నా ముఖం చూసి ఎగతాళి చేసేవారు

ABN , First Publish Date - 2022-08-12T09:23:41+05:30 IST

న్యూజిలాండ్‌ క్రికెట్‌ అంటేనే వివాదాలకు దూరంగా ఉండే జట్టుగా పేరుంది. ఆ టీమ్‌ ప్లేయర్స్‌ కూడా మైదానంలో చాలా హుందాగా ప్రవర్తిస్తూ అన్ని క్రికెట్‌ జట్ల అభిమానులను..

నా ముఖం చూసి ఎగతాళి చేసేవారు

న్యూజిలాండ్‌ జట్టులో రేసిజంపై రాస్‌ టేలర్‌

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ అంటేనే వివాదాలకు దూరంగా ఉండే జట్టుగా  పేరుంది. ఆ టీమ్‌ ప్లేయర్స్‌ కూడా మైదానంలో చాలా హుందాగా ప్రవర్తిస్తూ  అన్ని క్రికెట్‌ జట్ల అభిమానులను ఆకట్టుకుంటారనడంలో సందేహం లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగిన దాఖలాలు కూడా పెద్దగా కన్పించవు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే అంటున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కథ వేరేలా ఉంటుందని, సహచర ఆటగాళ్ల నుంచి తాను వివక్షకు గురైనట్టు సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆ జట్టులో కలకలం రేపుతోంది.


తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఈమధ్యే గుడ్‌బై చెప్పిన టేలర్‌.. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరిట రాసిన ఆటోబయోగ్రఫీలో పలు సంచలన విషయాలు పేర్కొన్నాడు. కివీస్‌ జట్టులో సమోవన్‌ తెగ (పసిఫిక్‌ మహా సముద్రంలోని దీవులకు చెందిన వారు)కు చెందిన తొలి ఆటగాడిగా టేలర్‌ ఉండేవాడు. అందుకే మిగతా క్రికెటర్లకు అతడంటే చిన్నచూపుగా ఉండేదట. ‘న్యూజిలాండ్‌లో క్రికెట్‌ అనేది పూర్తిగా శ్వేత జాతీయులకు చెందినదే. అలాంటి జట్టులో నేను కాస్త రంగు తక్కువ కలిగిన వాడిగా వివక్షను ఎదుర్కొన్నా. కానీ నా కెరీర్‌ అంతా సక్రమంగానే కొనసాగిందని బయటి ప్రపంచం భావించింది. సహచర ఆటగాళ్లే నా ముఖం గురించి కామెంట్‌ చేసేవారు.


నన్ను చూసి ఆసియా లేక భారత మూలాలకు చెందిన వాడినని భావించేవారు. పొరపాటున కివీస్‌కు ఆడుతున్నావని కామెంట్‌ చేసేవారు. నీవు సగం మాత్రమే మంచి వాడివని ఎగతాళి చేసేవారు (టేలర్‌ తల్లి సమోవా తెగకు చెందినది కాగా తండ్రి కివీస్‌). ఇదంతా డ్రెస్సింగ్‌ రూమ్‌కు పరిమితమయ్యేది. మైదానంలోకి వచ్చేసరికి అంతా మామూలుగానే అనిపించేది. అందుకే కివీస్‌ క్రికెట్‌లో వివక్ష ఎవరికీ కనిపించదు. ఆరంభంలో సరదాగా అంటున్నారని భావించా. కానీ అది ఆగకపోయేసరికి వివక్ష ఎదుర్కొంటున్నానని అర్థమైంది. అయితే జట్టు ప్రయోజనాలరీత్యా ఆటగాడిగా ఉన్నప్పుడూ ఈ విషయాలను బయటపెట్టలేదు’ అని టేలర్‌ పుస్తకంలో రాసుకొచ్చాడు. 

Updated Date - 2022-08-12T09:23:41+05:30 IST