టార్గెట్‌... టీడీపీ

ABN , First Publish Date - 2021-06-25T05:15:16+05:30 IST

ప్రత్యర్థుల అడ్డు తొలగించుకొనేందుకు అధికార పార్టీ కొత్తఎత్తులు వేస్తోంది. టీడీపీ నాయకులే టార్గెట్‌గా పాత కేసులను తవ్వుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేందుకు వారిపై రౌడీషీట్‌ అస్త్రాన్ని సంధిస్తోంది. ఇందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించుకొనే పనిలో పడింది. ప్రత్యర్థులపై పాత కేసులు ఉంటే.. వాటిని తిరగదోడి రౌడీషీట్‌ ఓపెన్‌ చేసేలా ఉన్నత స్థాయి పోలీసు అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. ఈ ఆదేశాలను ఆచరణలో పెట్టే పనిలో డీఎస్పీలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరేలా జిల్లాలో టీడీపీ నాయకులే టార్గెట్‌గా రౌడీషీట్‌ నమోదు మొదలైంది.

టార్గెట్‌... టీడీపీ

- ప్రతిపక్ష నేతలపై రౌడీషీట్‌ అస్త్రం!

- గత కేసులను తవ్వే పనిలో పోలీసులు

- నాటి ప్రత్యర్థులే లక్ష్యంగా వేధింపులు

- ఇప్పటి వరకు 55మందిపై కేసుల నమోదు

- అధికార పార్టీ కొత్త ఎత్తులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రత్యర్థుల అడ్డు తొలగించుకొనేందుకు అధికార పార్టీ కొత్తఎత్తులు వేస్తోంది. టీడీపీ నాయకులే టార్గెట్‌గా పాత కేసులను తవ్వుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేందుకు వారిపై రౌడీషీట్‌ అస్త్రాన్ని సంధిస్తోంది. ఇందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించుకొనే పనిలో పడింది. ప్రత్యర్థులపై పాత కేసులు ఉంటే.. వాటిని తిరగదోడి రౌడీషీట్‌ ఓపెన్‌ చేసేలా ఉన్నత స్థాయి పోలీసు అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. ఈ ఆదేశాలను ఆచరణలో పెట్టే పనిలో డీఎస్పీలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరేలా జిల్లాలో టీడీపీ నాయకులే టార్గెట్‌గా రౌడీషీట్‌ నమోదు మొదలైంది. 

అచ్చెన్న, రవికుమార్‌పై కుటుంబాలపై..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై పాత కేసులు తిరగదోడి రెండు రోజుల కిందటే కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. మొన్నటి ఎంపీటీసీ ఎన్నికల్లో మాజీ విప్‌, టీడీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. వాస్తవానికి మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేదు. అధిష్టానం ఆదేశాల ప్రకారం ఎన్నికలకు దూరంగానే ఉంది. కానీ, అనేక చోట్ల టీడీపీ సత్తా చాటింది. గెలుపునకు దగ్గరగా ఓట్లను సొంతం చేసుకుంది. టెక్కలి నియోజకవర్గంలోని అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడ పంచాయతీలో కింజరాపు సురేష్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేష్‌ తండ్రి కింజరాపు హరిప్రసాద్‌పై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. అధికార పార్టీ తన మార్కు రాజకీయాలను అమలు చేసేందుకు ప్రత్యర్థులపై రౌడీషీట్లను తెరిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 2005 నుంచి నమోదైన వివిధ పెట్టీ కేసులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

 55 మంది టీడీపీ కార్యకర్తలపై..

ఇప్పటి వరకు జిల్లాలో 55 మంది టీడీపీ కార్యకర్తలపై వేర్వేరు పోలీసు స్టేషన్లలో రౌడీషీట్‌ నమోదు చేశారు. మొన్నటి పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొన్న వారిపై పాత కేసులుంటే స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. రెండు కంటే ఎక్కువ కేసులు ఉంటే వారిపై రౌడీషీట్‌ తెరుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లాలో పోలీసులు అచ్చెన్న సోదరులపై రౌడీషీట్‌ తెరిచినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రజల పక్షాన ఎటువంటి ఉద్యమాలు చేయకుండా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పకుండా చేసే వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలపై రౌడీషీట్‌ అస్త్రం ప్రయోగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీటికీ మాటికీ ముందస్తు అరెస్టులు, కౌన్సెలింగ్‌ల పేరుతో వారిని భయపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మరికొందరు ప్రత్యర్థులపై త్వరలోనే రౌడీషీట్‌లు తెరవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, న్యాయపోరాటం చేస్తామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ హెచ్చరించారు. పోలీసు అధికారులపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.

Updated Date - 2021-06-25T05:15:16+05:30 IST