ఆర్‌ అండ్‌ ఆర్‌ ఎక్కడ?

ABN , First Publish Date - 2021-12-04T06:26:29+05:30 IST

విమానాశ్రయ నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పన అటకెక్కింది.

ఆర్‌ అండ్‌ ఆర్‌ ఎక్కడ?

విమానాశ్రయ నిర్వాసితుల్లో ఆందోళన 

డబ్బులు కేటాయిస్తున్నట్టు జీవో

అంతలోనే మళ్లీ వెనక్కి

ఏడాదిన్నరగా అపరిష్కృతంగానే..

లబోదిబోమంటున్న నిర్వాసితులు 


విమానాశ్రయ నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పన అటకెక్కింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కట్టించి ఇస్తామంది గత ప్రభుత్వం. డబ్బులే ఇస్తాం.. ఇళ్లు మీరే కట్టుకోవాలని చెప్పింది ప్రస్తుత ప్రభుత్వం. నిర్వాసితులు సరే అంటూ సరిపుచ్చుకున్నారు. డబ్బులు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసేసుకుంది. వెరసి ప్రభుత్వం జారీ చేసిన జీవో అపహాస్యంగా మారింది. ఇళ్లు కట్టుకుందామని ఎదురుచూస్తున్న వందలాదిమంది నిర్వాసితులు ప్రభుత్వం ఇస్తామన్న డబ్బుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విమానాశ్రయ విస్తరణ పర్వంలో నిర్వాసితులుగా మారిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా మోడల్‌ గృహాలను కట్టించే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది. గృహాలను కట్టివ్వలేమని రూ.9 లక్షలు ఇస్తామని, ఇళ్లు నిర్వాసితులే కట్టించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది. అది కూడా రెండు విడతలుగా ఇస్తామని చెప్పింది. ప్రభుత్వంతో రాజీ పడటమే మేలని భావించిన నిర్వాసితులు తమకు నష్టం జరుగుతుందని తెలిసినా, డబ్బులు తీసుకుని ఇళ్లను నిర్మించు కునేందుకు అంగీకరించారు. ఇది జరిగి ఏడాదిన్నర కావస్తోంది. నిర్వాసితుల నివాసాలకు, ఇతర మౌలిక సదుపాయాలు, ఎయిర్‌పోర్టు సంబంధిత పనుల కోసం రూ.110 కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి ఏడాది గడి చిపోయింది. కలెక్టర్లు మారారు కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. రేపు, మాపు అంటూ సమాధాన పరుస్తున్నారే తప్ప అసలు సమస్య ఏమిటో చెప్పరు. విడుదల చేసిన డబ్బును ఆర్థికశాఖ తిరిగి వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో విమానాశ్రయ నిర్వాసితులకు డబ్బులు అందటం లేదు. విమానాశ్రయ విస్తరణ కారణంగా నిరాశ్రయులైన గన్నవరం మండలంలోని బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన 400 కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 

ఇదేనా ‘మోడల్‌’? 

విమానాశ్రయ నిర్వాసితులకు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో చిన్న అవుటపల్లి గ్రామంలో 48 ఎకరాల భూములను కొని లే అవుట్‌ వేసి, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా మోడల్‌ గృహాలను కట్టించాలని నిర్ణయించారు. ఆ మేరకు లే అవుట్‌ వేశారు. మౌలిక సదుపాయాల పనులు కూడా ప్రారంభమయ్యాయి. గృహాలను కట్టించేందుకు ఒక ఏజెన్సీని కూడా నియమించారు. ఈలోపు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చాక విధానమే మారిపోయింది. ఇప్పుడు ఆర్‌ అండ్‌ ఆర్‌ భవితవ్యం అగమ్యగోచరంలో పడింది. దీంతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణాల స్థానంలో డబ్బులు ఇస్తామన్న ఆఫర్‌ను నిర్వాసితులు అంగీకరించాల్సి వచ్చింది. వాస్తవానికి మోడల్‌ గృహాన్ని కట్టించాలంటే కనీసం రూ.12 లక్షలయినా అవసరమవుతుంది. ప్రభుత్వం రూ.9 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. అది కూడా సగం చొప్పున రెండు వాయిదాల్లో ఇస్తామని చెప్పింది. నిర్వాసితులు అంగీకరించిన తర్వాత ప్రభుత్వం రెండు నెలలకు రూ.110 కోట్లు ఇస్తున్నట్టు జీవో ఇచ్చింది. జీవో అయితే ఇచ్చింది కానీ ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. 


అద్దె ఇళ్లల్లో కష్టాలు

సొంత ఇళ్లను కోల్పోయిన నిర్వాసితులు అద్దె ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో నిర్వాసితులు అద్దెలు చెల్లించలేక బాధపడుతున్నారు. వాస్తవానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ కల్పించే వరకు అద్దెలు కూడా కడతామని ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఇప్పటి వరకు 70 శాతానికి పైగా అద్దె బకాయిలను చెల్లించటం లేదు. సొంత ఇల్లు ఉంటే అద్దెల భారం తప్పుతుందని డబ్బులకు అంగీకరించి, మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయామంటూ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. 


కంటితుడుపు చర్యలు 

ఇళ్లను నిర్మించుకోవటానికి డబ్బుల కోసం నిర్వాసితులు ఆందోళనలకు శ్రీకారం చుట్టిన ప్రతిసారీ కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారు మినహా వారి సమస్యను మాత్రం పరిష్కరించటం లేదు. డబ్బుల కోసం ఆందోళన చేయటాన్ని పక్కదారి పట్టించటానికి లే అవుట్‌లో లాటరీ తీసి ప్లాట్లను కేటాయించారు. ప్లాట్లను కేటాయించటం సంతోషమే అయినా వారు ఇళ్లు కట్టుకోవటానికి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. మరోసారి ఆమరణ దీక్ష చేపట్టడానికి సిద్ధపడితే పిలిచి వారిని బుజ్జగించి ‘వారంలో ఇవ్వకపోతే మాది బాధ్యత’ అని గత కలెక్టర్‌ హమీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయారు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌ కాల్వను పూడ్చివేసి నిరసన తెలపాలని నిర్వాసితులు పోరాటానికి పిలుపునివ్వగా.. హడావిడిగా స్వల్ప మొత్తంలో అద్దె బకాయిలను చెల్లించారు. ఇళ్లు కట్టుకోవటానికి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. ఇది జరిగి కూడా మూడు, నాలుగు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు డబ్బులను చెల్లించలేదు. 

Updated Date - 2021-12-04T06:26:29+05:30 IST