మళ్లీ రాజ వైభవం

ABN , First Publish Date - 2021-06-15T05:22:08+05:30 IST

మాన్సాస్‌కు మళ్లీ రాజవైభవం రానుంది. కొత్తమార్గ నిర్దేశంలో పయనించనుంది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజునే కొనసాగించాలని హైకోర్టు సోమవారం వెల్లడించిన తీర్పు జిల్లాలో సంచలనమైంది. అశోక్‌ అభిమానులు, టీడీపీ వర్గాలు, విద్యార్థి.. ప్రజా సంఘాలు తీర్పును స్వాగతించాయి.

మళ్లీ రాజ వైభవం
మాన్సాస్‌ కార్యాలయం

 మాన్సాస్‌ చైర్మన్‌గా  అశోక్‌గజపతిరాజును 

     కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు

 ఇటీవల కాలంలో అశోక్‌కు అనుకూలంగా రెండు తీర్పులు

 గతంలో రామతీర్థం.. నేడు మాన్సాస్‌

 తాజా పరిణామంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు

 వివాదాస్పద నిర్ణయాలతో హడావుడి చేసిన సంచయిత

 విద్యాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించుకోలేని దుస్థితి

 మాన్సాస్‌ కార్యాలయాన్నే తరలించిన ఘనత


మాన్సాస్‌కు మళ్లీ రాజవైభవం రానుంది. కొత్తమార్గ నిర్దేశంలో పయనించనుంది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజునే కొనసాగించాలని హైకోర్టు సోమవారం వెల్లడించిన తీర్పు జిల్లాలో సంచలనమైంది. అశోక్‌ అభిమానులు, టీడీపీ వర్గాలు, విద్యార్థి.. ప్రజా సంఘాలు తీర్పును స్వాగతించాయి. అశోక్‌ హర్షం వ్యక్తం చేశారు. స్వగృహంలో స్వీట్లు పంచారు. చీకటి జీవోకు చెల్లు చీటీ చెప్పినట్లయిందని, సంచయితకు షాక్‌ తగిలిందని ఆయా వర్గాలు అభిప్రాయపడ్డాయి. అశోక్‌ చైర్మన్‌గా పదవీ కాలం ఇంకా పూర్తి కాకపోవడం.. ముందస్తు నోటీసులేవీ ఇవ్వకపోవటం.. మాన్సాస్‌ బైలాను పరిశీలించకుండా ప్రభుత్వం జీవో విడుదల చేయడం తదితర ఘటనలపై ఆయన గత ఏడాది కోర్టును ఆశ్రయించారు. తాజా తీర్పుతో రాజ్యాంగం, చట్టాలపై మరింత నమ్మకం కలిగినట్టయిందని అశోక్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో త్వరలో మళ్లీ మాన్సాస్‌లో అడుగుపెట్టనున్నారు. రామతీర్థం ఘటనలో ఇప్పటికే అశోక్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కొద్దినెలల వ్యవధిలో మరోసారి ఆయనకు ఊరట కలిగింది.



(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

అది 2020 మార్చి 5వ తేదీ.. ఢిల్లీ నుంచి అకస్మాత్తుగా ఊడి పడిన సంచయిత మాన్సాస్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు ముందుగా సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా ప్రమాణం చేశారు. రాత్రికి రాత్రి ప్రభుత్వం జీఓ విడుదల చేయడం ద్వారా ఊహించని పదవిని ఆమె చేపట్టారు. ఈ ఘటనతో విజయనగరం కోటలో కలకలం రేగింది.. చీకటి జీవోతో షాక్‌ అయింది. రాజవంశంలో పురుష సంతతి వారున్నప్పటికీ ట్రస్టు బైలాకు భిన్నంగా ప్రభుత్వం ముందురోజు రాత్రి చీకటి జీఓకు రూపకల్పన చేసిందని అప్పట్లో సర్వత్రా వినిపించిన ప్రధాన విమర్శ. అశోక్‌ గజపతిరాజుపై కక్షతోనే ప్రభుత్వం ఈ దురాగతానికి పాల్పడిందని జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎప్పటికైనా ఈ నియామకం చెల్లదని తెలిసినా అధికార పార్టీ ప్రముఖులు ట్రస్టు ద్వారా తాము అనుకున్న పనులన్నీ చేసేందుకు వీలుగా ఆనందగజపతి మొదటి భార్య కుమార్తె సంచయితను రంగంలోకి దించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన వేల కోట్ల రూపాయల ఆస్తులు చేతిలోనుంచి చేజారిపోవటంతో తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్‌ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఏడాది పాటు వాదనలు జరిగిన తరువాత తాజాగా కోర్టు తీర్పును వెలువరించింది. గతేడాది మార్చిలో విడుదల చేసిన ఆర్ధరాత్రి జీఓను కొట్టి వేసింది. 

ప్రభుత్వానికి చెంప పెట్టు

ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకు చెంపదెబ్బ తగిలింది. గతంలో రామతీర్థం, పైడితల్లి అమ్మవారు దేవ స్థానం అనువంశక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ప్రభుత్వం తప్పించింది. రామతీర్థం కొండపైనున్న విగ్రహాల ధ్వంసం సందర్భంలో గొడవలను బూచిగా చూపి ప్రభుత్వం వేటు వేసింది. ఆ జీఓను సవాల్‌ చేస్తూ అశోక్‌ గజపతిరాజు కోర్టుకు వెళ్లారు. కొద్ది నెలల్లోనే జీఓను కోర్టు కొట్టి వేసింది. తిరిగి అశోక్‌ గజపతిరాజునే అనువంశక ధర్మకర్తగా నియమించాలని ఆదేశించింది. ఇపుడు సింహాచల దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు వంతు వచ్చింది. గతేడాది మార్చి 5 ముందురోజు రాత్రి విడుదలైన జీఓను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అశోక్‌ గజపతిరాజునే చైర్మన్‌గా కొనసాగించాలని సూచించింది. అశోక్‌కు చైర్మన్‌గా పదవీ కాలం ఇంకా ఉండటం.. ముందస్తు నోటీసులేవీ ఇవ్వకపోవటం.. మాన్సాస్‌ బైలాస్‌ను పరిశీలించకుండా జీఓ విడుదల చేయడం తదితర అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు అశోక్‌గజపతి భావిస్తున్నారు.

విద్యాలయాల ప్రైవేటీకరణ

సంచయిత మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా నియామకమైన తరువాత అనేక వివాదాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహరాజా కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని మూడు జిల్లాల విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కొన్ని నెలల పాటు ఉద్యమించారు. అయినా ట్రస్టు యాజమాన్యం ఇంటర్‌ విద్యను ఎత్తి వేసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విలీనం చేశారు. పురాతనమైన బీఈడీ కళాశాలను కోటలోని రౌండ్‌ మహల్‌ నుంచి హెడ్‌పోస్టాఫీస్‌ ఎదురుగా ఉన్న స్థలానికి మార్పు చేశారు. మాన్సాస్‌ పరిధిలోని లా కళాశాలకు మంచి పేరుంది. దీనిని ఎత్తివేసి మహరాజా ఇంటర్‌ క్యాంపస్‌కు మార్చారు. ఇలా విద్యాపరంగా అనేక వివాదాస్పద నిర్ణయాలతో ట్రస్టుకు చెరగని మచ్చ తెచ్చారు. 

కార్యాలయాన్నే మార్చేసి

మాన్సాస్‌కు గుండెకాయ ట్రస్టు ప్రధాన కార్యాలయం. కోటలోని ప్రధాన ముఖద్వారం దాటిలోపలకు ప్రవేశించగానే కనిపిస్తుంది. మాన్సాస్‌ ఆస్తుల రికార్డులు, విద్యా సంస్థలు, ఈవో కార్యాలయం ఇందులో ఉన్నాయి. విద్యా సంస్థలైన ఎమ్‌వీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, బీఈడీ, లా, డిగ్రీ, పీజీ కళాశాలల వరకు నిర్వహణంతా ఈ కార్యాలయ పరిపాలనా విభాగం ద్వారానే జరుగుతుండేది. ఇటువంటి కార్యాలయాన్ని ఎత్తి వేసి విశాఖ జిల్లా పధ్మనాభం మండలానికి మార్చారు. పరిపాలనా సౌలభ్యం అన్న పేరుతో ప్రధాన కార్యాలయాన్నే మార్పు చేయటం, రికార్డులు తరలించడం వెనుక జరిగిన దురాగతాలను వెలికి తీయాల్సి ఉంది. 

మైదానానికి తాళం

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు చక్కని మైదానంగా.. ప్రముఖుల సభలకు వేదికగా.. వందలాది మంది పట్టణ వాసులకు వ్యాయామ స్థలంగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఎమ్‌ఆర్‌ క్రీడా మైదానం గేట్లకు సంచయిత చైర్‌పర్సన్‌ అయిన తరువాత తాళం వేశారు. ఇది అన్ని వర్గాల్లోని తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 

జీతాలు చెల్లించని దుస్థితి

సంచయిత చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోయారు. మాన్సాస్‌ ట్రస్టు  ఉన్నదే విద్యా సంస్థల నిర్వహణ కోసం కాగా ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. జీతాల కోసం బోధన, బోధనేతర సిబ్బంది రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేశారు. ఇప్పటికీ మూడు నెలలుగా జీతాలు పొందని సిబ్బంది ఎంతో మంది ఉన్నారు. కొంత మందికి సగం సగం జీతాలు చెల్లించి నెట్టుకు వస్తున్నారు. విజయనగరంలోని రాజులు ఏర్పాటు చేసిన విద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం చౌలీ్ట్రని ఏర్పాటు చేశారు. దీనికి సింహాచల దేవస్థానం ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. నేడు పూర్తిగా కల తప్పింది. ఉంటుందో.. ఉండదో కూడా తెలియని పరిస్థితి. 

ఖాతాలు మార్పు

మాన్సాస్‌ పరిధిలోని విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాల కోసం బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు ఉన్నాయి.  వాటిని వివిధ బ్యాంకుల్లోకి మార్చినట్లు సమాచారం. ఆ ఖాతాలను ఏఏ బ్యాంకుల్లోకి తరలించారన్నది పరిశీలించాల్సి ఉంది. స్థానికంగా విద్యా సంస్థలున్న కారణంగా స్థానిక బ్యాంకుల్లో ఖాతాలుంటేనే సౌలభ్యం.  ఎందుకోసం మార్పులు చేర్పులు చేశారో తేలాల్సి ఉంది. 

ఊర్మిళా గజపతి పోరాటం

మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించడాన్ని ఆనందగజపతి రెండో భార్య సుధాగజపతి, కుమార్తె ఊర్మిళ గజపతి రాజులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు. సంచయిత తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను దుయ్యబడుతున్నారు. 

పూర్వవైభవం తెస్తా

‘చీకటి జీఓల ద్వారా పదవులు పొందాలనుకోవడం సరికాదు. ఇలాంటివి ఎంతో కాలం నిలబడవు. మాన్సాస్‌లో ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తాం. అనేక చేర్పులు.. మార్పులు జరిగినట్లు వస్తున్న వివరాలపై దృష్టి పెడతాం. మాన్సాస్‌కు పూర్వ వైభవం తెస్తాం’ అని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ పూర్వ చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు చెప్పారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఈ ఏడాది వ్యవధిలో సింహాచల దేవస్థానంలో అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన దేవస్థానాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు. గోశాలలో ఉన్న మూగ జీవులకు ఆహారం అందించకుండా హింసించారు. అనేక ఆవులు మరణించినట్లు నా దృష్టికి వచ్చింది. దేవాలయాల ద్వారా వస్తున్న ఆదాయంలో 17శాతం దేవదాయ శాఖకు వెళుతుంది. ఈ శాఖ ద్వారా ఆలయాల అభివృద్ధి జరగాలి. ప్రజల కోసం ఏర్పాటైన ట్రస్టు కనుక ప్రజలు, ప్రభుత్వం సహకరించాలి. దొడ్డి దారిన పదవులు పొందాలను కోవటం సరికాదు. సోషల్‌ మీడియాలో తండ్రుల పేర్లు మార్చేసుకుంటే సరిపోదు. ట్రస్టు బైలా ఏం చెబుతోందో చూడాలి. ఇదేదీ లేకుండా చీకటి జీఓల ద్వారా పదవులు పొందాలనుకోవటం సరికాదు. భక్తుల మనోభావలకు అద్దం పట్టే విధంగా సింహాచల దేవస్థానాన్ని తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తా. హైకోర్టు తీర్పు రాజ్యాంగం, చట్టాలపై మరింత నమ్మకాన్ని పెంచింది. 

    -   పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి

ఆశయాలకు అనుగుణంగా

మాన్సాస్‌ ట్రస్టు ఏర్పాటులో కీలకమైనది విద్య. పేదవారికి విద్యను అందించేందుకే సంస్థ ఏర్పాటైంది. రాజుల భూములు, దివానాల భూములు, ఇనాం భూములు భూ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వానికి చేరిపోకుండా ట్రస్టు పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికే జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. విద్యా సంస్థలను గాడిలో పెట్టాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. కాదంటే రాష్ట్ర స్థాయిలోని దేవదాయ శాఖ కమిషనర్‌ చేతికి అధికారికంగా పగ్గాలు అప్పగించాలి.

                                                - డాక్టర్‌ జయపాల్‌, ఎమ్‌ఆర్‌ కళాశాల, విజయనగరం.



Updated Date - 2021-06-15T05:22:08+05:30 IST