గుట్టుగా గుట్టనే తవ్వేశారు!

ABN , First Publish Date - 2020-11-16T09:42:41+05:30 IST

గుట్టుగా గుట్టను తవ్వేశారు. గుట్టను తవ్వి అక్కడి మట్టితో వ్యాపారులు సొమ్ముచేసుకున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

గుట్టుగా గుట్టనే తవ్వేశారు!

 కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో బయటపడిన వ్యాపారం

 తవ్వకాలకు ఉపయోగిస్తున్న వాహనాల సీజ్‌


పెద్దేముల్‌ : గుట్టుగా గుట్టను తవ్వేశారు. గుట్టను తవ్వి అక్కడి మట్టితో వ్యాపారులు సొమ్ముచేసుకున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్రమ వ్యాపారులు గుట్టను తవ్వి ఏకంగా గుట్టమధ్య నుంచి రోడ్డు వేసుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒక పౌరుడు స్పందించాడు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అక్రమ వ్యాపారం బయటపడింది. అధికారులు వచ్చి అక్కడ మట్టి తవ్వకాలకు ఉపయోగించిన ఎస్కవేటర్లతో పాటు మట్టిని తరలించేందుకు ఉపయోగిస్తున్న 2టిప్పర్లను పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.


పెద్దేముల్‌ మండలం కందనెల్లి సమీపంలో పెద్ద గుట్ట ఉంది. గుట్టపై భాగంలో ప్రధానరోడ్డు వైపు కనిపించకుండా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపారు. గుట్టను తవ్వి రోడ్డుగా మలిచారు. తాండూరు-హైదరాబాద్‌ ప్రధానరోడ్డును కలిపే విధంగా రోడ్డు వేస్తే అక్కడ గుట్టపైన చేసే ప్లాట్లకు మంచి డిమాండ్‌ ఉంటుందనే అంచనాతో కొంతమంది వ్యాపారులు గుట్టను తవ్వించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిపినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో..

కందనెల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గుట్టపైన జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై  కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్‌ స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రాత్రి వేళ తవ్వకాలు జరుగుతున్న గుట్ట వద్దకు వెళ్లి అక్కడ మట్టి తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్‌ చేశారు. పెద్దేముల్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేయాలని ఇన్‌చార్జి తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ మట్టిని ఎవరు తవ్వారు. ఎవరిపై కేసు నమోదు చేయాలనే వివరాలు మాత్రం పేర్కొనకపోవడంతో ఎవరిపైన కేసు నమోదు చేయాలని పోలీసులు అయోమయంలో పడ్డారు. వివరణ కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు ఫోన్‌చేసినా వారు స్పందించలేదు.

Updated Date - 2020-11-16T09:42:41+05:30 IST