రూ.3.80 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-04-03T09:59:05+05:30 IST

భారత విదేశీ వాణిజ్య రంగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఇండస్‌ ఈసీటీఏ) కుదిరింది.

రూ.3.80 లక్షల కోట్లు

వచ్చే ఐదేళ్లలో భారత్‌-ఆస్ట్రేలియా  ద్వైపాక్షిక వాణిజ్యంపై అంచనా


ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

6,000కు పైగా భారత ఉత్పత్తులకు సుంకం మినహాయించిన ఆస్ట్రేలియా

5-7 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలకు దోహదం

పదేళ్లకు పైగా కాలంలో అభివృద్ధి చెందిన దేశంతో కుదుర్చుకున్న తొలి వాణిజ్య ఒప్పందమిదే 


న్యూఢిల్లీ: భారత విదేశీ వాణిజ్య రంగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఇండస్‌ ఈసీటీఏ) కుదిరింది.

దృశ్యమాధ్యమ విధానంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భారత, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, స్కాట్‌ మోరిసన్‌ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్‌ గోయల్‌, డాన్‌ టెహాన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గడిచిన పదేళ్లకు పైగా కాలంలో అభివృద్ధి చెందిన దేశంతో భారత్‌ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. దాదాపు 4 నెలల్లో అమల్లోకి రానున్న ఈ అగ్రిమెంట్‌లో భాగంగా భారత్‌కు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, చేపలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఫర్నీచర్‌, నగలు, యంత్రాలు, క్రీడా వస్తువులు, రైలు బోగీ లు సహా 6,000కు పైగా ఉత్పత్తులకు ఆస్ట్రేలియా ఎలాంటి సుంకాలు విధించకుండా  ప్రవేశం కల్పించనుంది. ప్రస్తుతం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 2,750 కోట్ల డాలర్ల (రూ.2.09 లక్షల కోట్లు) స్థాయిలో ఉందని.. వచ్చే ఐదేళ్లలో ఈ విలువ 5,000 కోట్ల డాలర్ల (రూ.3.80 లక్షల కోట్లు)కు చేరుకునేందుకు తాజా ఒప్పందం తోడ్పడనుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ సందర్భంగా అన్నారు. అంతేకాదు, వచ్చే 5-7 ఏళ్లలో 10 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు సైతం దోహదపడనుందన్నారు. భారత్‌కు ఆస్ట్రేలియా 17వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆస్ట్రేలియాకు ఇండియా 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఏడాది ఆస్ట్రేలియాకు భారత్‌ 690 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. ఆ దేశం నుంచి 1,510 కోట్ల డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 


ఈ ఏడాదిలో రెండో తాత్కాలిక ఒప్పందం:ప్రస్తుతం ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం భవిష్యత్‌లో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందానికి (సెపా) బాట లు వేయనుందని భారత్‌ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తోనూ భారత్‌ ఇదే తరహా ఒప్పందం కుదుర్చుకుంది. 


భారత్‌కు ప్రయోజనాలు 

వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తొలి రోజు నుంచే 96.4 శాతం భారత ఎగుమతులకు (విలువపరంగా) సుంకం మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ఎగుమతయ్యే వస్తువులు, ఉత్పత్తులపై ఆస్ట్రేలియా 4-5 శాతం కస్టమ్స్‌ సుంకం వసూలు చేస్తోంది. ఈ సుంకం మినహాయింపుతో ప్రధానంగా కార్మిక శక్తిపై ఆధారపడే టెక్స్‌టైల్స్‌, వ్యవసాయం, చేపలు, తోలు, పాదరక్షలు, ఫర్నీచర్‌, నగలు, యంత్రాల రంగాలకు అధిక ప్రయోజనం చేకూరనుంది. 


 ఆస్ట్రేలియా నుంచి భారత్‌లోకి ప్రధానంగా ముడి సరుకులు, ఇంటర్మీడియేటరీ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియా నుంచి ముడి సరుకులు, ఇంటర్మీడియేటరీ ఉత్పత్తులను మన పరిశ్రమలు చౌకగా దిగుమతి చేసుకునేందుకు వీలు లభించనుంది. తద్వారా వాటి పోటీ సామర్థ్యం పెరగనుంది. ప్రధానంగా స్టీల్‌, అల్యూమినియం, దుస్తుల తయారీ రంగాలకు అధిక లబ్ధి చేకూరనుంది. 


దేశంలోని పలు రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆస్ట్రేలియా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులను భారత్‌ సుంకం మినహాయింపు కల్పించలేదు. ఆ జాబితాలో పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బొమ్మలు, సన్‌ఫ్లవర్‌, సీడ్‌ ఆయిల్‌, వాల్‌నట్‌, పిస్తా, ప్లాటినమ్‌, గోధుమలు, బియ్యం, సజ్జలు, శనగలు, యాపిల్‌, చక్కెర, ఆయిల్‌ కేక్‌, బంగారం, వెండి,ఆభరణాలు, ముడి ఇనుము, పలు వైద్య యంత్రాలు ఉన్నాయి. వీటిని మరే దేశం గుండా భారత్‌లోకి దిగుమతి చేయకుండా ఉండేలా ఆస్ట్రేలియాతో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 


దేశీయ స్టీల్‌ సహా ఇతర పారిశ్రామిక రంగాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు అసాఽధారణంగా పెరగకుండా ఒప్పందం ఖరారు చేసుకుంది.


ఫార్మా రంగం విషయానికొస్తే, ఈ ఒప్పందం ఫాస్ట్‌ట్రాక్‌ అనుమతులు, త్వరితగతిన ఔషధ తయారీ యూనిట్ల తనిఖీలకు వీలు కల్పించనుంది. 


ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన భారత విద్యార్థులకు 2-4 ఏళ్ల పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాల జారీ. యువ వృత్తి నిపుణులకు (18-30 ఏళ్ల వారు) ఏడాది వర్క్‌ అండ్‌ హాలీడే వీసా ఏర్పాట్లు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పలు విశ్వవిద్యాలయాల్లో లక్షకు పైగా భారత యువత విద్యనభ్యసిస్తున్నారు.


ఏటా 1,800 మంది భారతీయ సంప్రదాయ చెఫ్‌లు, యోగా టీచర్లను కాంట్రాక్టు సేవల సరఫరాదారులుగా ఆస్ట్రేలియా తన దేశంలోకి అనుమతించనుంది. వీరికి 4 ఏళ్లపాటు వారి దేశంలో సేవలందించేందుకు వీలుగా వీసాలు మంజూరు చేయనుంది. 


దేశీయ ఐటీ కంపెనీలు ఆస్ట్రేలియాలో ఎదుర్కొంటున్న డబుల్‌ ట్యాక్సేషన్‌ సమస్యను కూడా పరిష్కరించేందుకు ఆ దేశం అంగీకరించింది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో సాంకేతిక సేవలందిస్తున్న భారత కంపెనీలపై ఆఫ్‌షోర్‌ పన్ను విధింపును నిలిపివేసేందుకు అంగీకరించింది. 


 ఆస్ట్రేలియాకు ప్రయోజనాలు


ఒప్పందంలో భాగంగా ఆస్ట్రేలియా నుం చి 85 శాతం దిగుమతులకు భారత్‌ సుంకం మినహాయింపు కల్పించనుంది. అందులో బొగ్గు, గొర్రె మాంసం, ఉన్ని, ఎల్‌ఎన్‌జీ, అల్యూమినా, మాంగనీస్‌, రాగి, నికెల్‌ ముడి లోహాలు, టైటానియం, జిర్కోనియం ఈ జాబితాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి మొత్తం దిగుమతుల్లో 74 శాతం వాటా బొగ్గుదే. ప్రస్తుతం ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే బొగ్గుపై మన ప్రభుత్వం 2.5 శాతం సుంకం వసూలు చేస్తోంది. ప్రధానంగా స్టీల్‌ సహా ఇతర రంగాలు వినియోగించే కోకింగ్‌ కోల్‌లో 73 శాతం ఆస్ట్రేలియా నుంచే దిగుమతి అవుతోంది. ఆ దేశం నుంచి థర్మల్‌ బొగ్గు కూడా దిగుమతి అవుతోంది. 


వచ్చే పదేళ్లలో ఆస్ట్రేలియా వైన్‌ ఉత్పత్తులపై సుంకాన్ని భారత్‌ దశల వారీగా తగ్గించనుంది. వైన్‌ ఉత్పత్తుల ధర ఆధారంగా ఈ రాయితీలు కల్పించనుంది. 


ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి దిగుమతయ్యే అవకాడో, ఉల్లిపాయలు, పిస్తా  పప్పు, జీడిపప్పు, బ్లూబెర్రీస్‌, రాస్ప్‌బెర్రీస్‌, బ్లాక్‌బెర్రీ్‌సపైన ప్రస్తుతం వసూ లు చేస్తున్న 30 శాతం వరకు సుంకాన్ని కూడా భారత్‌ వచ్చే 7 ఏళ్లలో దశల వారీగా మినహాయించనుంది. 


ఆస్ట్రేలియన్‌ వైద్య పరికరాలపై సుంకాలను వచ్చే 5-7 ఏళ్లలో మినహాయించనుంది. 


ఒప్పందం అమలులోకి రాగానే, ఆస్ట్రేలియా గొర్రె మాంసం 30 శాతం సుంకానికి పూర్తి మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో దాదాపు 20 శాతం వాటా ఆస్ట్రేలియా గొర్రె మాంసానిదే. 


భారత ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది కీలక పరిణామం. ఈ అగ్రిమెంట్‌ ద్వారా ఇరు దేశాల మధ్య సరఫరా నెట్‌వర్క్‌ సామర్థ్యం పెరగడంతో పాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంత స్థిరత్వానికీ దోహదపడనుంది. అంతేకాదు, ఇరు దేశాల మధ్య విద్యార్థులు, వృత్తి నిపుణులు, పర్యాటకుల పరస్పర బదిలీకి తోడ్పడనుంది.

    - ప్రధాని నరేంద్ర మోదీ 


ఆస్ట్రేలియాతో కుదుర్చున్న ఒప్పందంతో వచ్చే మరికొన్నేళ్లలో భారత చెఫ్‌లు, యోగా ట్రైనర్లకు పుష్కల అవకాశాలు లభించనున్నాయి.

  - కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ 


భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంతోపాటు పెట్టుబడుల పెంపునకు ఒప్పందం దోహదపడనుంది. 

  - భారత ఎగుమతిదారులు 


Updated Date - 2022-04-03T09:59:05+05:30 IST