రాజ నీతిజ్ఞుడు, సామాజిక వేత్త

ABN , First Publish Date - 2020-03-13T06:50:00+05:30 IST

హైదరాబాద్ సంస్థాన జాతీయోద్యమానికి, తెలంగాణ ప్రజల విజ్ఞాన వికాసాలకు చిరస్మరణీయమైన కృషి సల్పి నవ్యాంధ్ర నిర్మాతగా గణుతికెక్కిన సౌజన్యమూర్తి బూర్గుల రామకృష్ణారావు. నిష్కళంక దేశభక్తుడు....

రాజ నీతిజ్ఞుడు, సామాజిక వేత్త

హైదరాబాద్ సంస్థాన జాతీయోద్యమానికి, తెలంగాణ ప్రజల విజ్ఞాన వికాసాలకు చిరస్మరణీయమైన కృషి సల్పి నవ్యాంధ్ర నిర్మాతగా గణుతికెక్కిన సౌజన్యమూర్తి బూర్గుల రామకృష్ణారావు. నిష్కళంక దేశభక్తుడు. గొప్ప న్యాయవాది, పాలనాదక్షుడు, కవి, పండితుడు, పరిశోధకుడు. ఉర్దూ, పార్శీ, సంస్కృతం, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీలలో మంచి పాండిత్యం గల బహుభాషాకోవిదుడు. 1899 మార్చి 13 వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తాలుకా పడగల్లులో బూర్గుల జన్మించారు. ఇంటిపేరు పుల్లంరాజు. అయితే, స్వగ్రామమైన బూర్గుల నామమే ఈయన ఇంటి పేరయింది. సుప్రసిద్ధ న్యాయవాదిగా పేరుప్రఖ్యాతులు గడించారు. భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బూర్గుల వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేశారు. 


డిగ్రీ చదువుకునే రోజుల్లోనే జాతీయభావాలతో ప్రభావితమై 1916లో వామన్ నాయక్ అధ్యక్షతన ‘హైదరాబాద్ యంగ్ మెన్స్’ సంస్థను స్థాపించి తెలంగాణ ప్రజలలో జాగృతి కలిగించే కార్యక్రమాలు చేపట్టారు. మాడపాటి హనుమంతరావు స్థాపించిన ‘ఆంధ్ర కేంద్ర జనసంఘం’లో చేరి గ్రంథాలయాల స్థాపనకు, వయోజన విద్యాకేంద్రాల నిర్వహణకు కృషి చేశారు. 1923లో కాకినాడలో మౌలానా మహ్మద్ ఆలీ అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు హాజరై, ఉత్తరాది నాయకుల ప్రసంగాలను తెలుగులోకి అనువదించి జాతీయ నాయకుల ప్రశంసలనందుకున్నారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ అధ్యక్షునిగా దానిని చైతన్యవంతమైన సంస్థగా రూపొందించారు. 1938 స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో కీలకపాత్ర పోషించారు బూర్గుల రామకృష్ణా రావు. ‘పీపుల్స్ కన్వెన్షన్’ ను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని గళం వినిపించారు. గాంధేయవాదిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్ సంస్థానంలో చెలరేగిన రజాకార్ల ఉద్యమం నుండి ప్రజలను కాపాడుటకు కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితరులతో కలిసి గ్రామలు సందర్శించి ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. రజాకార్ల దురంతాలను అంతం చేయాల్సిందిగా స్టేట్ కాంగ్రెస్ పక్షాన ఢిల్లీకి వెళ్లి నెహ్రూ, పటేల్ లను కోరారు. 


పోలీసు చర్యల అనంతరం హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన తాత్కాలిక మంత్రివర్గంలో బూర్గుల రెవెన్యూ, ఎక్సైజ్, విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా విశాలాంధ్రోద్యమాన్ని బలపరిచి, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కృషి చేశారు.


సాంఘిక సాంస్కృతిక రంగాల్లోనూ వీరి సేవ ప్రత్యేకమైనది. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్ ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు. ఉమర్ ఖయ్యూం, ఉర్దూ భాషా సారస్వతములు, పండితరాజ పంచామృతం, నవీన వాజ్ఞ్మయము, నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర తదితర రచనలు చేశారు. చారిత్రక దృష్టితో రెడ్డి రాజుల కాలపు సంస్కృతులు అను పరిశోధనా వ్యాసాలు రాశారు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డిల ప్రోత్సాహంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేశారు. బూర్గుల కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. 1962లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1967 సెప్టెంబర్ 10వ తేదీన కన్నుమూశారు.

డా. తన్నీరు కళ్యాణ్ కుమార్

తెలుగు లెక్చరర్, ఏపీఆర్‌డీసీ

(నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి)

Updated Date - 2020-03-13T06:50:00+05:30 IST