జగనన్న విద్యాదీవెనకు రూ.122 కోట్లు ఇచ్చాం

ABN , First Publish Date - 2021-12-01T05:19:18+05:30 IST

జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు రూ.122 కోట్లను విద్యార్థుల తల్లులకు అందించామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

జగనన్న విద్యాదీవెనకు రూ.122 కోట్లు ఇచ్చాం
చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, మేయర్‌ స్రవంతి

విద్యార్థులకు చెక్కును అందజేసిన కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 30 : జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు  రూ.122 కోట్లను విద్యార్థుల తల్లులకు అందించామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం జగనన్న విద్యాపథకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో త్రైమాసిక మొత్తాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా తిక్కన భవన్‌లో కలెక్టర్‌ రూ.42.65కోట్ల చెక్కును విద్యార్థులు, వారి తల్లిదండ్లులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులను సమకూర్చి కార్పొరేట్‌ స్థాయిలో తీర్చి దిద్దేలా తయారు చేస్తున్నామన్నారు. అందు వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మున్సిపల్‌ పాఠశాలల్లో సీట్లు లేవనే పరిస్థితి వచ్చిందని తెలిపారు. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా అక్షర క్రాంతి పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. 1.33 లక్షల మంది నిరక్షరాస్యులను చదివించడానికి  మూడు నెలల నుంచి సాయంత్రం బడులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యాదీవెన పథకం ద్వారా లబ్ధిపొందిన డి.సాయిశరణ్య, కె. గురుప్రేమి, హేమంత్‌ తదితర విద్యార్థులతో కలెక్టర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నగర మేయర్‌ పి.స్రవంతి, జేసీలు గణేష్‌కుమార్‌, రోజ్‌మాండ్‌, సాంఘిక సంక్షేమశాఖ డీడీ యు. చిన్నయ్య, బీసీ సంక్షేమాధికారి బి.వెంకటయ్య, గిరిజన సంక్షేమాధికారి రోశిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:19:18+05:30 IST