మిర్చి కిలో రూ.3

ABN , First Publish Date - 2021-09-14T05:45:55+05:30 IST

పచ్చటి పంట..! గుత్తులు గుత్తులుగా విరగ్గాసిన మిరప కాయలు. మార్కెట్‌లో మంచి ధర ఉంటే.. చెట్లకు పైసలు కాసినట్లే..! కానీ ఏం చేస్తాం..? అన్నదాతను దురదృష్టం వెంటాడుతోంది.

మిర్చి కిలో రూ.3

  1.  రైతు బాగుపడేది ఎన్నడు..?
  2.  ప్రభుత్వం కొనాలని అన్నదాత వినతి


కోడుమూరు(రూరల్‌)/ హొళగుంద, సెప్టెంబరు 13: పచ్చటి పంట..! గుత్తులు గుత్తులుగా విరగ్గాసిన మిరప కాయలు. మార్కెట్‌లో మంచి ధర ఉంటే.. చెట్లకు పైసలు కాసినట్లే..! కానీ ఏం చేస్తాం..? అన్నదాతను దురదృష్టం వెంటాడుతోంది. మార్కెట్‌లో కిలో రూ.3 మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు కంటతడి పెడుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టారు. 3 నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. దిక్కుతోచక చేతికొచ్చిన పంటను పొలంలోనే వదిలేస్తున్నారు రైతులు. హొళగుంద మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఈ రైతులందరూ తీవ్రంగా నష్టపోయి అప్పులపాలయ్యారు.


దారుణంగా ధర


మార్కెట్లో పచ్చిమిర్చి ధరలు దారుణంగా పడిపోయాయి. రైతుకు కిలో రూ.3 మాత్రమే లభిస్తోంది. కోత ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 10 కిలోల గంప ధరలు స్థిరంగా కొనసాగుతూ రూ.300 నుంచి రూ.400 వరకు పలికాయి. అప్పుడు వర్షాలు అధికమై పైర్లు దెబ్బతిన్నాయి. కోడుమూరు మండలంలో దాదాపు 200 ఎకరాల్లో పచ్చిమిర్చి సాగయ్యింది. మార్కెట్లో 10 కిలోలకు రూ.30 నుంచి రూ.40 కొంటున్నారని రైతులు వాపోతున్నారు. కోతకు ఒక్కో కూలీకి రూ.250 చొప్పున ఇస్తున్నామని, కూలీలు 50 కిలోల వరకు కోస్తారని తెలిపారు. పచ్చిమిర్చి నిల్వ చేయడానికి వీలుపడదు. కోత పూర్తయిన వెంటనే మార్కెట్‌కు తరలించాల్సిందే. దీనికి ఆటో బాడుగ రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్లో ఉన్న ధరలకు కూలీలకు, ఆటోకు జేబులో డబ్బులు ఎదురు ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 


తీవ్ర నష్టం..


ఎకరం పొలంలో మిర్చి సాగు చేశాను. తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. ఎరువులు, మందుల ధరలను విపరీతంగా పెంచారు. ఒక్కో కూలీకి రూ.250 ఇచ్చి కోత కోయించాము. మార్కెట్‌కు తెస్తే 10 కిలోల పచ్చిమిర్చి రూ.30 నుంచి రూ.40 మించడం లేదు. కూలీలు, ఆటో ఖర్చులకు కూడా గిట్టుబాటు కావడం లేదు. దారుణంగా నష్టపోతున్నాం. 


- నరసింహుడు, మెరుగుదొడ్డి


గిట్టుబాటు ధర కల్పించాలి..


పచ్చిమిర్చికి మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేవు. రైతులకు కిలో రూ.3 మాత్రమే అందుతోంది. బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు కిలో రూ.30 విక్రయిస్తున్నారు. రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం మాకు గిట్టుబాటు ధర కల్పించాలి.   

  - లింగన్న, మెరుగుదొడ్డి


పొలంలో వదిలేశాడు..

హొళగుందకు చెందిన రైతు మర్రిస్వామి రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాడు. ఎరువులు, మందులకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టాడు. పంట విరగ్గాసింది. మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతుండగా, కిలో రూ.2 నుంచి రూ.3కు అడుగుతున్నారని తెలిసింది. దీంతో పంటను కోయకుండా చేనులోనే వదిలేశాడు. ప్రభుత్వం మిరప దిగుబడును కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-09-14T05:45:55+05:30 IST