ఉమ్మడి జిల్లాలో 410 కేసులు నమోదు, ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-13T09:06:57+05:30 IST

చలితోపాటు కరోనా వైరస్‌ కేసులు కూడా అధికమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 410 కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 410 కేసులు నమోదు, ఒకరి మృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): చలితోపాటు కరోనా వైరస్‌ కేసులు కూడా అధికమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 410 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 184 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లాలో 210, వికారాబాద్‌ జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు జిల్లాల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,00,855కు చేరుకుంది. 


వికారాబాద్‌ జిల్లాలో 16... (ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 7, తాండూరులో 5, నవాబుపేటలో 4 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 2,710 కరోనా కేసులు నమోదుకాగా, వాటిలో 272 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 9 మంది వివిధ ఆసుపత్రుల్లో, 263 మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంతవరకు జిల్లాలో కరోనా నుంచి 2,386 మంది రికవరీ కాగా, 52మంది మృతి చెందారు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో ఒకరికి.. 

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో గురువారం 170మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. అతడు కొత్తూర్‌ మండలానికి చెందిన వ్యక్తి అని డాక్టర్‌ తెలిపారు.


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఏడుగురికి.. 

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గురువారం 10 కేంద్రాల్లో 171 మందికి కరోనా యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించారు. అందులో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా బారిన పడిన వారిలో ఇబ్రహీంపట్నంలో ఒకరు, ఎలిమినేడులో ఒకరు, మాడ్గులలో ఒకరు, తట్టి అన్నారంలో ముగ్గురు, హయత్‌నగర్‌లో ఒకరు ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

చేవెళ్ల డివిజన్‌లో నిల్‌..

చేవెళ్ల డివిజన్‌ పరిధిలో గురువారం 173 మందికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎవరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు తెలిపారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ తదితర మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్ర్లుల్లో ఈ పరీక్షలను నిర్వహించామని డాక్టర్లు చెప్పారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. 


మేడ్చల్‌లో ఏడుగురికి..

మేడ్చల్‌: మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో గురువారం 49 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ణారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎటువంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని వైద్యురాలు నళిని తెలిపారు. 


శంషాబాద్‌లో ముగ్గురికి..

శంషాబాద్‌: శంషాబాద్‌లో గురువారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడి పరీక్షా కేంద్రంలో మొత్తం 30మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించినట్టు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు. 

Updated Date - 2020-11-13T09:06:57+05:30 IST