సెల్‌ఫోన్‌ వివాదం వల్లే రౌడీషీటర్‌ హత్య

ABN , First Publish Date - 2020-07-03T09:52:03+05:30 IST

రౌడీషీటర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్‌ విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు తేలింది

సెల్‌ఫోన్‌ వివాదం వల్లే రౌడీషీటర్‌ హత్య

ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు


దిల్‌సుఖ్‌నగర్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్‌ విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు తేలింది. ఇద్దరు నిందితులను సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కత్తి, కారు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గౌలిపుర అయోధ్యనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ వినయ్‌(30), సంతోష్‌నగర్‌కు చెందిన సందీప్‌ కలిసి పలు నేరాలకు పాల్పడ్డారు. వీరిద్దరికీ పరిచయస్థుడైన సాయికిరణ్‌ అనే వ్యక్తి నుంచి వినయ్‌ గత నెలలో సెల్‌ఫోన్‌ కొనుగోలు చేశాడు. మోసం చేసి పాత ఫోన్‌ ఎక్కువ ధరకు విక్రయించాడని వినయ్‌ సాయికిరణ్‌ను మందలించాడు. ఈ విషయమై ఇరువురి మధ్య వివాదం నెలకొంది. రూ. 3 వేలు తిరిగి ఇవ్వాలని సాయికిరణ్‌ను వినయ్‌ బెదిరించాడు. దీంతో అతడు సందీ్‌పను ఆశ్రయించాడు.  డబ్బులు అడగొద్దంటూ సందీప్‌ వినయ్‌కు ఫోన్‌ చేసి బెదిరించాడు.


ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో వివాదం ముదిరింది. సందీప్‌ తన సోదరుడు సంతోష్‌, సాయి శ్రీనివాస్‌ ప్రసాద్‌, కుద్దు్‌సతో కలిసి వినయ్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గతనెల 24వ తేదీ సాయంత్రం సందీప్‌ గౌలిగూడలోని వినయ్‌ ఇంటికి వెళ్లగా లేడని అతడి తల్లి చెప్పింది. వాడి సంగతి చూస్తానంటూ సందీప్‌ బెదిరించి వచ్చాడు. విషయం తెలుసుకున్న వినయ్‌ సందీ్‌పకు ఫోన్‌ చేసి గొడవపడ్డాడు. పథకం ప్రకారం సందీప్‌ ముఠా అదేరోజు అర్ధరాత్రి వినయ్‌ను పీ అండ్‌ టీ కాలనీకి పిలిపించారు. అతడు అక్కడికి వెళ్లగానే నలుగురూ కత్తులతో దాడిచేసి హతమార్చారు. వినయ్‌ను చంపిన విషయం అతడి తల్లికి ఫోన్‌ చేసి చెప్పి పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు సందీప్‌, సాయి శ్రీనివాస్‌ ప్రసాద్‌ను గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2020-07-03T09:52:03+05:30 IST