Ross Taylor: ఐపీఎల్ టీం యజమానిపై సంచలన ఆరోపణలు చేసిన రాస్ టేలర్

ABN , First Publish Date - 2022-08-14T00:24:18+05:30 IST

న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ రాస్ టేలర్(Ross Taylor) తన ఆటోబయోగ్రఫీలో ఐపీఎల్‌ ఫ్రాంచైజీపై షాకింగ్

Ross Taylor: ఐపీఎల్ టీం యజమానిపై సంచలన ఆరోపణలు చేసిన రాస్ టేలర్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ రాస్ టేలర్(Ross Taylor) తన ఆటోబయోగ్రఫీలో ఐపీఎల్‌ ఫ్రాంచైజీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘బ్లాక్ అండ్ వైట్’ అన్న టైటిల్‌తో వచ్చిన ఈ పుస్తకం ఈ వారమే విడుదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)కు టేలర్ ప్రాతినిధ్యం వహించాడు. పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్)తో జరిగిన మ్యాచ్‌లో చేజింగ్ చేస్తున్నప్పుడు టేలర్ డకౌట్ అయ్యాడు. తాను డకౌట్ అయినందుకు రాజస్థాన్ ఫ్రాంచైజీ యజమాని తన ముఖంపై కొట్టాడని ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. అంత గట్టిగా కొట్టలేదని పేర్కొన్నాడు. అయితే, అదంతా ‘నాటకమా? నటనా?’ అన్న విషయం తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు.


 ఆ మ్యాచ్ మొహాలీలో జరిగిందని, 195 పరుగుల విజయ లక్ష్యంతో తాము బ్యాటింగ్ ప్రారంభించినట్టు టేలర్ ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. ‘‘నేను ఎల్బీ అయి డకౌట్‌గా వెనుదిరిగాను. ఆ మ్యాచ్‌లో మేం లక్ష్యానికి దగ్గరగా కూడా మేం వెళ్లలేకపోయాం’’ అని టేలర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత తాము బసచేసిన హోటల్ పై అంతస్తులో ఉన్న బార్‌కి సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్ అందరం వెళ్లామని, అక్కడ నటి లిజ్ హార్లీ, షేన్‌వార్న్ కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నాడు.


అప్పుడు రాయల్ యజమనుల్లో ఒకరు  తన వద్దకు వచ్చి.. ‘రాస్.. నీకు మిలియన్ డాలర్లు ఇస్తున్నది డక్ అవుట్ కావడానికి కాదు’’ అంటూ తన ముఖంపై నాలుగుసార్లు కొట్టాడని టేలర్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆ తర్వాత అతడు నవ్వేశాడని, ఆ దెబ్బలు కూడా తనకు గట్టిగా తగల్లేదన్నాడు. అయితే, అదంతా నటనా? నాటకమా? అన్నది మాత్రం తనకు అర్థం కాలేదన్నాడు. ఈ విషయాన్ని తాను పెద్దగా చేయాలనుకోలేదని, అక్కడితో దానిని వదిలేశానని చెప్పుకొచ్చాడు. అయితే, ప్రొఫెషనల్ స్పోర్టింగ్ వాతావరణంలో ఇలా జరుగుతుందని తాను ఊహించలేదన్నాడు. 


టేలర్ రాలయ్ చాలెంజర్స్ బెంగళూరు తరపున 2008 నుంచి 2010 వరకు ఆడాడు. 2011లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే, అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు, పూణె వారియర్స్‌కు కూడా ఆడాడు. 

Updated Date - 2022-08-14T00:24:18+05:30 IST