పారిశుధ్యం కోసం రూ.2 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-03-27T09:21:59+05:30 IST

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు రూ. 2కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.

పారిశుధ్యం కోసం రూ.2 కోట్లు విడుదల

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ నీలం సాహ్ని


గుంటూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు రూ. 2కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. గురువారం రాత్రి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా వ్యాధి నివారకచర్యలకు వినియోగించాలని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పనులు, ఉద్యోగం రీత్యా వచ్చి ఇక్కడ ఉండిపోయినవారికి ఆహారం, వసతి కల్పించాలన్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లో స్వస్థలాలకు వెళ్లనీయకుండా లాక్‌డౌన్‌లో ఉండేలా చూడాలన్నారు. ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్న కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి వారికి ఇబ్బందిలేకుండా చేయాలన్నారు. 


వివిధ నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ  ఎంటీ కృష్ణబాబు నేతృత్వంలో 1902 కాల్‌ సెంటర్‌ని 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటుచేశామన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన యాత్రికులు కూడా అక్కడే ఉండేలా చేసి వారికి ఆహారం, వసతి కల్పించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరిని గుర్తించి వారిని హోం ఐసోలేషన్‌లోనే ఉంచాలన్నారు. 


ప్రజలపై దురుసుగా ప్రవర్తించొద్దు: డీజీపీ

లాక్‌డౌన్‌ అమలులోభాగంగా ఎక్కడా ప్రజలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించొద్దని డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశించారు. ఆయన మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు. ప్రజారోగ్య ఎమర్జన్సీ కొనసాగుతున్నందున లాక్‌డౌన్‌ని ప్రజలు పాటించేలా చూడాలన్నారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు అనువైన పరిస్థితులు ఏర్పరచాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి డిమాండ్‌, సప్లై చైన్‌ తెగిపోకుండా చూడాలన్నారు. 


కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్‌ మాట్లాడుతూ బుధవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన 27మందిని ఐసోలేషన్‌ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందర్నీ గుర్తించామని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీజీ త్రిపాఠి, గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు,  అర్బన్‌ పోలీసు అధికారి పీహెచ్‌డీ రామకృష్ణ, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T09:21:59+05:30 IST