కన్నీరే మిగిలింది..

ABN , First Publish Date - 2020-11-19T08:34:38+05:30 IST

వానాకాలం సాగు రైతన్నకు కన్నీరే మిగిల్చింది. సీజన్‌ ప్రారంభం నుంచే వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు పెద్దఎత్తున వరిసాగు చేశారు.

కన్నీరే మిగిలింది..

 వానాకాలం సాగులో సగానికి తగ్గిన సన్నరకాల దిగుబడి 

 వరికోత యంత్రాలు లేక అన్నదాతల అవస్థలు 

 బురదలో కోసే యంత్రాలతో రెట్టింపైన ఖర్చులు 

 ఘట్‌కేసర్‌ మండలంలో జోరుగా వరికోతలు


ఘట్‌కేసర్‌: వానాకాలం సాగు రైతన్నకు కన్నీరే మిగిల్చింది. సీజన్‌ ప్రారంభం నుంచే వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు పెద్దఎత్తున వరిసాగు చేశారు. అందులో సన్నరకాలు సాగుచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సన్నరకాలు సాగుచేశారు. ఆశించిన దానికంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో పైర్లుఏపుగా పెరిగాయి. అక్టోబర్‌ నెలలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురవడంతో 70శాతం వరకు పైర్లు నేలవాలాయి. వరదలకు పలు చోట్ల పంటలు కొట్టుకుపోగా మరికొన్ని చోట్ల ఇసుక మేటలు వేసి పాడయ్యాయి. ప్రస్తుతం పైర్లు కోయడానికి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధిక వర్షాల ప్రభావంతో ప్రస్తుతం పైర్లలో నీళ్లు పారుతున్నాయి. వరికోతలకు ఉపయోగించే సాధారణ యంత్రాలు బురదలో దిగబడుతాయి కనుక బురదలోనూ బెల్టుతో నడిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారు.


ఈయంత్రాలను ప్రత్యేక డీసీఎం వాహనంలో ఒకచోటునుంచి మరోచోటుకు తరలిస్తారు. దీని కారణంగా కోతకు చార్జీలను సైతం అధికంగా వసూలు చేస్తున్నారు. సాధారణ యంత్రం గంటకు రూ.2వేల వరకు చార్జీ నడుస్తుండగా బెల్టు సహాయంతో నడిచే యంత్రానికి గంటకు రూ.3వేలా200 చొప్పున వసూలు చేస్తున్నారు. సాధారణ యంత్రం గంటకు దాదాపు ఎకరం కోత కోస్తుంది.  కానీ ప్రస్తుతం బురదలో కోసే బెల్టు మిషన్‌ గంటలో అర ఎకరానికి మించి కోయడంలేదు. దీనితో పాటు ప్రస్తుతం రైతులకు వరి గడ్డి ఏమాత్రం చేతికి రాకుండా పోతున్నది. అయినా యంత్రాలు దొరక్క రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ యంత్రాలు తమిళనాడు రాష్ట్రంనుంచి వస్తాయి. ఈసంవత్సరం యంత్రాలు తక్కువ రావడం వలన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఒకవైపు భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నకు యంత్రాల కొరత, అధిక చార్జీల మోతతో పాటు దిగుబడి పూర్తిగా తగ్గి రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


దీనికి తోడు తిరిగి ఆకాశం మేఘావృతమై చినుకులు పడుతుండటంతో అన్నదాతలు ఆందోళనకు అంతులేకుండా పోయింది. యంత్రాల యజమానులు ఐదెకరాలకు పైగా కోత ఉంటేనే ప్రధాన్యత ఇస్తున్నారు. బోర్ల కింద ఎకరా, రెండెకరాలు సాగుచేసుకున్న రైతుల బాధలు వర్ణానాతీతం. మండలంలో 2వేలా 285 మంది రైతులు 4వేలా 215 ఎకరాల్లో వరిసాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 850 ఎకరాల్లో 50శాతం వరకు పైర్లు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల్లో 30శాతం పైర్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం 850ఎకరాల్లో పాడైన పంటల వివరాలనే ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రైతులు వరికోతల పనుల్లో నిమగ్నమయ్యారు.


సన్న రకాల దిగుబడి భారీగా తగ్గింది..చందుపట్ల నర్సింహారెడ్డి, రైతు చందుపట్లగూడ

సన్నరకాలు సాగుచేసిన రైతులకు భారీనష్టం జరిగింది. ప్రధానంగా సన్న రకాలకు పంటకాలం ఆరునెలలు. దీనికి చీడపీడలు అధికం. ధర మాత్రం ఒక్కటే. ఈసంవత్సరం వర్షాలు ఎక్కువై తెగుళ్లు అధికమై దిగుబడి సగానికి తగ్గింది.


మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నాం.. కట్ట మల్లారెడ్డి, రైతు బొక్కోనిగూడ

పైర్లు కోతకువచ్చి 10రోజులు గడుస్తున్నది. మిషన్ల కోసం తిరుగుతున్నాం. ప్రస్తుతం పైర్లలో నీరు ప్రవహిస్తున్నందున బెల్టు మిషన్లతోనే వరి కోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పశుగ్రాసం ఏమాత్రం చేతికి రావడం లేదు.

నివేదికను పైఅధికారులకు అందజేశాం..- బాసిత్‌, ఏఓ

ఘట్‌కేసర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పైర్లను పరిశీలించాం. 850ఎకరాల్లో పైర్లు 50 శాతం మేరకు దెబ్బతిన్నట్లు గుర్తించాం. భారీ వర్షాలతో వరిపైర్లకు జరిగిన నష్టాన్ని గుర్తించి పూర్తి వివరాలతో పైఅధికారులకు నివేదించాం.

Updated Date - 2020-11-19T08:34:38+05:30 IST