సందడి మొదలైంది!

ABN , First Publish Date - 2022-08-08T05:43:54+05:30 IST

మతసామస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది.

సందడి మొదలైంది!
విద్యుద్దీప వెలుగుల్లో బారాషహీద్‌ దర్గా

బారాషహీద్‌ దర్గాకు చేరుకుంటున్న భక్తులు

కిటకిటలాడుతున్న ‘స్వర్ణాల’ చెరువు


నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) ఆగస్టు 7 : మతసామస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల తర్వాత పండుగ జరుగుతుండటంతో దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఆ మేరకు జిల్లాయంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇక పండుగ రెండు రోజులు ఉందనగానే ఆదివారం దర్గా ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి కోరికల రొట్టెలను పట్టుకొంటున్నారు. మరోవైపు దర్గా ప్రాంగణంలో ఆదివారం రాత్రి విద్దుద్దీపాలు మిరుమిట్లు గొలిపాయి. 


ట్రాఫిక్‌ నియంత్రణ ఇలా..

రొట్టెల పండుగ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎస్పీ విజయరావు పర్యవేక్షణలో నగర ట్రాఫిక్‌ డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌, నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 10 చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు, 13 పెద్ద, 12 చిన్న పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటు, 750 మంది సిబ్బంది ట్రాఫిక్‌ విధుల్లో పాల్గొంటున్నారు.

పార్కింగ్‌ ప్రాంతాలు ఇవే!

చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి గూడూరు మీదుగా నెల్లూరుకు వచ్చే పెద్ద వాహనాలు (బస్సులు, లారీలు) జాతీయ రహదారిపై మెడికవర్‌ వైద్యశాల ముందు ఎస్వీజీఎస్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో నిలుపుకోవాలి. చిన్న వాహనాలు (కార్లు, ఆటోలు, మినీవ్యాన్‌లు, టెంపోలు) అయ్యప్పగుడి మీదుగా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, మినీబైపాస్‌ మీదుగా మాగుంటలేవుట్‌లోని సైన్స్‌ పార్కు ఓల్డ్‌ సీవీరామన్‌ స్కూలు వద్ద పార్క్‌ చేయాలి.

విజయవాడు, ఒంగోలు, కావలి మీదుగా నెల్లూరుకు వచ్చే పెద్ద వాహనాలు ఎస్వీజీఎస్‌ కళాశాల ప్రాంగణంలో పార్క్‌ చేయాలి. చిన్న వాహనాలు పెన్నాబ్రిడ్జి మీదుగా ఆత్మకూరు బస్టాండు, గాంధీబొమ్మ మీదుగా వచ్చి వీఆర్సీ, వైఎంసీ మైదానాల్లో పార్క్‌ చేయాలి.

అనంతపురం, కడప, బద్వేల్‌, ఆత్మకూరు, బుచ్చి మీదుగా నెల్లూరుకు వచ్చే పెద్ద వాహనాలు జొన్నవాడ మీదుగా పొట్టేపాలెం సమీపంలోని డీఎస్‌ఎన్‌ మినీ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్‌ చేయాలి. చిన్న వాహనాలను పొట్టేపాలెం మీదుగా ఇరుగాలమ్మ సంఘం వద్దకు చేరుకుని హెచ్‌పి పెట్రోల్‌బంకు సమీపంలో ఉన్న ఖాళీస్థలంలో పార్క్‌ చేయాలి.

రాపూరు, పొదలకూరు మీదుగా నెల్లూరుకు వచ్చే పెద్ద వాహనాలు తెలుగుగంగ కాలనీ సమీపంలోని ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ ఎదుట ఖాళీ స్థలంలో పార్క్‌ చేయాలి. చిన్న వాహనాలు పొదలకూరు రోడ్డులోని జడ్పీ బాలికల పాఠశాల ఆవరణలో పార్క్‌ చేయాలి.

వీఐపీ, వీవీఐపీ వాహనాలు కస్తూరిబా గార్డెన్స్‌, కస్తూరిబా గార్డెన్‌ ఎదురుగా ఉన్న స్థలంలో, డీకేడబ్ల్యూ కళాశాల, సాల్వేషన్మార్మీలో పార్క్‌ చేయాలి.

పోలీసు సిబ్బంది పోలీస్‌ పరేడ్‌ మైదానంలో, మున్సిపల్‌ సిబ్బంది మున్సిపల్‌ కార్యాలయంలో, రెవెన్యూ సిబ్బంది పాత టీబీ హాస్పిటల్‌ ఆవరణలో, ఇతరులు దర్గామిట్ట పోలీసుస్టేషన్‌, సెయింట్‌ జోసఫ్‌ ఎదుట పార్క్‌ చేయాలి. 

ఇక కేవీఆర్‌ పెట్రోల్‌బంకు, పొదలకూరు రోడ్డు, ఇరుగాళమ్మ టెంపుల్‌, బట్వాడిపాలెం కూడలిలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు రాకపోకలు సాగించేందుకు వీలుగా పాస్‌లు మంజూరు చేయనున్నారు. 


వాహనాలు దారిమళ్లింపు

రొట్టెల పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ నియంత్రణ కోసం నగరంలో వాహనాలు దారి మళ్లిస్తున్నారు. పొదలకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు పద్మావతి సెంటర్‌, రాజరాజేశ్వరి గుడి మీదుగా నెల్లూరులోకి అనుమతిస్తారు.

పొదలకూరు వైపు వెళ్లే వాహనాలు రాజరాజేశ్వరి గుడి, పద్మావతిసెంటర్‌ మీదుగా పొదలకూరురోడ్డులోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

జొన్నవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు మూలాపేట గేట్‌ సెంటర్‌ మీదుగా పాత బైపాస్‌ నుంచి నెల్లూరులోకి వచ్చేలా, అదే మార్గం గుండా జొన్నవాడ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

 



Updated Date - 2022-08-08T05:43:54+05:30 IST