ఆ బ్యాంకుల్లో... భారతీయుల డబ్బు రూ. 20,700 కోట్లు...

ABN , First Publish Date - 2021-06-18T21:08:44+05:30 IST

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద అనూహ్యంగా పెరిగిపోయింది. తాజా గణాంకాల ప్రకారం... ఈ మొత్తం రూ. 20,700 కోట్లకు చేరుకుంది.

ఆ బ్యాంకుల్లో... భారతీయుల డబ్బు రూ. 20,700 కోట్లు...

ముంబై : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద అనూహ్యంగా పెరిగిపోయింది. తాజా గణాంకాల ప్రకారం... ఈ మొత్తం రూ. 20,700 కోట్లకు చేరుకుంది. కిందటి సంవత్సరం చివరి నాటికి లెక్కలివి. రెండేళ్ల పాటు క్షీణించినప్పటికీకిందటి క్యాలెండర్ సంవత్సరంలో మాత్రం ఈ సందపద పెరిగిపోయింది. ఈ క్రమంలో... స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద పదమూడు సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నట్లైంది. ఇక... 2019 క్యాలెండర్ ఏడాది ముగిసే సమయానికి భారతీయులు, భారతీయ  కంపెనీలు దాచుకున్న సొమ్ము విలువ దాదాపు రూ. 6,625 కోట్లుగా నమోదయ్యింది. బాండ్స్, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. 


స్విస్ సెంట్రల్ బ్యాంకు నివేదిక...

ఖాతాదారుల డిపాజిట్లు 2020 లో క్షీణించినట్లు స్విట్జర్లాంట్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020 సంవత్సరంలో దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు చేరుకున్నాయి. ఇందులో విదేశీ ఖాతాదారుల డిపాజిట్లు 600 బిలియన్ డాలర్లు. ఇక... 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో బ్రిటన్ అగ్రస్థానంలో, 152 బిలియన్ డాలర్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. వంద బిలియన్ ఫ్రాంక్స్‌‌లకు పైగా ఉన్న దేశాలు ఈ రెండు మాత్రమే. ఇక... 2006 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు కాగా, 2011, 2013, 2017 సహా మరికొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన సంవత్సరాల్లో ఈ పరిమాణాలు కొంతమేర తగ్గాయి. ఇక... నిరుడు(2020 లో) కస్టమర్ అకౌంట్ డిపాజిట్ 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ. 4 వేల కోట్లు. ముందటేడు(2019 లో) ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్‌లు. 


తమ బ్యాంకుల్లో దాచిన సొమ్మును నల్లధనంగా పరిగణించలేమని ఆ స్వట్జర్లాండ్ దేశం పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే... పన్ను ఎగవేతలు, అక్రమార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు సహకరిస్తామని మాత్రం తెలిపింది. ఈ క్రమంలో... రెండు దేశాల మధ్య 2018 నుండి అవగాహన ఒప్పందం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-18T21:08:44+05:30 IST