స్పల్ప ఊరట..!

ABN , First Publish Date - 2020-11-14T08:36:35+05:30 IST

తెలంగాణలో బాణసంచాలను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్పల్ప ఊరట..!

 గ్రీన్‌క్రాకర్స్‌కు సుప్రీం అనుమతి

 ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన టపాసుల అమ్మకాలు

 ఊపిరి పీల్చుకున్న వ్యాపారులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : తెలంగాణలో బాణసంచాలను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండగ రోజున టపాసులు కాల్చొద్దని సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్‌క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. దీంతో ఫైర్‌ వర్స్క్‌డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది. గాలి నాణ్యత సాధారణంగా ఉన్నచోట రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్‌క్రాకర్స్‌కు అనుమతినివ్వడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.  హైకోర్టు తీర్పుతో మూత పడిన టపాసు దుకాణాలు తిరిగి మంగళవారం సాయంత్రం సుప్రీం కోర్టు తీర్పుతో తెరుచుకున్నాయి.


రాత్రి 11గంటల వరకు టపాసులను విక్రయించారు. దీపావళి పండగ సందర్భంగా టపాసుల విక్రయం కోసం వ్యాపారులు ముందస్తుగా అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ఏటా ఈ వ్యాపారాన్నే నమ్ముకొని ఎంతోమంది జీవన సాగిస్తున్నారు. వారం రోజులు ముందుగానే లక్షల రూపాయలు వెచ్చించి టపాసులను కొనుగోలు చేశారు. అన్ని సిద్ధం చేసుకున్నాక హైకోర్టు టపాసుల విక్రయాలను నిషేధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వ్యాపారులంతా ఆందోళనకు గురయ్యారు. అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తూ గ్రీన్‌క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. గ్రీన్‌ క్రాకర్స్‌తో పాటు ఇతర టపాసులను తెచ్చుకున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీపావళి పండగకు నాలుగు రోజుల ముందు నుంచే టపాసులను అమ్ముకునేవారు. దీపావళి పండగ వచ్చేసింది. సమయం చాలాతక్కువగా ఉండటంతో లక్షలు ఖర్చు చేసి తీసుకువచ్చిన టపాసులు అమ్ముడు పోతాయో లేవోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. 


గ్రీన్‌క్రాకర్స్‌ అంటే..?

సుప్రీం కోర్టు సంప్రదాయ పటాసులను నిషేధించింది. ఆకుపచ్చ పటాకులకు మాత్రమే అనుమతినిచ్చింది. దీనివలన 30శాతం తక్కువ కాలుష్యం ఏర్పడుతుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆకుపచ్చ క్రాకర్లను శాస్త్రవేత్తలు పరిశోధించి అభివృద్ధి చేశారు. వీటిని తక్కువ హానికరమైన ముడి పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తారు. దీనిలో దుమ్ము అణిచివేసే పదార్థాలు ఉన్నాయి. గ్రీన్‌కాక్రర్స్‌లో లిథియం, ఆర్సెనిక్‌, బేరియం, సీసం వంటి నిషేధిత రసాయనాలు ఉండవు. 


ఈసారి అమ్మకాలు కష్టమే..!

ప్రతిఏటా టపాసులు విక్రయిస్తాను. గత ఏడాది రూ.4 లక్షల టపాసులు తీసుకువచ్చాను. ఈసారి కరోనాతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో రూ.2లక్షల టపాసులు తీసుకువచ్చాను. దుకాణం ఏర్పాటుకు అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో బాణాసంచాను నిషేధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కొంత ఊరట లభించింది. కానీ.. టపాసులు అమ్మేందుకు ఒక్కరోజే సమయం ఉంది. తీసుకు వచ్చిన టపాసులన్నీ అమ్ముడు పోకుంటే.. నష్టం తప్పదు. కోర్టు గ్రీన్‌క్రాకర్స్‌ మాత్రమే ఉపయోగించాలని తీర్పునిచ్చింది. గ్రీన్‌క్రాకర్స్‌ ధర ఎక్కువగా ఉంది. సామాన్యులు గ్రీన్‌క్రాకర్స్‌ కొంటారో లేదో తెలియడం లేదు. 

Updated Date - 2020-11-14T08:36:35+05:30 IST