం డబ్బు ఇస్తేనే సరి లేదంటే మీ ఇష్టమని కరాఖండిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ఇచ్చి అంత్యక్రియలు జరిపించుకుంటున్నారు.

అంత్యక్రియలకు రూ.40 వేలు
సంగారెడ్డిలోని వైకుంఠధామం

కొవిడ్‌ మృతుల కుటుంబాల నుంచి అదనంగా వసూళ్లు

శ్మశానవాటికల్లో కొత్త రకం దందా 

సాధారణ మరణాలకు రూ.20 వేల వరకు 

మున్సిపాలిటీ రుసుము రూ.12 వేలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 19 : తమ వారు మరణించిన బాధలో కుటుంబసభ్యుల ఉంటే అంత్యక్రియల నిర్వహణకు వారి నుంచి దళారులు దబాయించి మరీ అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారు. తాము అడిగిన ప్రకారం డబ్బు ఇస్తేనే సరి లేదంటే మీ ఇష్టమని కరాఖండిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ఇచ్చి అంత్యక్రియలు జరిపించుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కొందరు వ్యక్తులు అంత్యక్రియలను ఇలా దందాగా మార్చేశారు. అధికంగా డబ్బు వసూలు చేస్తున్న సంగతి తెలిసినా మున్సిపల్‌ అధికారులు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. 


నిర్ణయించిన రేటు కంటే అధికంగా వసూళ్లు

సంగారెడ్డి పట్టణంలోని శ్మశానవాటిల్లో కొందరు దళారుల అవతారమెత్తారు. పట్టణంలోని అన్ని శ్మశానవాటికల వద్ద అంత్యక్రియల నిర్వహణకు కాటికాపరులున్నారు. వీరికి కూడా మున్సిపాలిటీ ఛార్జీలను నిర్ణయించింది. అయితే కాటికాపరులను పక్కన పెట్టి, పట్టణంలో కొందరు దీన్ని వ్యాపారంగా మార్చేశారు. అంత్యక్రియల నిర్వహణకు మున్సిపాలిటీ నిర్ణయించిన దాని కంటే అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారు. సాధారణ సమస్యలతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు రూ.12 వేలు తీసుకోవాలని మున్సిపాలిటీ సూచిస్తే దళారులు రూ.20 నుంచి రూ.25 వేల వరకు డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారు. అదే కొవిడ్‌తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలకైతే రూ.30 నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నారు. తీరా డబ్బు తీసుకున్న దళారులు శ్మశానవాటిక వద్ద ఉన్న కాటికాపరులకు మాత్రం మున్సిపాలిటీ నిర్ణయించిన ఛార్జీలను ఇచ్చి సరిపెడుతున్నారు. దళారులకు మున్సిపల్‌ కౌన్సిలర్లు కొందరు మద్దతు ఇస్తుండడం వల్లే తామేమీ చేయలేకపోతున్నామని మున్సిపల్‌ అధికారవర్గాలు తెలిపాయి. ఏమైనా జిల్లా యంత్రాంగం అంతా ఉండే సంగారెడ్డిలో అంత్యక్రియలను సైతం దందాగా మార్చేడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ప్రైవేట్‌ వైకుంఠ రథాలకు రూ.10 వేలు

సంగారెడ్డిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వైకుంఠరథం ఒకటి ఉండగా, ప్రైవేట్‌ వైకుంఠరథాలు మూడు ఉన్నాయి. వీటికి మారుతీ వ్యాన్‌ అంబులెన్స్‌ల మాదిరిగానే ఛార్జీలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. సంగారెడ్డిలోని వివిధ కాలనీల్లో మరణించిన వారి దేహాలను వైకుంఠధామాలకు తీసుకెళ్లేందుకు మున్సిపల్‌ వైకుంఠ రథానికైతే వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే ప్రైవేట్‌ వైకుంఠ రథానికైతే రూ.10 వేల వరకు ఇవ్వాల్సి వస్తున్నది. మున్సిపాలిటీలో ఒకటే వైకుంఠ రథం ఉండడంతో ప్రైవేట్‌ రథాలకు కూడా డిమాండ్‌ ఉన్నది. ఈ డిమాండ్‌ను ఆసరా చేసుకుని నిర్వాహకులు కిలోమీటరు దూరం, రెండు గంటల పాటు ఉండడం కోసం రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. అంబులెన్స్‌ల, వైకుంఠ రథాల నిర్వాహకులు ఇలా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నా మున్సిపల్‌, రెవెన్యూశాఖలు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి.

Updated Date - 2021-06-20T05:49:30+05:30 IST