బరితెగింపు..

ABN , First Publish Date - 2022-05-02T06:16:54+05:30 IST

బద్వేలు... ఈ పేరు చెబితే కాలజ్ఞాన తత్వవేత్త వీరబ్రహ్మేంద్రస్వామి వారు గుర్తుకొచ్చేవారు. ఆయన చెప్పినట్లుగానే బద్వేలు పట్టణం బస్తీ అవుతోంది. అయితే ఇప్పుడు బద్వేలు అనగానే టక్కున గుర్తొచ్చేది భూకబ్జాలు. ఇక్కడ సెంటు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలి ఆక్రమించేస్తున్నారు. అలా కోట్లు విలువ చేసే ఎన్నో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

బరితెగింపు..
బద్వేలులో వెలసిన లేఔట్లు

ఆక్రమిద్దాం... అమ్మేద్దాం 

ప్రభుత్వ భూముల్లో వెంచర్లు 

ప్లాట్లు వేసి విక్రయం 

రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి పరాధీనం 


ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. ప్రభుత్వ భూమి, బంజరు భూమి, వంకలు, వాగులు, చెరువులు, వంకలు కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. దర్జాగా వెంచర్లు వేసి కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. యంత్రాంగం కళ్లప్పగించి చూడటం తప్పా అడ్డుకున్న పాపాన పోలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బద్వేలులో రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. 


కడప, మే 1 (ఆంధ్రజ్యోతి): బద్వేలు... ఈ పేరు చెబితే కాలజ్ఞాన తత్వవేత్త వీరబ్రహ్మేంద్రస్వామి వారు గుర్తుకొచ్చేవారు. ఆయన చెప్పినట్లుగానే బద్వేలు పట్టణం బస్తీ అవుతోంది. అయితే ఇప్పుడు బద్వేలు అనగానే టక్కున గుర్తొచ్చేది భూకబ్జాలు. ఇక్కడ సెంటు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలి ఆక్రమించేస్తున్నారు. అలా కోట్లు విలువ చేసే ఎన్నో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తుండడంతో రాత్రికి రాత్రే భూమి మాయమవుతోంది. అయితే ఇప్పుడు సుమారు రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్‌ వేసి ప్లాట్లుగా అమ్ముతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమిద్దాం.. అమ్మేద్దాం అన్నట్లుగా కొందరు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నిర్వాహకుల పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. 

బద్వేలు పట్టణం విస్తరిస్తోంది. అట్లూరు, బి.కోడూరు, బి.మఠం, గోపవరంతో పాటు నెల్లూరు జిల్లా సరిహద్దు మండలాలైన మర్రిపాడు ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారు. ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. బద్వేలు, గోపవరం మండలాల పరిఽధిలో మున్సిపాలిటీ ఉంది. జాతీయ రహదారితో పాటు బైపా్‌స రోడ్డు వస్తోంది. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు మాదిరిగానే ఇక్కడా రియల్‌ భూమ్‌ రెక్కలు తొడిగింది. అయితే ఇక్కడున్న భూముల్లో 70 శాతం అన్నీ డీకేటీ భూములే. అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగా వంకలు, వాగులు, చెరువుతట్టు భూములు, వంక పొరంబోకులు, పశువులు మేపుకునేందుకు బీడు భూములు మిగిలి ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వంక పొరంబోకు చెరువు తొట్లు, మిగతా నిషేధ భూముల్లో ఎలాంటి పట్టాలు ఇవ్వకూడదు. అందుకే వాటిని అలా వదిలేశారు. 


ఆక్రమించి అమ్మేదాం : 

పట్టణంలో కొన్నిచోట్ల రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే మైదుకూరు రోడ్డులోని ఓ థియేటర్‌ వెనుకవైపు ఓ వెంచర్‌ ఉంది. దాని సమీపంలో బంకపాలెం దగ్గర ప్రభుత్వ పొరంబోకు, శ్మశాన స్థలాలు ఉన్నాయి. అయితే వీటిని కూడా కొందరు ఆక్రమించేసి లేఔట్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసిన విషయాన్ని 33వ వార్డు కౌన్సిలర్‌ ఎం.సునీత మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి అనుమతులు లేకుండా లేఔట్లు వేసి అంటగడుతున్నారని పలువురు చెబుతున్నారు. 


సెంటు రూ.7 లక్షలు : 

సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లేఔట్‌లో రహదారులు ఇతర వాటికి తీసేస్తే దాదాపు మూడున్నర ఎకరాల్లో ప్లాట్లు వేసినట్లు చెబుతున్నారు. సెంటు రూ.7 లక్షల చొప్పున ప్లాట్లు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన భూమి రూ.20 కోట్లకు పైగా విలువ చేస్తుందని అంటున్నారు. అనుమతులు లేకుండా లేఔట్లు వేయడంతో పాటు అడ్డంగా పట్టణం నడిబొడ్డున స్థలాన్ని ఆక్రమించి విక్రయించడం ఇదేం బరితెగింపు అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు : 

అనధికార లేఔట్లపై మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను ప్రభుత్వం సూచించిన ఈసీఐఎంఎస్‌ యాప్‌లో అప్లోడ్‌ చేశారు. ప్రభుత్వ భూమిలో వేస్తున్న వెంచర్‌ను కూడా అధికారులు అడ్డుకున్నారు. అయితే మున్సిపల్‌ అధికారులపై తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. విలువైన భూమి కావడంతో వదులుకునేందుకు రియల్టర్లు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. కాగా, కొందరు ప్రభుత్వ భూమి అని తెలియక కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆంధ్రజ్యోతి టౌన్‌ప్లానింగ్‌ అధికారి రాజుతో మాట్లాడగా ఈ విషయాన్ని ఆర్డీవో, తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ భూముల్లో లేఔట్లు వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2022-05-02T06:16:54+05:30 IST