ఆర్‌ఆర్‌ఆర్‌ వేగవంతం

ABN , First Publish Date - 2022-01-20T06:40:48+05:30 IST

రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులు ఊపందుకున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల్లో నిమగ్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రధాన అడ్డంగిగా మారే భూసేకరణ పనులు త్వరగా చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ వేగవంతం

రీజినల్‌ రింగు రోడ్డు పనులు ప్రారంభించిన ప్రభుత్వం

మొదటివిడత పనులకు సర్వేతోపాటు హద్దురాళ్ల ఏర్పాటు 

ఐదు మండలాల మీదుగా నిర్మాణం

త్వరలోనే గ్రామాల వారీగా నోటిఫికేషన్‌ జారీ


(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులు ఊపందుకున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల్లో నిమగ్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రధాన అడ్డంగిగా మారే భూసేకరణ పనులు త్వరగా చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూసేకరణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించి, రోడ్డు, జంక్షన్ల నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించాలని ఆదేశించింది. 


నేషనల్‌ హైవే ఆఫ్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన అలైన్‌ మెంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో మొత్తం 1787.5ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల్లోని పలు గ్రామాలగుండా రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెళ్లనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఏయే గ్రామాల నుంచి వెళ్లనుందన్న సమగ్ర నివేదిక(డీపీఆర్‌) రూపకల్పన బాధ్యతలను ఓ ప్రైవేట్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. గ్రామాలవారీగా సర్వే చేపట్టి హద్దురాళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు శాటిలైట్‌ ద్వారా హద్దులను కూడా నిర్ధారిస్తున్నారు. ఏయే గ్రామాల నుంచి రోడ్డు వెళ్లనుందో ప్రభుత్వం త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 


మొదలైన కసరత్తు 

రీజినల్‌ రింగు రోడ్డు వెళ్లే గ్రామాలు, సర్వే నెంబర్ల వారీగా జాబితా ను రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ దాదాపు 354 కిలోమీటర్ల పొడవున నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మొదటిదశలో నిర్మించే జాతీయ రహదారికి ఎన్‌హెచ్‌ 161ఏఏగా నెంబర్‌ను కేటాయిస్తూ, కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 158 కిలోమీటర్ల పరిధితో ఏర్పడే హైదరాబాద్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ జిల్లాలో 98.9వ కిలోమీటరు నుంచి 158.6వ కిలో మీటరు వరకు మొత్తం 59.6 కిలోమీటర్ల వరకు నిర్మించనున్నారు. మొదటి విడతలో సంగారెడ్డి నుంచి తుప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు 158 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి సిద్దిపేట, యాదాద్రి జిల్లాల గుండా వెళ్లే మార్గంలో భూముల సర్వే కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లిలో కొలతలు చేపట్టి హద్దులు నాటుతున్నారు. 


హద్దురాళ్ల ఏర్పాటు 

జిల్లా పరిధిలోని తుర్కపల్లి మండలం గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కోనాపూర్‌, ఇబ్రహీంపూర్‌, దత్తాయిపల్లి, వేల్పుపల్లి మీదుగా రీజినల్‌ రింగురోడ్డు నిర్మించే అవకాశం ఉండడంతో హద్దురాళ్లు నాటుతున్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్‌, దాతార్‌పల్లి వరకు సర్వే చేపట్టారు. దాతరుపల్లి నుంచి భువనగిరి మండలం బస్వాపూర్‌, రాయిగిరి, కేసారం, భువనగిరి, పెంచికలపాడు, గౌస్‌నగర్‌, వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, పొద్దుటూరు, ఎదుల్లాగూడంతో మీదుగా సర్వే చేపట్టి హద్దురాళ్లను నాటారు. రెండోదశలో చౌటుప్పల్‌-షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు దాదాపు 182 కిలోమీటర్లు నిర్మించనున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు జాతీయ రహదారుల భూసేకరణపై జిల్లా కలెక్టర్లతో రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ్‌స.శ్రీనివా్‌సరాజు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ పమేలాసత్పథి, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్‌ పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. 


చౌటుప్పల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ హద్దుల ఏర్పాటు

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నెంబరు జాతీయ రహదా రి మధ్యనగల డివైడర్‌లో వేసిన ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పాయింట్లను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి ఉత్తర భాగంలో నిర్మించతలపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌కు  సంబంధించి ఈ పాయింట్స్‌ వేశా రు. పట్టణానికి తూర్పు భాగంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలోగల కోణా ర్క్‌ స్టీల్‌ కంపెనీ వద్ద హైవే పై డివైడర్‌ మధ్య రెండు ప్రాంతాల్ల పాయింట్ల ను ఏర్పాటుచేశారు. ఈ రెండు పాయింట్ల మద్య సుమారు 500 మీటర్ల పొడవు ఉన్నట్లు అంచనా. ఈ హద్దుల ఏర్పాటుతో భూములు, ప్లాట్లను ఎంతమేరకు కోల్పోవాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రైతుల్లో మొదలైన గుబులు

కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌పై పల్లె ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ జాతీయ రహదారిని జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల మీదుగా నిర్మిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌పై గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల విలువ పెరగనుండటంతో అధిక మొత్తంలో భూములు ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఎకరా, అర ఎకరం భూమి ఉన్న రైతులు తమ పొలాల నుంచి రోడ్డు వేస్తే ఏమిటి పరిస్థితి అంటూ ఆలోచనలో పడ్డారు. అయితే రోడ్డు అలైన్‌మెంట్‌ పూర్తయితే గానీ ఏయే గ్రామాల్లో ఎవరెవరి భూములు కోల్పోతారో అన్నది స్పష్టమయ్యేలా కన్పించడంలేదు.  

Updated Date - 2022-01-20T06:40:48+05:30 IST