దర్జాగా కబ్జా!

ABN , First Publish Date - 2020-11-19T08:29:14+05:30 IST

ప్రభుత్వానికి చెందిన లావణి భూములను కొందరు బడా బాబులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. నిర్భయంగా గదులను నిర్మించి లేబర్లను నివాసముంచుతున్నారు.

దర్జాగా కబ్జా!

 లావణి భూమిని ఆక్రమించిన బడాబాబులు

 చోద్యం చూస్తున్న యంత్రాంగం

 రూ. 12 కోట్ల విలువ గల 4 ఎకరాల లావణి భూమి అన్యాక్రాంతం

 అంతాయిపల్లి పరిధిలో ఏళ్లతరబడి జరుగుతున్న అక్రమ తంతు


శామీర్‌పేట : ప్రభుత్వానికి చెందిన లావణి భూములను కొందరు బడా బాబులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. నిర్భయంగా గదులను నిర్మించి లేబర్లను నివాసముంచుతున్నారు. ఈ అక్రమ తంతు శామీర్‌పేట మండలం, తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని అంతాయిపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు పదేళ్లుగా నిర్భయంగా జరుగుతోంది. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన వీఆర్వోలు, రెవిన్యూ అధికారులు బడాబాబులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాస్తున్నారు.


అక్రమార్కుల చెరలో లావణి భూమి

అంతాయిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌-87లో దాదాపు 4 ఎకరాల మేరకు ప్రభుత్వానికి చెందిన లావణి భూమి ఉంది. ఈ భూమిపై కొందరు బడాబాబులు కన్ను వేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, వీఆర్వోలను కొందరు బడాబాబులు లొంగదీసుకుని దాదాపు రూ.12కోట్ల విలువ గల ఈ భూములను కబ్జా చేశారు. లావణి భూమి పట్టా భూమిగా అనిపించేలా చుట్టూ  ప్రహరీ గోడను నిర్మింపజేసి గేటు పెట్టారు.


ప్రహరీ లోపల దర్జాగా గదులను నిర్మించి లేబర్లను నివాసం ఉంచారు. మరో బడా బాబు లావణి భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి కబ్జా చేశాడు. ట్విస్టు ఏమిటంటే ఈ లావణి భూమి పరిధి కొంత ఏరియా బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వస్తుంది. వర్షం వస్తే వరదనీరు ఈ లావణి భూమి నుంచే ప్రవహించాల్సి ఉంది. కాగా బడాబాబు దర్జాగా ప్రహరీ గోడ నిర్మించడంతో వరద నీరు చెరువులోకి వెళ్లకుండా అడ్డుగా మారింది. దీంతో ఆ వరద నీరు అక్కడే నిలిచిపోతోంది.


సర్వే చేశారు.. వదిలేశారు!

లావణి భూమిని గతనెలలో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు సర్వే చేసి హద్దులను గుర్తించారు. దాదాపు 4 ఎకరాల మేరకు లావణి భూమి కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కు పెట్టారు. కానీ నెలలు గడుస్తున్నా బడా బాబుల కబ్జాల కోరల్లో చిక్కుకున్న ఆ లావణి భూమిని స్వాధీనం చేసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లెచెరువు ఎఫ్‌టీఎల్‌ సమీపంలో ఉన్నా కొందరు బడాబాబులు ప్రహరీ గోడలను నిర్మించి వరద నీరు వెళ్లకుండా ఆటంకం కలిగిస్తున్నారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


పేద రైతు ఒక ఫీటు కబ్జా చేస్తే కూల్చివేసిన వీఆర్వో..

కాగా, ఈ లావణి భూమికి ఆనుకుని భాస్కర్‌రెడ్డి అనే ఓ పేద రైతుకు నాలుగు ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ పట్టా భూమిలో పొప్పెడ, జామ తోటలు సాగు చేస్తున్నాడు. సేంద్రియ ఎరువులతో ఆ తోటలను పెంచాలనే మంచి సంకల్పంతో ఆ రైతు ఆ పట్టా భూమిలో ఓ గోశాలను నిర్మించేందుకు ఇటీవల నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. గోశాల బేసిమెంట్‌ కేవలం ఒక ఫీటు లావణి భూమిలోకి వచ్చింది. ఏళ్లతరబడి బడాబాబులు లావణి భూములను కబ్జా చేస్తున్నా పట్టించుకోని శామీర్‌పేట మండల వీఆర్వో వెంకట్‌రెడ్డి... ఆ రైతు పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి ఆ ఒక్క ఫీటు లావణి భూమిలో నిర్మించిన గోశాల పునాదిని కూల్చివేశాడు. పట్టా భూమిలో ఉన్న మరికొంత గోశాల పునాదిని కూడా ఆ వీఆర్వో అక్రమంగా, అన్యాయంగా కూల్చివేశాడు.


ఇదెక్కడి న్యాయం..

ఇదెక్కడి న్యాయం అంటూ ఆ పేద రైతు విలపిస్తూ వీఆర్వో వెంకట్‌రెడ్డి పాల్పడుతున్న అక్రమ తంతును విలేకరులకు వివరించాడు. ఈ వీఆర్వో లంచాలకు కక్కుర్తి పడి అక్రమాలకు పాల్పడుతున్నాడని, తన గోశాల పునాదిని అన్యాయంగా కూల్చివేసి నష్టం కలిగించాడని బాధిత రైతు భాస్కర్‌రెడ్డి గోడు వెల్లబోసుకున్నాడు. సంబంధిత జిల్లా రెవెన్యూ అధికారులు వెంటనే స్వందించి వీఆర్వో వెంకట్‌రెడ్డి పాల్పడుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కబ్జాకు గురైన ప్రభుత్వ లావణి భూములను కాపాడాలని, అక్రమార్కులపై క్రిమినల్‌ కేసు పెట్టి న్యాయం చేయాలని బాధిత రైతు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.


సమగ్ర విచారణ జరుపుతాం- సురేందర్‌, తహసీల్దార్‌

అంతాయిపల్లి పరిధిలో ప్రభుత్వానికి చెందిన లావణి భూములపై సమగ్ర విచారణ, సర్వే జరుపుతాం. ఆ భూము లను ఎవరైనా కబ్జా చేసి నిర్మాణాలు చేసినట్లు విచారణలో తేలితే వెంటనే స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మండలంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదు, వారిపై క్రిమినల్‌ కేసులు పెడతాం.

Updated Date - 2020-11-19T08:29:14+05:30 IST