గ్యాస్‌ బండ ‘ధర’వు

ABN , First Publish Date - 2021-02-26T09:08:47+05:30 IST

పొగలేని పొయ్యి ఎంతో సౌకర్యం అనుకుంటే జేబుకు సెగ పెడుతోంది. గ్యాస్‌ బండ మరింత భారమైంది. వంట గ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ,

గ్యాస్‌ బండ ‘ధర’వు

సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్‌పై రూ.25 పెంపు 

20 రోజుల్లో పెంచడం మూడోసారి.. 

మూడు వారాల్లోనే రూ.100 పెరుగుదల

హైదరాబాద్‌లో సబ్సిడీ సిలిండర్‌ ధర 846.5కి చేరిక

3 నెలల్లో రూ.200 పెంచడమా?: ప్రియాంక


న్యూఢిల్లీ, హైదరాబాద్‌ ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పొగలేని పొయ్యి ఎంతో సౌకర్యం అనుకుంటే జేబుకు సెగ పెడుతోంది. గ్యాస్‌ బండ మరింత భారమైంది. వంట గ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్‌ సిలింండర్‌ ధరలు రూ.25 చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫిబ్రవరి నెలలో గ్యాస్‌ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పెరిగిన ధరలు గురువారమే అమల్లోకి వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.769 ఉండగా తాజా పెంపుతో రూ.794కు చేరింది. హైదరాబాద్‌లో వినియోగదారులు సబ్సిడీ సిలిండర్‌కు ఇక రూ.846.50 చెల్లించాల్సి ఉంటుంది. కోల్‌కోతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి గ్యాస్‌ బండ ధర చేరింది. వంట గ్యాస్‌ ధర ఈనెల 4న 25 రూపాయలు పెరిగితే, మళ్లీ 15న 50 రూపాయలు పెంచారు. తాజా పెంపుతో మూడు వారాల్లోనే రూ.100 పెంచినట్లయింది. కాగా సిలిండర్‌ ధర మళ్లీ పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 1.18 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున 50 లక్షల సిలిండర్ల వినియోగం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ ఒక్క నెలలో పెరిగిన రూ.100తో వినియోగదారులపై నెలకు రూ.50 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇప్పటికే కేంద్రం వంట గ్యాస్‌ సబ్సిడీ పథకానికి తూట్లు పొడిచింది. ఏడాదిగా వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వటం లేదు. ఆయిల్‌ కంపెనీలు మాత్రం ఒక్కో సిలిండర్‌ మీద రూ.40 రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాయి. అదితప్ప కేంద్రం గతంలో ప్రకటించిన సబ్సిడీ మాత్రం అందటంలేదు. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో ఇంకా తేరుకోకముందే వంట గ్యాస్‌ ధరలు ఈ స్థాయిలోపెరగడం ఏమిటని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికోసారి వంటగ్యాస్‌ ధరలు సవరించినా... పెరగటం కాకుండా, తగ్గేలా చూడాలనే అభిప్రాయాన్ని వినియోగదారులు వ్యక్తంచేస్తున్నారు. వంట గ్యాస్‌ ధరల పెంపు నేపథ్యంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ భగ్గుమంది. వంట గ్యాస్‌ ధరలను గత మూడు నెలల్లోనే రూ.200 పెంచారని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-02-26T09:08:47+05:30 IST