Jul 29 2021 @ 20:57PM

సెన్సార్‌ గండం గట్టెక్కిన ‘రూ. 2000’ చిత్రం

కోలీవుడ్: ఫీనిక్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రుద్రన్‌ దర్శకత్వంలో నిర్మాత కో.పచ్చియప్పన్‌ నిర్మించిన చిత్రం ‘రూ.2000’. ఈ చిత్రం సెన్సార్‌ అడ్డంకులను అధిగమించి త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రముఖవక్తలు భారతీకృష్ణకుమార్‌, రుద్రన్‌ పరాసు, షర్నిక, రాజకీయ విశ్లేకుడు అయ్యనాథన్‌, స్త్రీవాద కార్యకర్త ఓవియా, తమిళ దేశీయ ఆలోచనాకర్త త్యాగు, ప్రముఖ జర్నలిస్టులు జెన్‌రామ్‌, ఉమ, జీవసహాబ్దన్‌ నటించారు. వీరితో పాటు ‘పరియోరుమ్‌ పెరుమాళ్‌’ ఫేం కరాటే వెంకటేష్‌, ‘బిచ్చగాడు’ నటుడు మూర్తి, బిర్లా బోస్‌, రంజనా, దర్షన్‌, జాకువార్‌ తంగం, కర్బగవళ్ళి, ప్రియదర్శిని తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ బోర్డు తొలుత రిలీజ్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసేందుకు సమ్మతించలేదు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా అనేక డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. దీంతో 105 సన్నివేశాలు, డైలాగులను తొలగించారు.


అయితే, ఇలాంటి డైలాగులను పెట్టడానికి, సన్నివేశాలను చిత్రీకరించడానికి గల కారణాలను చిత్ర బృందం ఆధారాలతో సహా సెన్సార్‌ బోర్డు సభ్యులకు సమర్పించింది. దీంతో ఈ చిత్రానికి కత్తిరింపులను 105 నుంచి 25కు తగ్గించారు. అదేసమయంలో ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. ఆ విధంగా సెన్సార్‌ గండం నుంచి గట్టెక్కిన ‘రూ.2000’ చిత్రాన్ని థియేటర్లు తెరుచుకున్న తర్వాత విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత పచ్చియప్పన్‌ వెల్లడించారు. అలాగే, త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకను కూడా నిర్వహించనున్నారు.