భారత సంపన్న మహిళ రోష్నీ నాడార్‌

ABN , First Publish Date - 2022-07-28T08:39:05+05:30 IST

దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.

భారత సంపన్న మహిళ రోష్నీ నాడార్‌

రూ.84,330 కోట్లకు పెరిగిన ఆమె సంపద 

స్వయంశక్తితో ఎదిగిన వారిలో నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుణీ నాయర్‌ టాప్‌ 


తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 15 మంది

హైదరాబాద్‌ నుంచి 12 మందికి చోటు 

వైజాగ్‌ నుంచి ఇద్దరు, ఒకరు తిరుపతి నివాసి

దివీస్‌కు చెందిన నీలిమకు నాలుగో స్థానం 

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ నుంచే నలుగురు  

కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ - హురున్‌ లిస్ట్‌ విడుదల 

ముంబై: దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గత ఏడాదిలో ఆమె సంపద 54 శాతం వృద్ధి చెంది రూ.84,330 కోట్లకు పెరిగింది. కాగా, ప్రముఖ ఫ్యాషన్‌ పోర్టల్‌ నైకా.కామ్‌ వ్యవస్థాపకురాలు ఫాల్గుణీ నాయర్‌ స్వయంశక్తితో ఎదిగిన వారి లిస్ట్‌లో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతేకాదు, భారత టాప్‌-100 సంపన్న మహిళల జాబితాలో ఆమెదే రెండో స్థానం. కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌- హురున్‌ కలిసి బుధవారం విడుదల చేసిన ఈ లిస్ట్‌ ప్రకారం.. 59 ఏళ్ల నాయర్‌ ఆస్తి గత ఏడాది ఏకంగా 963 శాతం ఎగబాకి రూ.57,520 కోట్లకు చేరుకుంది. బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఆస్తి గత ఏడాదిలో 21 శాతం తగ్గి రూ.29,030 కోట్లకు పడిపోవడంతో ఆమె ర్యాకింగ్‌ కూడా 2 నుంచి 3వ స్థానానికి జారుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్‌ ల్యాబొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి దివీ కూతురు నీలిమ మోటపర్తి రూ.28,180 కోట్ల ఆస్తితో నాలుగో స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు, టాప్‌ టెన్‌ జాబితాలోని ఏకైక తెలుగు మహిళ కూడా. 


మరిన్ని వివరాలు.. 

జాబితాలోని వంద మంది సంపన్న మహిళల మొత్తం సంపద 2020 లో రూ.2.72 లక్షల కోట్లుగా నమోదు కాగా.. గత ఏడాది 53 శాతం వృద్ధి చెంది రూ.4.16 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ వంద మంది ఆస్తి దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతానికి సమానం. అంతేకాదు, ఈసారి జాబితాలో దాదాపు పాతిక శాతం మంది మొదటిసారిగా స్థానం దక్కించుకున్నవారే. 


కనీసం రూ.300 కోట్ల సంపద కలిగిన మహిళలను ఈ జాబితాలో చేర్చారు. గతంలో ఈ పరిమితి రూ.100 కోట్లుగా ఉండేది. అలాగే, టాప్‌ టెన్‌లో కనీసం రూ.6,620 కోట్ల ఆస్తి కలిగిన మాత్రమే చేర్చారు. గతసారి కంటే 10 శాతం అధికమిది. 


ఢిల్లీ నుంచి అత్యధికంగా 25 మందికి ఈ లిస్ట్‌లో చోటు దక్కగా.. ముంబై నుంచి 21, హైదరాబాద్‌ నుంచి 12 మంది ఉన్నారు. వైజాగ్‌ నుంచి ఇద్దరికి, తిరుపతి నుంచి ఒకరికి చోటు లభించింది. 


రంగాలవారీగా చూస్తే, అత్యధికంగా ఫార్మా నుంచి 12 మంది ఈ జాబితాలో స్థానం పొందారు. హెల్త్‌కేర్‌ నుంచి 11, కన్స్యూమర్‌ గూడ్స్‌ నుంచి 9 మంది ఉన్నారు. 


అపోలో హాస్పిటల్స్‌ నుంచి ఏకంగా నలుగురికి ఈ జాబితాలో స్థానం లభించింది. తద్వారా అపోలో హాస్పిటల్స్‌ అత్యధిక మంది సంపన్న మహిళలను అందించిన కంపెనీగా ఘనత దక్కించుకుంది. కాగా, మెట్రో షూస్‌, దేవి సీ ఫుడ్స్‌ నుంచి ఇద్దరి చొప్పున మహిళలకు ఇందులో చోటు దక్కింది. 


భోపాల్‌కు చెందిన ప్రైవేట్‌ చార్టర్డ్‌ విమాన సేవల సంస్థ జెట్‌సెట్‌గో సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కణిక టేక్రివాల్‌ ఈ జాబితాలోని అత్యంత పిన్న వయస్కురాలు. 33 ఏళ్ల టేక్రివాల్‌ ఆస్తి గత ఏడాది 50 శాత వృద్ధి చెంది రూ.420 కోట్లకు పెరిగింది. 


ఈ లిస్ట్‌లో ముగ్గురు ప్రొఫెషనల్‌ మేనేజర్లు కూడా ఉన్నారు. అంతర్జాతీయ శీతల పానీయాల కంపెనీ పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయీ రూ.5,040 కోట్ల ఆస్తితో అందరిలోకెల్లా అగ్రస్థానంలో ఉండగా.. హెడ్‌ఎ్‌ఫసీకి చెందిన రేణు సూద్‌ కర్నాడ్‌ రూ.870 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

Updated Date - 2022-07-28T08:39:05+05:30 IST