Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధిష్ఠానం మనిషి!

  • ఢిల్లీ అండతో సంక్షోభాలను ఈదిన రోశయ్య
  • అధినాయకత్వంతో సుదీర్ఘ అనుబంధం

న్యూఢిల్లీ, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధిష్ఠానంతో రోశయ్య అనుబంధం అత్యంత ప్రత్యేకమైనది. ముఖ్యమంత్రి కావాలన్న జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షను కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గలోనే తుంచేసి ఆయన్ను ముఖ్యమంత్రి చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పరిణామాలను రోశయ్య ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. తొలి రోజుల్లో జగన్‌ శిబిరం ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చినా అధిష్ఠానం రోశయ్యకు అండగా నిలిచింది. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రసక్తే లేదని, రోశయ్యను తాత్కాలికంగా  నియమించలేదని స్పష్టం చేసింది. అత్యంత అనుభవజ్ఞుడు, సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పరిపాలనలో తన సామర్థ్యం నిరూపించుకున్న నేత తన ఏడాది ముఖ్యమంత్రి పదవీకాలంలో మాత్రం అత్యంత కీలక రాజకీయ సంక్షోభ ఘట్టాలను ఎదుర్కొన్నారు. 2009 డిసెంబరు 9న  కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన రోజు రోశయ్య ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్‌ నిరాహార దీక్ష తర్వాత రాజకీయ పరిణామాలు తీవ్రతరం కావడంతో అధిష్ఠానం ఆదేశాల మేరకు డిసెంబరు 7న అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఎం, మజ్లిస్‌ తప్ప దాదాపు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని చెప్పాయి. అదే సందేశాన్ని తీసుకొని ఆయన 9న ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, వీరప్ప మొయిలీతో ఆంతరంగిక చర్చలు సాగించారు. ఈ చర్చల తర్వాతే తెలంగాణపై చిదంబరం ప్రకటన సిద్ధమైంది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిదంబరం ప్రకటన చేసే సమయానికి రోశయ్య హైదరాబాద్‌ చేరిపోయారు. అయితే ఆ ప్రకటనతో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఆంధ్ర నేతల రాజీనామాల పర్వం మొదలైంది. దీనితో తెలంగాణపై మరింత విస్తృత చర్చలు అవసరమంటూ చిదంబరం డిసెంబరు 23న మరో ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ నేతలూ రాజీనామా చేశారు. జగన్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కొని,కాంగ్రె్‌సను బలోపేతం చేసేందుకు రోశయ్య బదులు యువకుడైన నేత అవసరమని భావించిన అధిష్ఠానం 2010 నవంబరులో కిరణ్‌ కుమార్‌రెడ్డిని సీఎంగా నియమించింది. రోశయ్య సేవలను, విధేయతను మనసులో ఉంచుకుని తమిళనాడు గవర్నర్‌గా నియమించింది. 

Advertisement
Advertisement