గంజాయి స్మగ్లింగ్‌లో రౌడీషీటర్లు

ABN , First Publish Date - 2022-05-23T06:19:39+05:30 IST

ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు రౌడీ షీటర్లు గంజాయి స్మగ్లింగ్‌ బాటపట్టారు.

గంజాయి స్మగ్లింగ్‌లో  రౌడీషీటర్లు

పక్కా సమాచారంతో పెందుర్తి వద్ద మాటు వేసిన పోలీసులు

రెండు బైక్‌లపై తప్పించుకునేందుకు యత్నించిన నిందితులు

ఛేజింగ్‌ చేసి ఆనందపురం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు రౌడీషీటర్లు

మరొకరు కేరళకు చెందిన వ్యక్తి

25 కిలోల గంజాయి, రెండు తుపాకీలు, కత్తి, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం

నిందితులపై పీడీయాక్ట్‌ అమలు చేసే యోచనలో సీపీ


విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): 

ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు రౌడీ షీటర్లు గంజాయి స్మగ్లింగ్‌ బాటపట్టారు. జైల్లో పరిచయమైన సహ నిందితులను బెయిల్‌పై బయటకు రప్పించేందుకు, ఇతర అవసరాలకు డబ్బు అవసరం కావడంతో దానిని సులువుగా సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో మాటు వేయగా, తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే వారిని వెంబడించిన పోలీసులు ఆనందపురంలో నిందితులను పట్టుకుని, వారి నుంచి 25 కేజీల గంజాయి, రెండు పిస్టళ్లు, చాకు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ సంఘటనకు సంబంధించి ఏసీపీ త్రినాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ధోని సతీష్‌ అలియాస్‌ గసగసాలు దండుపాళ్యం గ్యాంగ్‌లోని కీలకసభ్యుడు. అతడిపై వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌సేషన్ల పరిఽధిలో పలు హత్య, హత్యాయత్నం, కొట్లాట కేసులు ఉండడంతో 2015లో పీడీయాక్ట్‌ కింద జైలుకి పంపించారు. ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ అతడి ఆగడాలు ఆగలేదు. గతనెలలో వన్‌టౌన్‌లో ఒక యువకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేయగా, మళ్లీ జైలుకు వెళ్లిన అతడు ఇటీవల బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత జైలులో ఉన్న తన స్నేహితులను బెయిల్‌పై విడిపించేందుకు డబ్బు అవసరం కావడంతో వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని కొంతమందిని బెదిరించడం, ఇవ్వకపోతే వారి నుంచి ఏడు బైక్‌లు, ఒక ఆటో లాక్కొని తన వద్ద ఉంచుకున్నాడు. నగరానికి చేందిన గసగసాలకు స్నేహితుడైన పతివాడ గౌరి సాయితేజ అలియాస్‌ గుర్రాల సాయిపై కూడా త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ వుంది. వీరిద్దరూ స్నేహితులతో కలిసి నగరంలో దందాలు చేస్తుంటారు. వీరిద్దరూ జైల్లో ఉన్నపుడు గంజాయి కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న కేరళకు చెందిన ఇబ్రహీం ముజామిల్‌తో పరిచయం ఏర్పడింది. ఇబ్రహీం ఈనెల 12న జైలు నుంచి విడుదలై గసగసాలు, సాయిలను కలిశాడు. వీరిద్దరూ వన్‌టౌన్‌లోని మసీదుప్రాంతానికి చెందిన కేస్మి శివ, వాసువానిపాలెంనకు చెందిన  వాడిశిల శ్రీను చర్చించుకుని, జైల్లో ఉన్న తమ స్నేహితులను విడిపించడంతోపాటు ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదించడం కోసం గంజాయి స్మగ్లింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 19న ఐదుగురు కలిసి రెండు బైక్‌లపై అరకు వెళ్లారు. అక్కడ 25 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, ఆదివారం మధ్యాహ్నం నగరానికి బయలుదేరారు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినాథరావు, ఎస్‌ఐ వాసునాయుడుకు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి పెందుర్తి వద్ద మాటువేశారు. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని వెంబడించి ఆనందపురం జంక్షన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 25 కిలోల గంజాయి, రెండు పిస్టళ్లు, ఒక చాకు లభించాయి. నిందితులను ఆనందపురం పోలీసులకు అప్పగించగా, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌ 

గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడిన రౌడీషీటర్లు గసగసాలు, గుర్రాలసాయిలను విచారించగా నగరంలో కొంతమందిని కొట్టి, బెదిరించి డబ్బులు గుంజామని, డబ్బులు ఇవ్వనివారి వాహనాలను లాక్కున్నామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఏడు బైక్‌లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. వారిపై పీడియాక్ట్‌ లేదా నగర బహిష్కరణ అమలుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహన యజమానులను స్టేషన్‌కు, పిలిచి ఎందుకు ఫిర్యాదు చేయలేదనే విషయంపై ఆరా తీస్తున్నారు. బాఽధితులు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీపీ కోరారు. సీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే నగరంలోని రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టామని, హద్దుమీరితే పీడీ యాక్ట్‌ లేదా నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.


పటిష్ఠంగా రాత్రి గస్తీ

స్టేషన్‌ పరిధిలో బాధ్యత ఎస్‌ఐలదే

పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ 


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో రాత్రి గస్తీ బలోపేతం చేయడంపై పోలీస్‌కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ దృష్టిసారించారు. స్టేషన్‌ పరిధిలో చేపడుతున్న నైట్‌రౌండ్స్‌లో కచ్చితంగా ఎస్‌ఐ స్థాయి అధికారి ఉండడాన్ని తప్పనిసరి చేశారు. దీనివల్ల రాత్రిపూట అనుమానితులను గుర్తించడం, ఏదైనా ఘటన జరిగితే సకాలంలో చేరుకుని తక్షణ ప్రాథమిక ఆధారాలను సేకరించడంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలుంటుందని ఆయన భావిస్తున్నారు. సాధారణంగా నగర పరిధిలో నైట్‌రౌండ్స్‌ విధుల్లో భాగంగా ప్రతి స్టేషన్‌ పరిధిలో కనీసం ఎస్‌ఐ స్థాయి అధికారి పెట్రోలింగ్‌ చేయాల్సి ఉంటుంది. గస్తీ తిరిగే నైట్‌ బీట్‌ సిబ్బంది సక్రమంగా పెట్రోలింగ్‌ చేసేలా ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతోపాటు అత్యవసరమైతే సిబ్బందికి అందుబాటులో ఉండేలా ఎస్‌ఐ కూడా నిరంతరం స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో రక్షక్‌ జీపులో గస్తీ తిరగాలి. సబ్‌డివిజన్‌ పరిధిలో సీఐ నైట్‌రౌండ్స్‌ డ్యూటీ చేస్తే, జోన్‌ పరిధిలో ఏసీపీస్థాయి అధికారి, నగరం మొత్తానికి ఏడీసీపీ స్థాయి అధికారి నైట్‌రౌండ్స్‌ ఓవరాల్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. డీసీపీ, సీపీ కూడా ఆకస్మికంగా నగరంలో రాత్రిపూట రౌండ్స్‌ తిరుగుతూ నగరంలో చోరీలు జరగకుండా నియంత్రించడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా కృషి చేస్తుంటారు. అయితే గత కొన్నాళ్లుగా నగరంలో నైట్‌రౌడ్స్‌ గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో నైట్‌రౌండ్స్‌ను హెడ్‌కానిస్టేబుల్‌/ఏఎస్‌ఐలకు అప్పగించేశారు. సీఐల స్థానంలో ఎస్‌ఐలు, ఏసీపీల స్థానంలో సీఐలు సర్దుబాటు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీనివల్ల రాత్రిగస్తీ నామమాత్రంగా మారిపోయిందనే అభిప్రాయం నెలకొంది. దీనివల్ల చోరీలు పెరగడంతోపాటు, రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరే ప్రమాదం ఉందని గుర్తించిన సీపీ దీనిని గాడిన పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్‌ పరిధిలో గతంలో మాదిరిగా ఎస్‌ఐ స్థాయి అధికారులు నైట్‌రౌండ్స్‌ ఇన్‌చార్జిలుగా వ్యవహరించాలని, సబ్‌ డివిజన్‌స్థాయిలో సీఐలు, జోన్‌స్థాయిలో ఏసీపీలు నైట్‌రౌండ్స్‌ తిరగాలని ఆదేశించారు. దీనివల్ల నగరంలో రాత్రి గస్తీ బలోపేతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Updated Date - 2022-05-23T06:19:39+05:30 IST