కాంగ్రెస్‌కు కమలం ఎర

ABN , First Publish Date - 2020-11-19T08:24:46+05:30 IST

గ్రేటర్‌ హైదరా బాద్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి భారీగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ వెన్నంటి ఉన్న శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌, ఆయన కుమారుడు రవికుమార్‌ యాదవ్‌లు బీజేపీ తీర్ధం పుచ్చుకు న్నారు.

కాంగ్రెస్‌కు కమలం ఎర

 టీఆర్‌ఎస్‌ అసంతృప్తులకూ గాలం! 

 గ్రేటర్‌ ఎన్నికల వేళ బీజేపీ ఎత్తులు 

 పలువురు నేతలు పార్టీలు మారుతున్నట్లు ప్రచారం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : గ్రేటర్‌ హైదరా బాద్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి భారీగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ వెన్నంటి ఉన్న శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌, ఆయన కుమారుడు రవికుమార్‌ యాదవ్‌లు బీజేపీ తీర్ధం పుచ్చుకు న్నారు. వీరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు చేసిన చివరి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ  రేవంత్‌రెడ్డితోపాటు మరికొందరు ముఖ్య నేతలు బుధవారం భిక్షపతి ఇంటికి వెళ్లి బుజ్జగించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. బీజేపీలో చేరేందుకే నిర్ణయించినట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నేతలంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలోని మరికొందరు కాంగ్రెస్‌ నేతలతోపాటు టీఆర్‌ ఎస్‌లోని అసమ్మతి నేతలు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.


ఇందులో కొందరితో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇందులో మాజీ ఎంపీతో పాటు, మాజీ ఎమ్మెల్సీ, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ నేతలు చర్చలు జరుపు తున్నారు. ఇక టీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం త్వరలోనే పార్టీని వీడను న్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలాఉంటే ఉద్యమం సమయంలో ఉద్యోగ సంఘాలకు నాయ కత్వం వహిస్తూ టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచి తరువాత ఆ పార్టీలో చేరి రాజ్యాంగ పదవులు పొందిన ఇద్దరు ముఖ్యనేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగు తోంది. అదేవిధంగా టీఆర్‌ఎస్‌లో ద్వితీయశ్రేణి నేతలు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగర శివార్లలో కొద్ది రోజుల కిందటి వరకు కొన్ని డివిజన్లలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ దుబ్బాక ఫలితం తరువాత పరిస్థితి పూర్తిగా మారి పోయింది.


ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. తమకు టికెట్‌ ఇస్తే ఎంతైనా ఖర్చు పెడతామంటూ రిజర్వుడు స్థానాల్లో కూడా పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్‌ ఎన్నికలు కాంగ్రెస్‌కు శరాఘాతంగా మారాయి. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ రెండోస్థానం కాపాడుకునేందుకు నానా యత్నాలు చేస్తోంది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఫలితం గ్రేటర్‌ ఎన్నికలపై తీవ్ర ప్రభా వాన్నే చూపుతోంది. హైదరాబాద్‌ నగర శివార్లలో గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టోంది. ఆ పార్టీలో ముఖ్య నేతలందరికీ బీజేపీ గాలం వేస్తుండ డంతో గ్రేటర్‌ ఎన్నికల సమయానికి ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బీజేపీ సద్వినియోగం చేసుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తోపాటు అధికార టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలను లక్ష్యంగా చేసు కుని వారిని తమవైపు తిప్పుకునేందుకు శరవేగంగా పావులు కదుపు తోంది. ఆయా పార్టీల్లో అసంతృప్తులతో చర్చలు జరిపే ప్రక్రియను వేగవంతం చేసింది.


వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలతో మంగళవారం అర్థరాత్రి పలువురు బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. బుధవారం కూడా చర్చలు కొనసాగాయని కొందరు బీజేపీ నేతలు తెలిపారు. ఆయా పార్టీల్లోని ముఖ్యనేతలకు గాలం వేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వమే నేరుగా రంగంలో దిగింది. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ రాజకీయ అవకాశాలు కల్పి స్తామని ముందుగానే హామీ ఇస్తున్నారు. తద్వారా ఎక్కువ మందిని బీజేపీలోకి లాగేయత్నం చేస్తున్నారు. చేరికలపై బీజేపీ నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తుండడంతో రాజకీయ పెనుమార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-11-19T08:24:46+05:30 IST