ఒక చిత్రానికి బడ్జెట్.. హీరో మార్కెట్‌ను బట్టి, అతడి క్రేజ్‌ను బట్టి నిర్ణయిస్తారు. కథ డిమాండ్ చేస్తే బడ్జెట్ పెరుగుతూ వెళుతుంది. అయితే ఇప్పుడు బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమా అనే సరికొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. పాన్ ఇండియా స్థాయి కథ సెట్ అయితే.. హీరో స్థాయి చూడడం లేదు. ఇప్పుడు ‘హనుమాన్’ (Hanuman) అనే చిత్రానికి అదే జరుగుతోంది. ‘అ! (A!), కల్కి (Kalki), జాంబిరెడ్డి (Jombi Reddy) ’ అనే మూడే మూడు సినిమాలు తీసి.. వైవిధ్యమైన దర్శకుడిగా ముద్ర పడ్డాడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). వాటిలో ‘జాంబిరెడ్డి’ చిత్రానికి బాగా డబ్బులొచ్చాయి. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన తేజా సజ్జా (Teja Sajja) ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమాతో టాలీవుడ్లో మొట్టమొదటిగా జాంబీ జోనర్ ను పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా తెచ్చిపెట్టిన ఉత్సాహంతో.. మళ్ళీ తేజా సజ్జానే హీరోని చేస్తూ . టాలీవుడ్లో మొట్ట మొదటిసారిగా సూపర్ హీరో (Super Hero) జోనర్ లో ‘హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ‘హనుమాన్’ చిత్రం విడుదల కానుండడం విశేషం. అయితే ఇందులో తేజా సజ్జా లాంటి చిన్న స్థాయి హీరో నటిస్తున్నప్పటికీ.. చిత్రానికి ఏకంగా రూ. 30 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్టు టాక్. తేజాపై ఇంత బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. కాకపోతే పాన్ ఇండియా మార్కెట్ స్ట్రాటజీ (Pan India Market Strategy) ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి రూ. 22 కోట్లకు అమ్మేసినట్టు టాక్. అంటే మరో రూ. 8 కోట్లు రాబడితే.. పెట్టినడబ్బులు తిరిగి వచ్చేసినట్టే. సినిమా బాగుంటే.. థియేటర్స్ నుంచి మిగిలినది రాబట్టడం ఏమంత కష్టం కాదు. అలాగే.. సినిమా పెద్ద హిట్టైతే.. లాభాలు కూడా వాటంతటవే వస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. మరి సూపర్ హీరో హనుమాన్.. ప్రేక్షకులకి ఏ స్థాయిలో వినోదాన్ని అందిస్తాడో చూడాలి.