Abn logo
Oct 13 2020 @ 04:23AM

డివిల్లీర్స్‌ విధ్వంసం

Kaakateeya

ఈ సీజన్‌లో చక్కటి సమతూకంతో కనిపిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి మెరిసింది. ఆరంభంలో నెమ్మదిగా సాగిన ఇన్నింగ్స్‌ను డివిల్లీర్స్‌ ఆఖర్లో పిడుగుల్లాంటి షాట్లతో కదంతొక్కించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఇక పిచ్‌ పరిస్థితిని సరిగ్గా అంచనా వేస్తూ అదనపు బౌలర్‌తో బరిలోకి దిగడం జట్టుకుకలిసొచ్చింది. దీంతో వీరి ముప్పేట దాడికి కోల్‌కతా పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ బ్యాట్లెత్తేయడంతో ఘోర పరాజయం ఎదురైంది.


33 బంతుల్లో 73 నాటౌట్‌

కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు

చిత్తుగా ఓడిన కోల్‌కతా


షార్జా: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నుంచి మరో ఆల్‌రౌండ్‌ షో. చిన్న మైదానంలో తమ బౌలింగ్‌ సత్తాను ప్రదర్శిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 విజయాలు 10 పాయింట్లతో ఆర్‌సీబీ మూడో స్థానానికి చేరింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. డివిల్లీర్స్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించగా ఫించ్‌ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47) రాణించాడు. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. గిల్‌ (34) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డివిల్లీర్స్‌ నిలిచాడు. 

పోరాడని కోల్‌కతా: భారీ ఛేదనలో కోల్‌కతా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ బంతులకు జట్టు తెగ ఇబ్బందిపడింది. యువ క్రికెటర్‌ టామ్‌ బాంటన్‌ (8) అరంగేట్రంలో నిరాశపరుస్తూ నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐదో ఓవర్‌ వరుసగా 4,6తో ఊపు తేవడంతో పవర్‌ప్లేలో కేకేఆర్‌ కష్టంగా 43 పరుగులు చేసింది. ఆ తర్వాత రాణా (9)ను సుందర్‌ అవుట్‌ చేయగా గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఫించ్‌ వదిలేశాడు. అయితే అతడెక్కువ సేపు నిలవలేదు. పదో ఓవర్‌లో లేని రన్‌ కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఇయాన్‌ మోర్గాన్‌ (8) ఆడిన షాట్‌ను కవర్‌లో అడ్డుకున్న ఉడాన మెరుపు వేగంతో కీపర్‌ డివిల్లీర్స్‌కు త్రో వేయడంతో గిల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక వరుస ఓవర్లలో దినేశ్‌ కార్తీక్‌ (1), మోర్గాన్‌ పెవిలియన్‌కు చేరగా 64/5 స్కోరుతో ఉన్న కేకేఆర్‌ పరిస్థితి ఏమిటో అర్థమైంది. 13వ ఓవర్‌లో రస్సెల్‌ ఒక్క పరుగు దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను లాంగా్‌ఫలో దేవ్‌దత్‌ వదిలేశాడు. మరుసటి ఓవర్‌లో తను వరుసగా 4,6,4 బాది ఆర్‌సీబీ శిబిరంలో గుబులు రేపాడు. కానీ మరో భారీ షాట్‌కు వెళ్లి ఐదో బంతికి సిరాజ్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. 17వ ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి (16) అవుట్‌ కావడం.. అటు రన్‌రేట్‌ 32 పరుగులకు చేరడంతో కేకేఆర్‌ పూర్తిగా ఆశలు వదులుకుంది. 

ఆరంభంలో కట్టడి చేసినా..: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్‌నే ఎంచుకుంది. అయితే షార్జా మైదానంలో ఎక్కువ భాగం కోల్‌కతా బౌలర్లే ఆధిపత్యం చూపారు. కానీ  డివిల్లీర్స్‌ రాకతో తొలి 15 ఓవర్లు ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుగా మ్యాచ్‌ స్వరూపం మారింది. ఆరంభ మూడు ఓవర్లలో ఓపెనర్లు ఫించ్‌, దేవ్‌దత్‌ బౌండరీలతో జోరు చూపినా ఆ తర్వాత నెమ్మదించడంతో పవర్‌ప్లేలో 47 పరుగులే వచ్చాయి. ఇక ఎనిమిదో ఓవర్‌లో దేవ్‌దత్‌ను రస్సెల్‌ బౌల్డ్‌ చేయడంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఫించ్‌, కోహ్లీలను పేసర్‌ నాగర్‌కోటి, స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా నిలువరించారు. దీంతో 9-15 ఓవర్ల మధ్య 42 రన్స్‌ మాత్రమే వచ్చాయి. దీనికి తోడు 13వ ఓవర్‌లో ఫించ్‌ను ప్రసిద్ధ్‌ కృష్ణ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ, డివిల్లీర్స్‌ కొద్దిసేపు తడబడ్డారు.

ఏబీ దూకుడు: అప్పటిదాకా చప్పగా సాగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను చివరి ఐదు ఓవర్లలో డివిల్లీర్స్‌ ఉరకలెత్తించాడు. దీంతో 30 బంతుల్లోనే 83 పరుగులు నమోదయ్యాయి. స్ట్రయికింగ్‌ ఎక్కువగా తనే తీసుకున్న ఏబీ ముందుగా 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఒత్తిడిని తగ్గించాడు. ఇందులో ఓ సిక్సర్‌ అయితే ఏకంగా రోడ్డుపై వెళుతున్న కారుకు తగలడం గమనార్హం. ఈ దెబ్బకు నాగర్‌కోటి తొలి మూడు ఓవర్లలో 18 పరుగులిస్తే.. ఈ ఒక్క ఓవర్‌లోనే మరో 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లో కమిన్స్‌ను వదలకుండా 6,4,6తో 19 రన్స్‌ రాబట్టాడు. మరుసటి ఓవర్‌లో వరుసగా 4,6 బాదిన డివిల్లీర్స్‌ 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో కోహ్లీ 12 పరుగులే చేసినా చివరి ఓవర్‌లో ఏబీ 6,4,4తో స్కోరు 200 సమీపానికి చేరింది. అటు 47 బంతుల్లోనే మూడో వికెట్‌కు అజేయంగా 100 పరుగులు జత చేరాయి.


స్కోరు బోర్డు

 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: ఫించ్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 47, దేవ్‌దత్‌ (బి) రస్సెల్‌ 32, కోహ్లీ (నాటౌట్‌) 33, డివిల్లీర్స్‌ (నాటౌట్‌) 73; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 194/2. వికెట్ల పతనం: 1-67, 2-94. బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-38-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-42-1; రస్సెల్‌ 4-0-51-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-25-0; నాగర్‌కోటి 4-0-36-0.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: టామ్‌ బాంటన్‌ (బి) సైనీ 8, శుభ్‌మన్‌ గిల్‌ (రనౌట్‌) ఉడాన 34, నితీష్‌ రాణా (బి) సుందర్‌ 9, మోర్గాన్‌ (సి) ఉడాన (బి) సుందర్‌ 8, దినేష్‌ కార్తీక్‌ (బి) చాహల్‌ 1, రస్సెల్‌ (సి) సిరాజ్‌ (బి) ఉడాన 16, రాహుల్‌ త్రిపాఠీ (సి) మోరిస్‌ (బి) సిరాజ్‌ 16, కమిన్స్‌ (సి) దేవదత్‌ (బి) మోరిస్‌ 1, నాగర్‌కోటి (బి) మోరిస్‌ 4, వరుణ్‌ (నాటౌట్‌) 7, ప్రసిద్ధ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 112/9. వికెట్ల పతనం: 1-23, 2-51, 3-55, 4-62, 5-64, 6-85, 7-89, 8-99, 9-108. బౌలింగ్‌: మోరిస్‌ 4-0-17-2, సైనీ 3-0-17-1, సిరాజ్‌ 3-0-24-1, సుందర్‌ 4-0-20-2, చాహల్‌ 4-0-12-1, ఉడాన 2-0-19-1.

Advertisement
Advertisement
Advertisement