Oct 26 2021 @ 10:03AM

'ఆర్ఆర్ఆర్': రన్ టైమ్ విషయంలో రాజమౌళి నో కాంప్రమైజ్..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ రన్ టైమ్ విషయంలో రాజమౌళి నో కాంప్రమైజ్ అంటున్నారట. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫిక్షన్ కథాంశంతో రాజమౌళి ఎవరి ఊహకు అందకుండా 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య  అత్యంత్య భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డబ్బింగ్‌ను పూర్తి చేశారు. అయితే, తాజాగా ఈ మూవీ రన్ టైమ్ దాదాపు మూడు గంటలకు పైగా వచ్చిందట. ఆ రన్ టైమ్ ట్రిమ్ చేసి 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చారట రాజమౌళి. ఇంతకంటే తగ్గించడానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఫైనల్ అవుట్‌పుట్ అని జక్కన్న డిసైడయ్యాడట. ఇంకాస్త తగ్గిద్దామని ఎవరు సలహా ఇచ్చినా నో కాంప్రమైజ్ అనేట్టుగా ఉన్నారట.