రూ.11.05కోట్లు ఈడీ అటాచ్‌!

ABN , First Publish Date - 2020-10-23T10:03:46+05:30 IST

గుడివాడ యూనియన్‌(గతంలో ఆంధ్రాబ్యాంకు) బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్న కేసులో నిమ్మగడ్డ రామకృష్ణ,..

రూ.11.05కోట్లు ఈడీ అటాచ్‌!

గుడివాడ యూబీని మోసం చేసిన కేసు కొలిక్కి

యూనియన్‌ బ్యాంక్‌కు రూ.36.97 కోట్ల నష్టం

నిమ్మగడ్డ రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆస్తులు సీజ్‌

చేపల చెరువుల సాగుకు రుణం తీసుకుని వేరే

   వ్యాపారాలకు మళ్లింపు అభియోగం  


గుడివాడ, అక్టోబరు 22: గుడివాడ యూనియన్‌(గతంలో ఆంధ్రాబ్యాంకు) బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్న కేసులో నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్‌, వీవీఎన్‌కే విశ్వనాథ్‌ తదిరులకు చెందిన 27 స్థిరాస్తులను బుధవారం ఈడీ అటాచ్‌ చేసింది. మొత్తం రూ.11.05 కోట్లు విలువ చేసే వీటి వాస్తవ మార్కెట్‌ విలువ రూ.33.39 కోట్లు ఉంటుందని అంచనా. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ 2002ను ఉపయోగించి బ్యాంకును మోసగించి రుణం తీసుకుని వాటిని వేరే అవసరాలకు మళ్లించారన్న అభియోగంపై వీరిపై కేసు నమోదైంది. వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ పేరిట ఆ కంపెనీ ఎండీ నిమ్మగడ్డ రామకృష్ణ, ఇతర డైరెక్టర్లు గుడివాడ యూనియన్‌ బ్యాంకుకు రూ.36.97 కోట్లు బకాయి పడ్డారు. వీనస్‌ ఆక్వా ఫుడ్‌ సంస్థ తరపున పైన పేర్కొన్న నిందితులు యూనియన్‌ బ్యాంకుకు ఫోర్జరీ పత్రాలు, నకిలీ లీజుపత్రాలు సమర్పించి 470 ఎకరాల చేపల చెరువులు సాగు చేస్తున్నామని రూ.19.44 కోట్లు రుణం తీసుకున్నారు.


రుణాలు తీసుకుని వాటిని వేరే వ్యాపారాలు చేయడానికి వినియోగించడమే కాక ఇంతవరకూ చెల్లించకపోవడంతో బ్యాంకుకు రూ.36.97 కోట్లు నష్టం వాటిల్లింది. మొత్తం 54 మంది పేరిట రుణాలు తీసుకున్నారు. బంధువులు, మిత్రుల పేరిట రూ.22.64 కోట్ల రుణాలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. పిస్కి కల్చర్‌ కోసం తీసుకున్న ఈ రుణాలను వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టారు. విజయవాడ, హైదరాబాద్‌లలోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టారని ఈడీ తేల్చింది. రూ.1.72 కోట్లతో ఆకాశమే హద్దు అనే తెలుగు సినిమాకు పెట్టుబడి పెట్టినట్లు ఈడీ విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించాయి. 

Updated Date - 2020-10-23T10:03:46+05:30 IST