పునరావాసం గోవిందా..

ABN , First Publish Date - 2022-08-10T06:10:18+05:30 IST

విమానాశ్రయ విస్తరణ కోసం నిర్వాసితులుగా మారిన పేదలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పనను రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది.

పునరావాసం గోవిందా..
ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన లే అవుట్‌

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గగ్గోలు

రూ.112 కోట్ల నిధులు మంజూరు చేసి.. విడుదల చేయని ప్రభుత్వం 

  రెండున్నరేళ్లుగా అమలుకు నోచుకోని ఆర్‌ అండ్‌ ఆర్‌ 

   ఆందోళనలో 400 మంది నిర్వాసితులు

విమానాశ్రయ విస్తరణ కోసం నిర్వాసితులుగా మారిన పేదలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పనను రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్లుగా  నిర్వాసితులతో దోబూచులాడి ప్యాకేజీని అటకెక్కించింది. రెండున్నరేళ్ల కిందట ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం రూ.112 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వమే జీవో జారీ చేసినా.. ఇప్పటి వరకు నయా పైసా విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 400 మంది నిర్వాసితులను వేదనకు గురిచేస్తోంది. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : విమానాశ్రయ నిర్వాసితుల ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ లే అవుట్‌ వెంబడి.. జగనన్న కాలనీలకు లే అవుట్‌ కేటాయించారు. అక్కడ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిని చూసి తామేం పాపం చేశామని 400 మందికిపైగా విమానాశ్రయ నిర్వాసితులు మదనపడుతున్నారు. 

  గత ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలతో పనులు ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాభివృద్ధికి   గత ప్రభుత్వ హయాంలో 700 ఎకరాల భూములను సమీకరించి ఇచ్చారు. విమానాశ్రయ విస్తరణ క్రమంలో బుద్ధవరం, దావాజీగూడెం తదితర ప్రాంతాలకు చెందిన నివాస ప్రాంతాలను తొలగించాల్సి వచ్చింది. నిర్వాసితులుగా మారిన వారికి గత ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పించటానికి చిన్న అవుటపల్లిలో 48 ఎకరాల భూములను సేకరించి లే అవుట్‌ వేసింది. ఈ లే అవుట్‌లో అన్ని వసతులతో మోడల్‌ గృహాలను నిర్మించాలని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా అప్పట్లోనే ఆర్‌ అండ్‌ ఆర్‌ లే అవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పన పనులను ప్రారంభించింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తి చేసే వరకు అద్దెకు ఉండే వారికి అద్దెను కూడా చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. 

 వైసీపీ  అధికారంలోకి వచ్చాక ఆగిన పనులు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో మౌలిక సదుపాయాల పనులు ఆగిపోయాయి. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ భవితవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం విమానాశ్రయ అపరిష్కృత అంశాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ అంశాన్ని కూడా చేర్చింది. దాదాపుగా ఏడాదిన్నర కిందట ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. 

  డబ్బులిస్తాం కట్టుకోండంటూ..

‘మీరే ఇళ్లు కట్టుకోండి.. డబ్బులు ఇస్తాం’ అని నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అసలు ప్రభుత్వం స్పందిస్తుందో లేదో తెలియక ఆందోళనలో ఉన్న లబ్ధిదారులు కనీసం డబ్బులు తీసుకుని తామైనా ఇళ్లు కట్టుకోవచ్చని భావించారు. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న రూ.9 లక్షల ప్యాకేజీకి అంగీకరించారు. 

  నిధులు ఇవ్వని ప్రభుత్వం

నిర్వాసితులు ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే కెనాల్‌ను పూడ్చి వేయాలని ఆందోళనకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని వారం రోజుల డెడ్‌లైన్‌ పెట్టింది. ఆ తర్వాత జిల్లాల విభజన జరిగింది. అప్పటి నుంచి ఈ సమస్య ముందుకు పడటం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు సంబంధించి విడుదల చేయాల్సిన నిధుల గురించి అడుగుతుంటే... తాము చేయాల్సింది చేశామని.. ప్రభుత్వం నుంచి నిధులు రావాలని జిల్లా యంత్రాంగం చెబుతోంది. 

  అద్దె డబ్బులూ ఇవ్వటం లేదు  

విమానాశ్రయ నిర్వాసితులు కొందరు అద్దె ఇళ్లలో నివశిస్తున్నారు. వారికి గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అద్దెలు చెల్లించాల్సి ఉండగా... కేవలం ఒకే ఒక్కసారి కంటి తుడుపుగా అద్దె డబ్బులు ఇచి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. విమానాశ్రయ విస్తరణ కోసం తమ ఇళ్లను వదులుకుని అద్దెకు ఉంటున్నా మానవతా దృక్పథంతో అద్దె డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం ఆ ఊసెత్తటం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.   

  ప్యాకేజీలో మెలిక

రూ.9లక్షల ప్యాకేజీకి నిర్వాసితులు అంగీకరించిన తర్వాత ప్రభుత్వం మరో ప్లాన్‌ వేసింది. రూ.9 లక్షల్లో ముందుగా సగం రూ.4.50 లక్షలు ఇస్తామని మిగిలిన సగం తర్వాత ఇస్తామని మెలిక పెట్టింది. దీనికి కూడా నిర్వాసితులు అంగీకారం తెలిపారు. తర్వాత కొద్ది కాలానికి రూ.112 కోట్లు మంజూరు చేస్తున్నట్టు జీవో జారీ చేసింది. జీవో అయితే జారీ చేసింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులూ విడుదల చేయ లేదు. నిర్వాసితులు ఆందోళన పతాకస్థాయికి చేర టంతో అప్పటి ఉమ్మడి జిల్లా యంత్రాంగం నిర్వాసి తులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో లాటరీ తీసి ప్లాట్లను కేటాయించింది. నిర్వాసితులు కొంత మెత్తబడ్డారు. ఇళ్లు కట్టుకోవటానికి తొలి విడతగా ఇవ్వవలసిన రూ.4.50 లక్షలను ప్రభుత్వం విస్మరించింది. 


Updated Date - 2022-08-10T06:10:18+05:30 IST