Jul 28 2021 @ 04:31AM

ఆర్‌ఆర్‌ఆర్‌ ‘దోస్తీ’... ప్రత్యేకత ఏంటంటే?

‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ చిత్రంలోని తొలి పాట ‘దోస్తీ’ని ఆగస్టు 1న విడుదల చేయనున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో దర్శకుడు రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఐదు భాషల్లోనూ... బాణీ ఒక్కటే. కానీ, గాత్రం మాత్రం వేర్వేరు గాయకులది వినిపించనుంది. ఒక్కో భాషలో ఒక్కో గాయకుడు ఆలపించారు. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్‌ రవిచందర్‌, హిందీలో అమిత్‌ త్రివేదీ, మలయాళంలో విజయ్‌ యేసుదాసు, కన్నడలో యాజిన్‌ నిజార్‌ పాడారు. తెలుగులో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా... తమిళంలో మదన్‌ కర్కి, హిందీలో రియా ముఖర్జీ, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, తమిళంలో మన్‌కొంబు గోపాలకృష్ణన్‌ రాశారు. సినిమాలో హీరోలు ఇద్దరి మధ్య స్నేహాన్ని చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మించారు.