RR vs GT: కీలక మ్యాచ్ లో రాణించిన బట్లర్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-05-25T03:16:23+05:30 IST

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో RR జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యాన్ని..

RR vs GT: కీలక మ్యాచ్ లో రాణించిన బట్లర్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే..

కోల్ కత్తా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో RR జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ముందుంచింది. తొలుత నెమ్మదిగా ఆడిన బట్లర్ చివర్లో మాత్రం దూకుడుగా ఆడి స్కోర్ ను పరుగులు పెట్టించాడు. 56 బంతుల్లో 89 పరుగులు చేసి 12 ఫోర్లు, 2 సిక్స్ లతో రాణించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 47 పరుగులతో రాణించాడు. పడిక్కల్ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మాత్రం ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. 8 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, యష్ దయాల్, సాయి కిషోర్, హార్థిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది. గుజరాత్ టైటాన్స్ ముందు ఉంది స్వల్ప లక్ష్యం ఏం కాదు. మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంతో ముందుకెళితేనే ఈ లక్ష్యం ఛేదించే అవకాశాలు ఉంటాయి.



గుజరాత్ ఓపెనర్లలో సాహా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. గిల్ ఈ మ్యాచ్ లో రాణిస్తేనే గుజరాత్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాథ్యూ వేడ్, హార్థిక్ పాండ్యా, మిల్లర్, రాహుల్ తెవాటియా బ్యాటింగ్ కూడా కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచే టీం నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఆ అదృష్టం RR లేదా GTకి ఉందో తెలియాలంటే సెకండ్ ఇన్నింగ్స్ వీక్షించాల్సిందే. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకు ఫైనల్ కు చేరుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన టీంతో క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చు. ఇవాళ ఒక మ్యాచ్ గెలిచి ఫైనల్ కు వెళ్లే టీం ఏదో, ఇవాళ మ్యాచ్ లో ఓడి మరో మ్యాచ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునే టీం ఏదో తెలియాలంటే మ్యాచ్ ను ఫాలో కావాల్సిందే.

Updated Date - 2022-05-25T03:16:23+05:30 IST