బీజేపీలో చేరిన ఆర్‌పీఎన్ సింగ్.. మోదీ కలల సాకారానికేనని ప్రకటన

ABN , First Publish Date - 2022-01-25T21:02:32+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్ బీజేపీలో ..

బీజేపీలో చేరిన ఆర్‌పీఎన్ సింగ్.. మోదీ కలల సాకారానికేనని ప్రకటన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్ బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆయన మంగళవారం రాజీనామా చేయడం, ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన బీజేపీలో చేరడం వంటి వరుస పరిణామాలు చోటుచేసున్నాయి. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో ఆర్‌పీఎన్ సింగ్ మాట్లాడుతూ, ఒకే రాజకీయ పార్టీలో (కాంగ్రెస్) తాను 32 ఏళ్లు ఉన్నానని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరి లేదని అన్నారు. ఇండియా కోసం ప్రధాని మోదీ కన్న కలల సాకారం కోసం బీజేపీలో ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు.


దీనికి ముందు, ఆర్‌పీఎన్‌ సింగ్ ఓ ట్వీట్‌లో...''రిపబ్లిక్ డే ఫార్మెషన్ రోజే నేను నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్'' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉండటం, కనీసం తన సన్నిహితులకు కూడా యూపీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఇవ్వకపోవడం ఆయన రాజీనామాకు దారితీసినట్టు చెబుతున్నారు. ఆర్‌పీఎన్ సింగ్ 1996 నుంచి 2007 వరకూ పడ్రౌనా ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం కుషీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆసక్తికరంగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 30 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఆర్‌పీఎన్ సింగ్ కూడా ఉన్నారు.

Updated Date - 2022-01-25T21:02:32+05:30 IST