కరోనాతో ''రోటీ వాలీ అమ్మ కష్టాలు.. నెట్టింట వైరల్!

ABN , First Publish Date - 2020-10-21T01:21:29+05:30 IST

కరోనా మహమ్మారి చాలామంది బీదవాళ్ల నోళ్లలో మట్టికొట్టింది. రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవితాలను దుర్భరం చేసింది. లాక్‌డౌన్‌తో వీళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు.

కరోనాతో ''రోటీ వాలీ అమ్మ కష్టాలు.. నెట్టింట వైరల్!

ఆగ్రా: కరోనా మహమ్మారి చాలామంది బీదవాళ్ల నోళ్లలో మట్టికొట్టింది. రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవితాలను దుర్భరం చేసింది. లాక్‌డౌన్‌తో వీళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ తొలగిస్తుండటంతో వీరు మళ్లీ తమ జీవనపోరాటంలో పడ్డారు. కానీ వీరి పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. ఇలా కరోనా కారణంగా దెబ్బతిన్న వారిలో ఆగ్రాలోని ''రోటీ వాలీ అమ్మ" కూడా ఒకరు.


కరోనా వల్ల బడాబడా పారిశ్రామిక సంస్థలే దెబ్బతిన్నాయి. ఇక వీధివ్యాపారుల దుస్థితి చెప్పక్కర్లేదు. వీరికి కరోనా కష్టాలు, కన్నీళ్లే మిగిల్చింది. అదీ ఈ వ్యాపారం చేసేది ముసలివాళ్లయితే ఆ బాధ వర్ణనాతీతం. లాక్‌డౌన్ తొలగినా కరోనా భయం మాత్రం ప్రజల్లో పూర్తిగా పోలేదు. బయట ఆహారం తీసుకోవడం తగ్గిపోయింది. దీంతో వీధిలో ఆహారం అమ్ముకునే వారు బాగా దెబ్బతిన్నారు.


ఇటీవలే ఆగ్రాకే చెందిన ఓ వృద్ధజంట నడుపుతున్న చిన్న బండిని, కరోనా కారణంగా వారు ఎదుర్కొన్న కష్టాలను ఓ నెటిజన్ చూశాడు. వారి గాధను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఆ వృద్ధజంటకు సాయం చేయడానికి ఆగ్రా మొత్తం కదిలింది. తెల్లారేసరికి ఆ వృద్ధజంట నడుపుతున్న బండి కాస్తా హోటల్‌గా మారిపోయింది. వారి జీవితానికి ఓ అండ దొరికింది.


ఇప్పుడు సోషల్ మీడియాలో ''రోటీ వాలీ అమ్మ" కూడా వైరల్ అవుతోంది. 20-30 ఏళ్లుగా ఓ రోడ్డుపై రొట్టెలు అమ్ముకుంటోందా బామ్మ. రూ.20కే నాలుగు రొట్టెలు రెండు కూరలు ఇస్తోంది. దీంతో రిక్షావాలాలు, కూలీలు ఆమె దగ్గరే ఎక్కువగా భోజనం చేసేవారు. కానీ కరోనాతో ఈ పరిస్థితి మారిపోయింది. అసలు కూలీలకు, రిక్షావాలాలకే పని దొరకడం కష్టమైంది. దీంతో రోటీవాలీ అమ్మ కష్టాలు మరింత పెరిగాయి.



రోటీవాలీ అమ్మ రొట్టెలు అమ్మే ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే కొందరు ఆమెకు చెప్పారట. ఆ ప్రాంతంలో ఇలా రొట్టులు అమ్మొద్దని కూడా అన్నారట. దీంతో ఎప్పుడు ఎవరొచ్చి తన దుకాణం మూయించేస్తారా? అని ఈ బామ్మ భయపడిపోతోంది. తనకు ఇద్దరు కుమారులున్నా ఎవరూ చూడటం లేదని, ఇలా తానే కష్టపడి బతుకు వెళ్లదీస్తున్నానని చెప్పింది. ఇలాంటి సమయంలో ఉన్న ఒక్క ఆధారం కూడా పోతే తాను ఎలా బతకాలని ఆవేదన చెందుతోంది. తనకు ఓ చిన్న  షాపు ఉంటే నిశ్చింతగా ఉంటుందని అంటోంది. మరి ఈమెను కూడా ఆగ్రావాసులు ఆదుకుంటారేమో చూడాలి.

Updated Date - 2020-10-21T01:21:29+05:30 IST