రోడ్లపైనే పార్కింగ్‌

ABN , First Publish Date - 2020-11-10T09:05:07+05:30 IST

పట్టణంలోని ప్రధాన రోడ్లు పార్కింగ్‌కు అడ్డాలుగా మారాయి. రోడ్లపై ద్విచక్రవాహనాల నిలిపివేతతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

రోడ్లపైనే పార్కింగ్‌

 అడ్డగోలుగా వాహనాల నిలిపివేతతో రాకపోకలకు ఇబ్బందులు 

 జరిమానాలకే పరిమితమైన ట్రాఫిక్‌ సిబ్బంది

నిబందనలు అతిక్రమిస్తున్న వాహనదారులు 

 పార్కింగ్‌ స్థలాలకు నోచని ఆమనగల్లు 


ఆమనగల్లు : పట్టణంలోని ప్రధాన రోడ్లు పార్కింగ్‌కు అడ్డాలుగా మారాయి. రోడ్లపై ద్విచక్రవాహనాల నిలిపివేతతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వ్యాపారస్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్‌తో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్ల మధ్యలో వాహనాలు నిలిపి గంటల తరబడి వాహనదారులు దుకాణాలు,హోటళ్లలో కూర్చుంటుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్న వాహనదారులు నిబంధనలను అతిక్రమిస్తుండడంతో ఫలితం లేకుండా పోతుంది.


ఇటీవల ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులను చలాన్లు రాసే వరకే పరిమితమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై వాహనాలు నిలుపకుండా పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం వలన వాహనదారులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. ఆమనగల్లు పట్టణం ఐదు మండలాలకు కూడలి. ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు ప్రజలు రాకపోకలకు సాగిస్తుంటారు. దానికి తోడు విక్రయాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, ఉపాధిరీత్యా నిత్యం వందల మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా ఆమనగల్లు పట్టణంలో ఎక్కడా పార్కింగ్‌ స్థలాలు లేవు. దీంతో విధిలేక రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. ప్రధానంగా బస్టాండ్‌ ఎదుట, రాజీవ్‌గాందీ కూడలిలో శ్రీశైలం-హైదరాబాద్‌ రోడ్డుపై, షాద్‌నగర్‌, మాడ్గుల రోడ్డుపై ఉదయం, సాయంత్రం వేళల్లో వందల సంఖ్యలో వాహనాలు నిలుపుతున్నారు. గత ఐదేళ్ల క్రితం శ్రీశైలం-హైదరాబాద్‌ రోడ్డును విస్తరించారు.


అయినా వాహనాల పార్కింగ్‌, చిరు వ్యాపారుల ఆక్రమణలు, దుకాణాదారుల షెడ్ల నిర్మాణం మూలంగా రోడ్డు మళ్లీ ఇరుకుగా మారింది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండడంతో వేగంగా వస్తున్న వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. షాద్‌నగర్‌, మాడ్గుల రోడ్లు అసలే ఇరుకు. ఆపై వాహనాల పార్కింగ్‌, ఆక్రమణలతో ఒక్కోసారి బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే పరిస్థితి లేకుండా పోతుంది. ఆమనగల్లు మున్సిపాలిటీలో పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుకు ఎవరూ చొరవ తీసుకోవడంలేదు. పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు మూలంగా ఆదాయం లభించడంతో పాటు ట్రాఫిక్‌ అంతరాయం తొలుగుతుంది. ఇప్పటికైనా ఆ దిశగా ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.  

Updated Date - 2020-11-10T09:05:07+05:30 IST