Jul 27 2021 @ 11:12AM

rrr: అఫిషియల్: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 13న‌ విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘దోస్తీ..’ అంటూ సాగే తొలి పాటను  ఫ్రెండ్ షిప్ డేను పుర‌స్క‌రించుకుని ఆగ‌స్ట్ 1 ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ థీమ్‌ సాంగ్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన‌గా, రీసెంట్‌గానే హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రించారని సమాచారం. మ‌ర‌క‌త‌మ‌ణి కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను ఐదు భాష‌ల్లో.. ఐదు మంది సింగర్స్ (హేమచంద్ర‌, అనిరుధ్‌, అమిత్ త్రివేది, విజ‌య్ యేసుదాస్‌, యాజిన్ న‌జీర్‌) ఆల‌పించారు. 

ఇందులో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇంకా స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, రే స్టీవెన్ సన్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి ఇలా బాలీవుడ్‌, హాలీవుడ్ తార‌ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.