కల్యాణ వైభోగమే!

ABN , First Publish Date - 2020-11-18T09:56:21+05:30 IST

కార్తీక మాసం మొదలైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా భాజా భజంత్రీలే వినపడుతు న్నాయి. దాదాపు మూడు నెలలపాటు పెళ్లి ముహూర్తాలకు బ్రేక్‌ పడగా..

కల్యాణ వైభోగమే!

 ఉమ్మడి జిల్లాలో మొదలైన పెళ్లిసందడి 

 జనవరి 6 వరకు ముహూర్తాలు 

 ఒక్కటి కానున్న వేలాది జంటలు

 మండపాలకు పెరిగిన డిమాండ్‌

 పుంజుకుంటున్న వ్యాపారాలు 

 కిటకిటలాడుతున్న షాపింగ్‌ మాల్స్‌ 

 భయపెట్టిస్తున్న బంగారం ధర


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కార్తీక మాసం మొదలైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా భాజా భజంత్రీలే వినపడుతు న్నాయి. దాదాపు మూడు నెలలపాటు పెళ్లి ముహూర్తాలకు బ్రేక్‌ పడగా.. మళ్లీ ఇప్పుడు పెళ్లిసందడి మొదలైంది. కార్తీక మాసం నవంబరు 16న ప్రారంభమై డిసెంబరు 14వరకు ఉంటుంది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబరులో 15, 20, 21, 22, 25, 26, 27, 22, 28, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండగా.. డిసెంబరు నెలలో 2, 4, 6, 9, 10, 11 తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధిక సంఖ్యలో ముహూర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహూర్తాలు దృష్టిలో పెట్టుకుని అన్నిరకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 6 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నా.. కార్తీక మాసానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11వరకు పుష్యమాసంలో గురుమూఢం ఉంది. ఫిబ్రవరి12 నుంచి మాఘమాసం మొదలైనా మూఢం కొనసాగనుంది. ఏప్రిల్‌ 13న ఉగాదితో ప్లవనామ సంవత్సరం ప్రారంభమైనా మూఢాలున్నాయి. ఈ లెక్కన వచ్చే నెలరోజుల్లో పెళ్లిళ్లు చేయకపోతే ఆరు నెలలు ఆగాల్సిందే..!


మండపాలకు డిమాండ్‌

పెళ్లి ముహూర్తాలు ఖరారు కావడంతో అనుంబంధ వ్యాపారాలు ఊపందుకున్నాయి. వస్త్ర, బంగారు దుకాణాల్లో సందడి నెలకొంది. సన్నాయి మేళాలు, వంట మనుషులు, ప్రింటింగ్‌ ప్రెస్‌, లైటింగ్‌, డెకరేషన్‌, టెంట్‌, పెళ్లి మండపాలు, ఫొటో, వీడియోగ్రాఫర్లు బిజీబిజీగా మారిపోయారు. పట్టణ, మండల కేంద్రాల్లో కల్యాణ మండపాలకు డిమాండ్‌ పెరిగింది. చాలామంది ముందస్తుగానే మండపాలకు అడ్వాన్స్‌ చెల్లిస్తున్నారు. పెళ్లికార్డులు ఎవరి స్థోమతకు  తగ్గట్టుగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఫ్లెక్సీలు, సెట్టింగ్‌, డీజే తదితర వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. పూలదండలకు ప్రత్యేక డిమాండ్‌ ఉంది. 


పుస్తెకు పుత్తడి దెబ్బ.!

పెళ్లి అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది బంగారం. బంగారం కొనకుండా మన దేశంలో పెళ్లిళ్లు జరగడం చాలా అరుదనే చెప్పాలి. బంగారం ధరలు అమాంతం పెరిగిపోతు న్నాయి. కరోనా మహమ్మారితో ఓ పక్క ప్రజలు అతలాకు తలం అవుతుంటే... గోల్డ్‌ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో పెళ్లిళ్ల జోరు సాగుతోంది. బంగారం ధరలు పెరుగుతుండటంతో కీలకమైన పుత్తడి పుస్తెలు చేయించు కోలేని పరిస్థితి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏర్పడింది. 


పురోహితులకు పెరిగిన డిమాండ్‌

ఇక ఈ సీజన్‌లో అందరికన్నా ఎక్కువ డిమాండ్‌ పురోహితు లదే. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పురోహితులు బిజీగా మారిపోయారు. ఒకే ఒక్కరోజు పురోహితుడు 3 వివాహాలు జరిపించేలా ముహూర్తాలు సెట్‌ చేసుకుంటున్నారు. మరికొం దరు ప్రధాన పురోహితులు, ప్రధాన ఘట్టం మాత్రమే దగ్గరుండి నిర్వహించి, మిగిలిన కార్యక్రమం సహాయకులు చూసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


రెండు మాసాల్లోనే మంచి ముహూర్తాలు - శ్రీపాదాచార్యులు, పురోహితుడు, చేవెళ్ల

కార్తీక మాసంలో దివ్యమైన ముహూర్తాలున్నాయి. నవంబరు మాసంలో 18, 20, 21, 22, 25, 26, 27, డిసెంబరులో 2, 4, 6, 9, 10, 11 తేదీల్లో  వివాహాలు ముహుర్థాలు ఖరారయ్యాయి. ఈసారి కార్తీక పౌర్ణమి డిసెంబరు 30 సోమవారం కలిసి రావడం విశేషమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో అందరూ శుభకార్యాలు నిర్వహించు కునేందుకు ముందుకు వస్తున్నారు. 


టెంట్‌హౌస్‌కు పెరిగిన గిరాకీ- బి. గణేష్‌గౌడ్‌, టెంట్‌హౌస్‌ యజమాని, షాబాద్‌

ఎండాకాలం రెండు నెలల పాటు జరగాల్సిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు ఇవ్వడంతో పెళ్ళిళ్లు, శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. దీంతో టెంట్‌హౌస్‌కు గిరాకీ పెరిగింది. నెలరోజుల ముందు నుంచే బుకింగ్‌ చేసుకుంటున్నారు. 


నెల ముందుగానే బుక్‌ చేసుకున్నారు- రజనీశ్రీనివాస్‌, మనీగార్డెన్‌ యజమాని.

కరోనాతో ఈ ఏడాది రూ.30 లక్షల వరకు నష్టం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా నవంబరు, డిసెంబరు నెలలో ఫంక్షన్‌హాల్‌ ముందుగానే బుక్‌ చేసుకున్నారు. ప్రస్తుత బుకింగ్‌లతో జనవరి నుంచి జరిగిన నష్టాన్ని కొంత వరకు పూడ్చుకోవచ్చు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వివాహాలు చేసుకోవాలని సూచిస్తున్నాము. 

Updated Date - 2020-11-18T09:56:21+05:30 IST