పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం

ABN , First Publish Date - 2020-11-09T09:51:24+05:30 IST

వర్షాలు సమృద్ధిగా కురిశాయి. జిల్లాలో గణ నీయంగా పత్తిసాగు చేశారు. ప్రస్తుతం పత్తి తీయడం ప్రారంభిం చడంతో దానికి అనుగు ణంగా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం

 జిల్లాలో 15 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

 సమన్వయం కోసం ప్రతీ కేంద్రానికి  ఏఈవో

 మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5,825

 జిల్లాలో 20 లక్షల క్వింటాళ్ల సేకరణే లక్ష్యం

  ఏర్పాట్లలో అధికారులు, రేపు ప్రారంభం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  వర్షాలు సమృద్ధిగా కురిశాయి.  జిల్లాలో గణ నీయంగా పత్తిసాగు చేశారు. ప్రస్తుతం పత్తి తీయడం ప్రారంభిం చడంతో దానికి అనుగు ణంగా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. వానాకాలం లో 4,71,795 ఎకరాల వివిధ పంటలు సాగు చేయగా అందులో అత్యధికంగా 2,73,227 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దీంతో కాటన్‌ కార్పొరేషన్‌ ఆ్‌ఫ్‌ ఇండియా 15 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.


జిల్లాలో 15జిన్నింగ్‌ మిల్లులను గుర్తించారు. అత్యధికంగా షాద్‌నగర్‌లో 12 మిల్లులు. ఆమనగల్లు పరిధిలోని తలకొండపల్లి, ఇబ్రహీంపట్నంలోని పరిధిలోని సంఘి, చేవెళ్లలో ఒకటి చొప్పున మిల్లులను గుర్తించారు.  రేపటి నుంచి పత్తిని సేకరించనున్నారు.  పత్తి రైతులకు క్యూఆర్‌ కోడ్‌ కార్డులను జారీ చేశారు. ఈ కార్డులతో పాటు భూమి, పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా బుక్కుతో వచ్చి నేరుగా పత్తిని అమ్ముకునే వీలును కల్పిస్తున్నారు. 


జిల్లాలో 20 లక్షల క్వింటాళ్ల కొనుగోలు అంచనా

 ఈసారి దిగుబడి కూడా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. హెక్టారుకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించారు. 20 లక్షల క్వింటాళ్లు సేకరించాలని నిర్ణయించింది. కానీ... ఇటీవల వర్షాలకు 82,870 ఎకరాల్లో  పత్తిపంట నీటమునిగింది. దీంతో 5 లక్షల క్వింటాళ్లు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా 15లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. 


పత్తికి పెరిగిన మద్ధతు ధర..

 ప్రతీయేటా మద్ధతు ధర కూడా పెరుగుతోంది. గత ఏడాది క్వింటాల్‌ పత్తికి 5,450 నిర్ణయించారు. ఈసారి మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,825 నిర్ణయించారు. తేమశాతం 8-12 వరకు ఉంటే సీసీఐ కొనుగోలు చేస్తుంది. తేమ 8 శాతం ఉంటే మద్ధతు ధర రూ.5,825 వస్తుంది. తేమ 9శాతం ఉంటే 58 రూపాయల 25 పైసలు కట్‌ అవుతుంది. 


ప్రతి కేంద్రానికి ఒక ఏఈవో..

పత్తి కొనుగోళ్ల విషయంలో గందరగోళం తలెత్తకుండా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొనుగోలుకేంద్రం ఉన్న ప్రతి జిన్నింగ్‌ మిల్లుకు ఏఈవోను నియమించింది. పత్తిని తీసుకువచ్చే రైతులను సమన్వయం చేయడం, సేకరించిన పత్తిని సకాలంలో కేంద్రం నుంచి తరలించడం, చెల్లింపులు తదితర అంశాలను ఏఈవో పర్యవేక్షిస్తారు. 

Updated Date - 2020-11-09T09:51:24+05:30 IST