Saudi Arabia: విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకునే కంపెనీలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-07-26T13:57:54+05:30 IST

విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకునే సంస్థలకు తాజాగా సౌదీ అరేబియా (Saudi Arabia) పబ్లిక్ ప్రాసిక్యూషన్ కీలక సూచనలు చేసింది.

Saudi Arabia: విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకునే కంపెనీలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్

రియాద్: విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకునే సంస్థలకు తాజాగా సౌదీ అరేబియా (Saudi Arabia) పబ్లిక్ ప్రాసిక్యూషన్ కీలక సూచనలు చేసింది. ఒకవేళ తమ సూచనలు బేఖాతరు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. విదేశీ ఉద్యోగులను చట్టవిరుద్ధంగా నియమించుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అలాగే తమ ఉద్యోగులను వేరే వారి కోసం పని చేయడానికి కూడా పంపించకూడదని చెప్పింది. చట్టవిరుద్ధంగా విదేశీ ఉద్యోగులను నియమించుకున్న లేదా తమ ఉద్యోగులను ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించే కంపెనీలు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది. 


నిబంధనలు పాటించని సంస్థలకు 10వేల సౌదీ రియాళ్ల(రూ.2.12లక్షలు) వరకు జరిమానాతో పాటు 5ఏళ్ల వరకు రిక్రూట్‌మెంట్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని తెలిపింది. అలాగే వారి స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ తెలియజేసింది. అంతేగాక సదరు సంస్థ ఎండీకి ఒక ఏడాది వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ యజమాని ప్రవాసుడు అయితే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని పేర్కొంది. ఇక రెసిడెన్సీ, పని, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను తెలియజేసేందుకు మక్కా, రియాద్ ప్రాంతాల వారు 911 నంబర్‌కు, మిగిలిన ప్రాంతాల వారు 999 నంబర్లకు కాల్ చేయవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. 


Updated Date - 2022-07-26T13:57:54+05:30 IST