నష్టపరిహారం అందేలా చూస్తాం

ABN , First Publish Date - 2020-11-12T09:12:08+05:30 IST

రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వంతో మాట్లాడతామని, రైతు ఆత్మహత్యల నివారణకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతురుణ ఉపశమన కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రుణఉపశమన కమిషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

నష్టపరిహారం అందేలా చూస్తాం

 ఆత్మహత్యల నివారణకే రైతురుణ ఉపశమన కమిషన్‌

 రైతులకు రుణాలపై వడ్డీ వ్యాపారులు, బ్యాంకర్లు ఒత్తిడి చేస్తే కమిషన్‌కు 

ఫిర్యాదు చేయండి రైతుల కోసం అధికారులు 

సమన్వయంతో సహకరించాలి

తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు


తాండూరు రూరల్‌: రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వంతో మాట్లాడతామని, రైతు ఆత్మహత్యల నివారణకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతురుణ ఉపశమన కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రుణఉపశమన కమిషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు మండల పరిషత్‌ కార్యాలయంలో తాండూరు డివిజన్‌కు చెందిన రెవెన్యూ, వ్యవసాయ మార్కెటింగ్‌, పశు సంవర్దక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ఆర్డీవో అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రుణాలు చెల్లించలేక, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించేందుకే తాము రాష్ట్రంలో పర్యటించి రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు కానీ, వడ్డీ వ్యాపారులు కానీ ఒత్తిడి తెస్తే వెంటనే రైతులు తమకు ఫిర్యాదు చేయాలన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు వ్యాపారులు నూటికిమూడు రూపాయల వడ్డీ తీసుకుంటున్నారని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. బ్యాంకర్లు కూడా రైతుకు పంట రుణం రూ.లక్షా 60వేల వరకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఏ మేరకు పంట నష్టపోయింది, రైతుల పరిస్థితి ఏంటి, ప్రస్తుతం రైతులకు ఎలాంటి సహాయం అందించాలని, సాగునీటి రంగాలు ఏవిధంగా ఉన్నాయనే విషయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. పత్తి పంట కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్లనే రైతులు ప్రైవేటుగా అమ్ముకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.


జిల్లాలో ఎంత పంట నష్టపోయిందని, వ్యవసాయ ఏడీ శంకర్‌రాథోడ్‌, రమాదేవిలను ప్రశ్నించగా మొత్తం జిల్లాలో లక్షా 45వేల 706 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వారు వివరించారు. అదేవిధంగా యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలాల్లో రూ.3.50లక్షల విలువ చేసే పశువులు నదిలో కొట్టుకుపోయినట్లు తెలిపారు. వీటిపై సమగ్ర నివేదిక అందించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు కవాల లక్ష్మారెడ్డి, పాకాల శ్రీహరిరావు, తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజయ్‌కుమార్‌, కార్యదర్శి శారదాదేవి, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, ఏడీ శంకర్‌ రాథోడ్‌, ఏవో రజిత, తాండూరు ఉద్యానవన శాఖ అధికారి మల్లికార్జున్‌, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


కష్టకాలంలో రైతులు ధైర్యంగా ఉండాలి 

బషీరాబాద్‌: కష్టకాలంలో రైతులు దైర్యంగా ఉండాలని, ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర రైతు ఉపశమన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బషీరాబాద్‌ మండలంలోని జీవన్గి, ఎక్మాయి గ్రామాలను పర్యటించి వర్షాలకు పాడైన పంట పొలాలను కమిషన్‌ సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో చైర్మన్‌, సభ్యులు స్థానికంగా సమావేశమై రైతులతో ముఖాముఖి చర్చిస్తూ సాధక బాద కాలు  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎకరాకు ఏ మేరకు పత్తి దిగుబడి వస్తుందంటూ జీవన్గి గ్రామంలో రైతులను ప్రశ్నిస్తూ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈసారి పత్తికి ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి పెడితే ఒకటి, రెండు క్వింటాళ్ల పత్తి కూడా రావడంలేదని రైతులు మాణిక్‌రెడ్డి, గిరిజాపూరం నర్సిరెడ్డి, బసప్ప తదితరులు గోడు వెల్లబోసుకున్నారు.


పంట బీమాకు సంబంధించి కమిషన్‌ చైర్మన్‌ ఆరా తీయగా బ్యాంకుల్లో బీమా డబ్బులు కోత పెట్టడమే కానీ ఒక్కసారి కూడా పంట నష్టం బీమా దక్కలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకర్లకు రైతులంటే చిన్నచూపు ఉందని రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎక్మాయి గ్రామంలో పత్తి పంటలను పరిశీలించిన చైర్మన్‌, సభ్యులు రైతు పోషమోళ్ల మొగులప్పతో చర్చించారు. ఇటీవల పత్తి పంటకు నష్టం జరిగిందని ఆసెంబ్లీ లోపలికి పంపించాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయమై చైర్మన్‌, సభ్యులు ఆరా తీశారు.


ఈ ఏడాది పంట పెట్టుబడులకు, కుటంబపోషణకు రూ. 3లక్షల ఆప్పు ఉందని, రుణ విముక్తి కల్పించాలని కోరగా ఆప్పునకు సంబంధించిన వివరాలతో తమ వద్దకు రావాలని రైతుకు సూచించారు. వీరివెంట రైతు రుణ ఉపశమన  కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి శారద, తాండూరు ఆర్డీవో ఆశోక్‌కుమార్‌, ఎడీఏ శంకర్‌, ఎవో నాగంకృష్ణ తదితరులున్నారు.

Updated Date - 2020-11-12T09:12:08+05:30 IST