ఫార్మాకు రూ.15,000 కోట్ల ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2021-02-25T06:19:36+05:30 IST

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ఔషధ తయారీ రంగానికి రూ.15,000 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర

ఫార్మాకు రూ.15,000 కోట్ల ప్రోత్సాహకాలు

 ఔషధ రంగానికి పీఎల్‌ఐ పథకం

 ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ 


న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ఔషధ తయారీ రంగానికి రూ.15,000 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ కమిటీ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. విలువైన, క్లిష్టమైన ఔషధాలను తయారు చేయడంతో పాటు ఫార్మా రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈ పథకం దోహదపడనుందని కేంద్రం భావిస్తోంది. 2020-21 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది. ఈ పథకంతో 2022-23 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో ఔషధ కంపెనీల విక్రయాలు రూ.2.94 లక్షల కోట్లు, ఎగుమతులు రూ.1.96 లక్షల కోట్ల మేర పెరగవచ్చని అంచనా.


అంతేకాదు, ప్రత్యక్షంగా 20,000, పరోక్షంగా 80,000 ఉద్యోగాల సృష్టికి దోహదపడనుందని భావిస్తోంది. అలాగే, ఈ పథకం వల్ల ఫార్మా రంగంలోకి రూ.15,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. ప్రోత్సాహకాల కేటాయింపు కోసం కేంద్ర ప్రభు త్వం గత ఆర్థిక సంవత్సర (2019-20) గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ రెవెన్యూ (జీఎంఆర్‌) ఆధారంగా దేశంలోని ఫార్మా కంపెనీలను మూడు బృందాలుగా, ఫార్మా ఉత్పత్తులను మూడు విభాగాలుగా వర్గీకరించింది. ఔషధ పరిశ్రమలో అన్ని స్థాయిల కంపెనీలకు పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఫార్మా పరిశ్రమ ఉత్పత్తిపరంగా ప్రపంచంలో మూడో అతిపెద్దది. దేశీయ  ఫార్మా ఇండస్ట్రీ పరిమాణం 4,000 కోట్ల డాలర్లు. 



ప్రోత్సాహకాలు ఇలా.. 


 కేటగిరీ 1, 2 పరిధిలోకి వచ్చే ఔషధాల తయారీకి మొదటి నాలుగేళ్లు విక్రయాల పెరుగుదలలో  10 శాతం. ఐదో సంవత్సరం లో 8 శాతం, ఆరో సంవత్సరంలో 6 శాతం. 


 కేటగిరీ 3 పరిధిలోకి వచ్చే ఔషధాల తయారీకి మొదటి నాలుగేళ్లు విక్రయాల పెరుగుదలపై  5 శాతం, ఐదో సంవత్సరంలో 4 శాతం, ఆరో సంవత్సరంలో 3 శాతం. 


ఔషధ ఉత్పత్తుల ఆధారంగా వర్గీకరణ 

కేటగిరీ 1        బయోఫార్మాస్యూటికల్స్‌,   కాంప్లెక్స్‌ జెనరిక్‌ డ్రగ్స్‌, పేటెంటెడ్‌ డ్రగ్స్‌ 

కేటగిరీ 2        ఏపీఐ, ఆటో ఇమ్యూన్‌ డ్రగ్స్‌

కేటగిరీ 3        యాంటీ-కేన్సర్‌, యాంటీ-డయాబెటిక్‌ డ్రగ్స్‌ 



జీఎంఆర్‌                              పీఎల్‌ఐ కేటాయింపులు (రూ.కోట్లు) 

రూ.5,000 కోట్లు, ఆపైన          11,000

రూ.500-5,000 కోట్లు            2,250

రూ.500 కోట్ల లోపు                       1,750


Updated Date - 2021-02-25T06:19:36+05:30 IST