సన్నద్ధం

ABN , First Publish Date - 2020-11-17T08:41:59+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో గతేడాది యాసంగిలో పండించిన పంటల విస్తీర్ణం కంటే ఈసారి రెట్టింపు విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది.

సన్నద్ధం

 యాసంగిలో గతేడాది కంటే రెట్టింపుకానున్న సాగు విస్తీర్ణం 

 పెరగనున్న వరి, శనగ, జొన్న సాగు

 ముందస్తుగానే ప్రణాళిక రూపొందించిన వ్యవసాయశాఖ

 ‘బయోమెట్రిక్‌’ ద్వారా ఎరువులు


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈసారి విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండాయి. భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రైతన్నలు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. 


 ఈసారి సాగు డబుల్‌ 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో గతేడాది యాసంగిలో పండించిన పంటల విస్తీర్ణం కంటే ఈసారి రెట్టింపు విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది సాగు విస్తీర్ణం 63,254.70 ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 1,02,159.07 ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చని అంచనా వేశారు. వరి, శనగ, జొన్న, చెరుకు, కుసుమలు, గోధుమలు, మంచి నువ్వుల పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే ఈసారి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మొక్కజొన్న, సోయాబీన్‌, ఆముదం సాగు పట్ల రైతులు అంతగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. గతేడాది జొన్న పంట 3,481.51 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా, ఈ ఏడాది 5,601 ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది.


వరి గతేడాది 35,959.89 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 59,178.80 ఎకరాలకు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వేరుశనగ 6,526.64 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 16,735 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని, శనగ పంట గతేడాది 8,441.15 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 15,098 ఎకరాలకు పెరగనుందని అంచనా వేశారు. రాగులు 126.28 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 238.20 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని, గోధుమలు 65.78 ఎక రాల్లో సాగు చేయగా, ఈసారి 204,39 ఎకరా లకు పెరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది చెరుకు 2,074. 68 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది 2,321,69 ఎకరాలకు పెరగనున్నట్లు అంచనా వేశారు. గత ఏడాది కుసుమలు 216.34 ఎకరాల్లో సాగుచేయగా, ఈ ఏడాది 1,822 ఎకరాలకు పెరగనుందని, మంచి నువ్వులు గత ఏడాది 19.86 ఎకరాల్లో సాగుచేస్తే ఈసారి 386 ఎకరాలకు పెరగనున్నట్లు అంచనా వేశారు.


అలసంద గతేడాది 52.74 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 90ఎకరాల్లో సాగు కానున్నట్లు తెలుస్తోంది. ఆముదం గతేడాది 112.42 ఎకరాల్లో సాగు చేస్తే, ఈసారి 67ఎకరాలకు తగ్గనున్నట్లు అంచనా వేశారు. పొద్దుతిరుగుడు పంట గతేడాది ఎకరా విస్తీర్ణంలో సాగుచేయగా, ఈసారి 160ఎకరాల్లో సాగు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉలువలు గతేడాది 27.71 ఎకరాల్లో సాగుచేస్తే ఈసారి 14 ఎకరాలకు తగ్గనుంది. గతేడాది కందులు 56.82 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది 74.40 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇతర ఆహార పంటలు 77.48ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి ఆ పంటల సాగు 168.59 ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న 5,977 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి ఆ పంట సాగు చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.. సోయాబీన్‌ గత ఏడాది 1.20 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది ఆ పంట సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంలేదు.


యాసంగి సాగులో ఇంతవరకు 27శాతం మేర వివిధ పంటలు వేయగా, ఈనెలాఖరు లోగా పూర్తిస్థాయిలో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. యాసంగి పంటల సాగులో ఎరువుల కొరత ఎదురు కాకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సీజన్‌లో 26,946 టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసి ఆ మేరకు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  


వరిసాగుకు మొగ్గు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : యాసంగి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. వానాకాలం పంటల కోత, కొనుగోళ్ల ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో యాసం గిపై దృష్టి పెడుతున్నారు. వ్యవసా యాధికారులు యాసంగి(రబీ) పంటల సాగు 2020-21 సంవ త్సర ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. సాగు బడికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను తెప్పించేందుకు ప్రతిపాదనలు రూపొందిం చారు. రంగారెడ్డి జిల్లాలో సమృ ద్ధిగా వర్షాలు కురిశాయి. జలాశ యాలు, చెరువులు ఇతర నీటి వనరులన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాత నమోదు కావ డంతో భూగర్భజలాలు సైతం పెరిగాయి. సాగునీటికి ఇబ్బందులు లేకపోవడంతో యాసంగిలో వరి సాగు గణనీయంగా పెరగనుంది. జిల్లాలో 94,737ఎకరాల విస్తీర్ణంలో వరి, గోధుమలు, జొన్నలు, సజ్జలు, చిరుధాన్యాలు, శనగలు, ఉలవలు, పెసర్లు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పశుగ్రాసంతోపాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకుగాను 24500.90 క్వింటాళ్లలో విత్తనాలు అవసరం కానున్నట్లు అంచనా రూపొందించారు. 


పెరగనున్న వరి, శనగ సాగు..

గతేడాది రబీని పోల్చుకుని చూస్తే ఈసారి వరి, శనగ సాగు విస్తీర్ణం పెరగనుంది. గతేడాది 3,472 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుచేయగా.. ఈసారి 46,555 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయనున్నట్లు అంచనా తయారు చేశారు. గత ఏడాదిని పోల్చుకుంటే.. 43,083 ఎకరాలు విస్తీర్ణంలో సాగు పెరగనుంది. శనగ గత ఏడాది 5,422 ఎకరాలు సాగు చేయగా ఈసారి 15,347 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది.


యూరియా నిల్వ 2611.40 టన్నులు

రంగారెడ్డి జిల్లాలో యూరియాతోపాటు ఎరువులకు కొరత లేదు. యూరియా నిలువలు 2611.40 టన్నులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో, ప్రైవేట్‌ డీలర్ల వద్ద నిలువ ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిలువ ఉన్న ఎరువులతోపాటు ఇంకా 20,800 టన్నుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. 


 20,719ఎకరాల్లో సాగు అంచనా

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : రైతన్నలు యాసంగి సీజన్‌లో పంటలను సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలన్నీ పొంగిపొర్లాయి. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఈనేపథ్యంలో రబీలో రైతులకు కలిసి వస్తుందన్న ఆశతో  ముందుకు సాగుతున్నారు. ఈసీజన్‌లో మొత్తం 20,719ఎకరాల్లో పలు పంటలను సాగు చేసేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌, కీసర, మేడ్చల్‌, శామీర్‌పేట్‌, కుత్బుల్లాపూర్‌ మండలాల్లో పలు రకాల పంటలను సాగుచేస్తారు.


యాసంగిలో వరి 14,275 ఎకరాల్లో, జొన్న 14, చిరుధాన్యాలు 30, శనగలు 39, పెసర్లు 1, ఉలవలు 16, నువ్వులు 20, పొద్దు తిరుగుడుపువ్వు 12, కుసుములు 20, గడ్డి విత్తనాలు 2,142, మిర్చి 2, కూరగాయ పంటలు 4,117, పండ్లు 48 ఎకరాల్లో సాగుచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో మొత్తం 2,747క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచారు. వీటిలో వరి 2,557క్వింటాళ్ల విత్తనాలు, శనగలు 150క్వింటాళ్లు, ఇతర చిరుధాన్యాలు 40క్వింటాళ్లు పంపిణీకి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా నాణ్యమైన ఎరువులను అందుబాటులో ఉంచారు. యూరియా 467.65 టన్నులు, డీఏపీ 192.04టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 530.55టన్నులు, ఎంవోపీ ఎరువులు 159.95టన్నులు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎరువుల కొనుగోలు చేసే రైతులకు ఆధార్‌కార్డుల ఆధారంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.


‘బయోమెట్రిక్‌’తో ఎరువుల పంపిణీ

రైతులకు ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ఎరువుల అమ్మకం లెక్క ప్రకారం జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఎరువులను నల్లబజారుకు తరలించి అధిక ధరలకు అమ్మటం, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం వంటివి నివారించటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎరువుల విక్రయ దుకాణాల వద్ద బయోమెట్రిక్‌ యంత్రాలను అమర్చాలని నిర్ణయించింది. రబీ సీజన్‌ నుంచి పాష్‌ మిషన్ల ద్వారా ఎరువులను విక్రయించనున్నారు. ఈ మేరకు కోరమాండల్‌ ఎరువుల కంపెనీ యాజమాన్యం జిల్లాకు 55పాష్‌మిషన్లను పంపిణీ చేసింది. ఇకనుంచి రైతుల ఆధార్‌కార్డు ఆధారంగా ఎరువుల కొనుగోళ్లు, సబ్సిడీ పొందేందుకు వీలు ఉంటుంది.


జిల్లాలో మొత్తం 47ఎరువుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, 35ఎరువుల దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కోరమాండల్‌ ఎరువుల యాజమాన్యం ద్వారా జిల్లాలో అన్నిషాపుల్లోనూ మిషన్లను పంపిణీ చేసింది. బయోమెట్రిక్‌ విధానం అమలుతో పంటల సాగులో అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌నెంబర్‌ నమోదు చేసుకొని ఎరువులు ఇవ్వాలని సన్నాహాలు చేసింది. రైతుల పేరిట బిల్లులు తప్పకుండా చెల్లిస్తుండటంతో రైతులకు ఏమేరకు ఎరువుల అవసరమో తెలుస్తుంది. అదేవిధంగా అక్రమాలను అరికట్టే వీలుంటుంది. వ్యాపారులు అధికధరలకు అమ్మే వీలుకూడా ఉండదు. రసాయనిక ఎరువులపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ప్రస్తుతం నేరుగా కంపెనీలకు ఈ రాయితీ వస్తోంది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎరువులు విక్రయించే డీలర్ల ఖాతాలోకి రాయితీ రానుంది.

Updated Date - 2020-11-17T08:41:59+05:30 IST